close

తాజా వార్తలు

రాసింది కాదు.. ఇచ్చింది తీసుకోవాల్సిందే!

పేరుకే చికిత్సాలయాలు.. అంతటా మందుల కొరతే
 బీపీ మాత్ర¸ల కరవైన దైన్యం
నగర వ్యాప్తంగా ఈఎస్‌ఈ డిస్పెన్సరీలదీ చిత్రం
 తీవ్ర ఇబ్బందుల్లో కార్మికులు
ఈనాడు, హైదరాబాద్‌

‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందాన సాగుతోంది నగర వ్యాప్తంగా ఉన్న కార్మిక బీమా సంస్థ(ఈఎస్‌ఐ) వైద్య సేవల విభాగం వారి డిస్పెన్సరీ(చికిత్సాలయం)ల పరిస్థితి. గ్రేటర్‌ పరిధిలో ఉన్న అన్ని కేంద్రాలను ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది.  వీటి పరిధిలో దాదాపు 14 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాల వారు నమోదై ఉన్నారు. నిత్యం వందలాది మంది ఇక్కడికి వచ్చి పోతుంటారు. ప్రతి కేంద్రంలో 292 రకాల వరకు మందులను సరఫరా చేయాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితిని చూస్తే.. అందులో సగం రకాలే లభ్యమవుతున్నాయి. వైద్యులు రెండు రకాల గోలీలు రాస్తే ఇక్కడ ఒకటే చేతిలో పెడుతున్నారు. చేసేది లేక చాలామంది మందులను సొంత ఖర్చుతో బయట దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు.  ఈ డిస్పెన్సరీలకు వచ్చే వారిలో రోజూ కూలీలకు పనిచేసే కార్మికులే ఎక్కువ మంది. డబ్బులు పెట్టి మందులు కొనాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా కార్మిక బీమా కంపెనీకి చందా చెల్లిస్తున్నా సరే.. వైద్య సేవలు మాత్రం అందడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న ప్రధాన డిస్పెన్సరీలను ‘ఈనాడు బృందం’ పరిశీలించింది. ఇందులో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

రోగులు అధికం.. అవస్థలూ!

కూకట్‌పల్లి పరిధిలోని బాలానగర్‌ ఓల్డ్‌, సనత్‌నగర్‌-3, ఫతేనగర్‌ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో మందులు సరిగా లేక కార్మికులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల కొద్ది వేచిఉండి.. నంబరు రాయించుకొని తర్వాత వైద్యుడికి చూపించుకొని ఆయన రాసిన మందుల కోసమని వరుసలో నిలిస్తే.. తీరా లేవన్న సమాధానం వస్తోందని వాపోతున్నారు. రెండు, మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. బీపీ, మధుమేహం, నరాల బలహీనత, థైరాయిడ్‌ వంటి ముఖ్యమైన ఇబ్బందులు ఎదుర్కొనే వారికి మందులు సరిగా పంపిణీ కావడం లేదు. బాలానగర్‌ ఓల్డ్‌, సనత్‌నగర్‌-3 డిస్పెన్సరీలో రోజుకు 500మంది రోగులను పరీక్షిస్తున్నారు. 250 మందికి సరిపడా మందులే ఇస్తున్నారు. ఫతేనగర్‌ డిస్పెన్సరీలో రోజుకు 120మందికి పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడా పూర్తిస్థాయిలో మందుల సరఫరా లేదు.
-కూకట్‌పల్లి, న్యూస్‌టుడే

కొన్నే ఇస్తున్నారు
-పవన్‌కుమార్‌, బాలానగర్‌

నేను ఫిట్స్‌తో బాధపడుతున్నాను. కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తా. మందులు వేసుకుంటేనే పరిస్థితి అదుపులో ఉంటుంది. సెప్టెంబరు వరకు సరిగానే మందులు ఇచ్చేవారు. ఇప్పుడు 15 రోజులకు మాత్రమే ఇస్తున్నారు. కంపెనీలో పని మానుకొని నెలలో ఒకటి, రెండుసార్లు తిరగాల్సి వస్తోంది.
బయట కొంటున్నాం.

శివ, జగద్గిరిగుట్ట

నాన్న నరాల వ్యాధి బారిన పడటంతో  గతంలో వైద్యులకు చూపించాం. మూడు నెలలుగా ఆ మందులు డిస్పెన్సరీలో లేవంటున్నారు. బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబుకు తప్ప ఏ సమస్యకూ సరిగా మందులివ్వడంలేదు.

మెట్లు ఎక్కలేక.. దిగలేక

‘‘సారూ దూపైతంది.. షుగర్‌ పరీక్ష చేయండి.. తిని గోలేసుకోవాలి.. దేవుడా ఈ మెట్లు ఎట్టా ఎక్కేను.. ఇక్కడ గోలీలు లేకపోతే ఎక్కడికి పోవాలి...’’  ఇదీ కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌ ఎంఐజీ 658లో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి వచ్చే రోగుల మొర. డిస్పెన్సరీకి వచ్చాక మొదటి అంతస్తు మెట్లు ఎక్కాలంటే ఒక ప్రయాస. కష్టపడి ఎక్కితే తీరా ఓపీ రాసే గదికి తాళం ఉంటుంది. పరిగడుపున వచ్చి మధుమేహ పరీక్ష చేయంచుకోవాలంటే 9.15 గంటల వరకు నిరీక్షించాల్సిందే. అప్పటి వరకు ల్యాబ్‌ సిబ్బంది రారు. పరీక్ష చేయించుకునేందుకు వచ్చిన వృద్ధుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చంటి పిల్లలతో వచ్చిన తల్లులు, వృద్ధులు, గాయాలపాలైన వారు నానా అవస్థలు పడుతున్నారు. రోగులను మందు కొరత వేధిస్తోంది.

షుగర్‌ గోలీలు లేవన్నారు.. - బాచుపల్లి నుంచి వచ్చిన ఓ వృద్ధుడి ఆవేదన
నాకు గుండె సంబంధిత వ్యాధితో పాటు మధుమేహం ఉంది. గుండెకి సంబంధించి సుమారు రూ.వెయ్యి విలువైన మాత్రలే ఇక్కడున్నాయి. మధుమేహం వ్యాధి గోలీలు మాత్రం లేవు. వాటిని బయట కోనుగోలు చేయాల్సి వస్తోంది.

-కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే

తప్పని నిరీక్షణ

చాలా డిస్పెన్షరీల్లో వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. దీంతో రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. కేపీహెచ్‌బీ కేంద్రంలో 9 గంటలు దాటిన తర్వాతే సిబ్బంది వస్తున్నారు. కొన్ని రక్త పరీక్షలకు పరగడుపున చేయాలి. తీవ్ర నిరీక్షణ కొనసాగడంతో పలువురు కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఇక ఓపీ ప్రారంభమైన తర్వాత పరీక్షలు చేసి మందులు ఇవ్వాలి. ఎవరికీ సక్రమంగా సరఫరా చేయడం లేదు. బీమా వైద్య సేవల కోసం ఈఎస్‌ఐ రాష్ట్రానికి ఏటా రూ.540 కోట్ల వరకు విడుదల చేస్తోంది. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం...అధికారుల అవినీతి, అక్రమాలతోనే సకాలంలో మందులను అందించలేకపోతున్నారు. ఆ ప్రభావం కార్మికుల అందించే ఆరోగ్య సేవలపై పడుతోంది. ప్రస్తుతం చాలా డిస్పెన్షరీల్లో ప్రాథమిక చికిత్సలో అందించే పారాసిటమాల్‌ మాత్రలు కూడా లేవంటే పరిస్థితి ఎంతో దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత్యంతరం లేక ఇచ్చే వాటితోనే రోగులు సర్దుబాటు చేసుకుంటున్నారు.

తిరిగి తిరిగీ తిప్పలే!

సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ-1, 2లలో చాలా వరకు మందులు అందకపోవడంతో ప్రతీ రోజు రోగులు అధికారులతో గొడవ పడుతున్నారు. ఈఎస్‌ఐసీ, ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో సిఫారసు చేసిన మందులు లేవంటూ తిప్పి పంపుతుండటమే అందుకు కారణం. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు, హృద్రోగం, క్యాన్సర్‌కు సంబంధించిన మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ 100 రకాలకు మించి మందులు అందడం లేదు. ఫతేనగర్‌కు చెందిన ఓ మహిళ కంటి సమస్యలకు చికిత్సలందించిన ఈఎస్‌ఐసీ వైద్యులు మందులను సిఫారసు చేశారు. తీరా డిస్పెన్సరీకి వస్తే మందులు లేవు.. బయట కొనుగోలు చేసుకోమన్నారని ఆమె వాపోయారు. సనత్‌నగర్‌కు చెందిన మరో రోగి మధుమేహం మందుల కోసం ప్రతీ రోజు తిరుగుతూనే ఉన్నాడు.

సిబ్బందే వెళ్లి తెచ్చుకోవాలి..
ఇటీవల ఈఎస్‌ఐలో మందుల కుంభకోణం వెలుగు చూసిన తరువాత అసలు మందులను కొనుగోలు చేయడమే లేదని ఇక్కడి సిబ్బంది తెలిపారు. అరకొర మందులను కూడా డిస్పెన్సరీలకు సరఫరా చేయడం లేదు. అవసమైతే డిస్పెన్సరీ సిబ్బంది తమ సొంత ఖర్చులతో గోడౌన్‌కు వెళ్లి మందులను ఆటోలో తీసుకురావాల్సి వస్తోంది.

-సనత్‌నగర్‌ , న్యూస్‌టుడే

ఎందుకీ పరిస్థితి?

ఈఎస్‌ఐలో స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత డైరెక్టర్‌, ఇతర  అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. తరువాత కొత్త డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించినా.. ఇంకా పరిస్థితి మారలేదు. ఫార్మా కంపెనీలకు కొనుగోలు ఉత్తర్వులు ఇచ్చిన   45 రోజుల తర్వాత కానీ మందుల సరఫరా కావడం లేదు. కొనుగోలు   ఉత్తర్వులే సవ్యంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

ఇరుకు గదుల్లో.. సౌకర్యాలకు దూరంగా!

గోల్కొండ బడాబజార్‌లోని డిస్పెన్సరీ అరకొర వసతుల నడుమ కొనసాగుతోంది. ఇరుకైన 4 గదుల్లో ఆసుపత్రిని నెట్టుకొస్తున్నారు. ఓ గదిలో ల్యాబ్‌, ఉండగా మిగతా మూడు గదుల్లో రోగుల రిజిస్ట్రేషన్‌, మెడికల్‌ అధికారి గదితో పాటు రోగులను పరిక్షించేందుకు చిన్న గదులు ఉన్నాయి. కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు. వరండాలో మందులను పంపిణీ చేస్తున్నారు. రక్తపోటు మందుల కొరత ఉంది. కొన్ని మందులను బయట కొనుగోలు చేయాలని మందులిచ్చే సిబ్బంది సూచిస్తున్నారు.

15 రోజులకే ఇస్తున్నారు: బాలనర్సమ్మ, గోల్కొండ
గతంలో నెలకు సరిపడా మందులు ఇచ్చే వారు, కొన్నేళ్లుగా 15రోజులకే ఇస్తున్నారు. ఈ వయసులో తరచూ ఆసుపత్రి చుట్టూ తిరగాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గండిపేట, ఖానాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి కార్మికులు ఇక్కడికి వస్తుంటారు. రానుపోను ఆటో కిరాయిలకే డబ్బులు ఖర్చవుతున్నాయి.

-గోల్కొండ, న్యూస్‌టుడే

మారుమూల.. అద్దె ఇంటిలో..

పారిశ్రామికవాడల్లో పని చేస్తున్న కార్మికులకే ఈఎస్‌ఐ డిస్పెన్సరీ అందని ద్రాక్షగా మారిన చిత్రమిది. చర్లపల్లి పేరుతో నిర్వహిస్తున్న డిస్పెన్సరీ గతంలో రాధికా చౌరస్తాలోని అణుపురం కాలనీలో ఉండేది. ప్రస్తుతం కాప్రా జమ్మిగడ్డ సమీపంలోని ఎల్లారెడ్డిగూడ హన్మాన్‌నగర్‌లో అద్దె ఇంట్లోకి మార్చారు. ఎక్కడో మూలన.. అదీ సౌకర్యాలు లేని చోటికి మార్చడంతో కార్మికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. కుషాయిగూడ, చర్లపల్లి, నేరేడ్‌మెట్‌, ఓల్డ్‌ సఫిల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న కార్మికులకు చాలా దూరంగా ఉంది. ఎల్లారెడ్డిగూడకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా లేదు. ఫేస్‌2 చర్లపల్లి పారిశ్రామికవాడలోని సురానా చౌరస్తాలోనూ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ నడుస్తోంది.
-కాప్రా, కుషాయిగూడ, న్యూస్‌టుడే

సమస్యలే ఎక్కువ.. వైద్యులు తక్కువ

మల్కాజిగిరి ఆర్కేనగర్‌లోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి వచ్చే రోగులకు సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. ముగ్గురు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు వైద్యాధికారిణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెలవులోఉన్న వారికి అవసరమైన పత్రాలు ఇవ్వడానికి, తీవ్రవైన వ్యాధులతో బాధపడే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇతర అస్పత్రిలకు తరిలించేందుకు పత్రాల జారీకే సమయం సరిపోవటం లేదు. అవసరమైన మేర మందులూ అందుబాటులో లేవు. ఉరోగాలను నిర్ధారించేందుకు తగిన ప్రయోగశాల కూడా లేదని రోగులు తెలిపారు. పోరుగు సేవల ఉద్యోగులకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

రానుపోను ఖర్చులే ఎక్కువ: నాగేశ్వరరావు, కార్మికుడు

ఇక్కడ పూర్తిస్థాయి ప్రయోగశాలలేక నాచారాం, ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు ఇబ్బందిగా ఉంది. అక్కడి వెళ్లి రావాడానికి ఖర్చు పెరుగుతోంది. రోజుల తరబడి చికిత్సలు తీసుకుంటున్న వైరల్‌ జ్వరాలు తగ్గటం లేదు. నాణ్యమైన మందులను అందించాలి.
-మల్కాజిగిరి, న్యూస్‌టుడే

జీతంలో రూ.2వేల పైనే వెచ్చిస్తున్నాం..
-కృష్ణ దంపతులు, అల్వాల్‌

సెక్యూరిటీలో పనిచేసే నేను మూడు నెలలుగా మందులను బయట కొనుగోలు చేస్తున్నాను. నా భార్యకు మధుమేహం, బీపీ, మెడ సంబంధమైన రుగ్మతలతో డిస్సెన్సరీకి వెళుతున్నాం. నా జీతం రూ.10వేలు. ఇక్కడ మందుల్లేక వాటిని కొనడానికే రూ. 2వేల పైనవుతోంది. ఆర్థిక భారం పడుతుంది.

డైరెక్టరేట్‌ కేంద్రం... ఇక్కడే దిక్కు లేదు!

గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న ఈఎస్‌ఐ కవాడిగూడ డిస్పెన్సరీలో మూడు నెలలుగా సరైన మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీపీ, షుగర్‌ లాంటి మందులూ అందుబాటులో లేవు. నేడు..రేపు రావాలని చెబుతున్నారు. అదే ఆశతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. బయట కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. మందులను సరఫరా చేయాలంటూ ఇటీవలే కార్మికులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. నగరంలోని అన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు డైరెక్టరేట్‌ కార్యాలయం కేంద్రంగానే వెళుతుంటాయి. అదే కార్యాలయం ఆవరణలో ఉన్న డిస్పెన్సరీలోనే మందులు లేవంటే మిగతా వాటి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదని కార్మికులు వాపోతున్నాన్నారు.
-పద్మారావునగర్‌, న్యూస్‌టుడే

మరి కొన్ని కేంద్రాల్లో ఇలా..

* అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌.. రెండు డివిజన్‌ల డిస్పెన్సెరీలు ఖైరతాబాద్‌లోనే నడుస్తున్నాయి. కనీసం రక్తపోటు, మధుమేహం, నొప్పులకు ఇచ్చే మాత్రలు కూడా లేవని రోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చాలా మందుల సరఫరా కొన్ని నెలలుగా నిలిచిపోయింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బీరంగూడకు చెందిన భూషయ్య, ఖైరతాబాద్‌కు చెందిన రాజారావు, రాజ్‌భవన్‌ మక్తావాసి అమీన్‌ఖాన్‌, ఎమ్‌ఎస్‌ మక్తాకు చెందిన భానుప్రసాద్‌, యంయస్‌ మక్తాకు చెందిన అటియాబెగం తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.
* హబ్సిగూడలోని ఈఎస్‌ఐ వైద్యశాలకు నిత్యం సుమారు 400మంది వస్తుంటారు. మందులను మాత్రం అరకొరగా ఇచ్చి పంపిస్తుంటారని రోగులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు. చిన్నిచిన్న రోగాలకు మాత్రం మందులను ఇస్తారు.. దీర్ఘకాలిక వ్యాధులకు బయట కొనుక్కోమంటున్నారని రోగులు తెలిపారు.
* అల్వాల్‌, రాణిగంజ్‌ పరిధిలోని కార్మికులకు డిస్పెన్సరీ లోతుకుంటలోని అద్దె గదిలో కొనసాగుతోంది. నిత్యం 250 మంది సందర్శించే ఈ కేంద్రంలో ఇద్దరే వైద్యులు పరీక్షలు చేసి మందులు రాస్తారు. మరో వైద్యుడి పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. స్వీపర్‌, డ్రెస్సింగ్‌, సపాయి కార్మికులుగా శాశ్వత సిబ్బంది లేరు. మందుల కొరతా మూమూలే.
* బోరబండ స్నేహపురి కాలనీలో పాతికేళ్ల కిందట ఏర్పాటైన డిస్పెన్సరీ పరిసర ప్రాంతాల వాసులకు సౌకర్యంగా ఉండేది. రోజూ వందమందికి పైగా రోగులు వచ్చేవారు. రెండేళ్ల కిందట ఈ డిస్పెన్సరీని సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ క్వార్టర్స్‌ వద్దకు మార్చడంతో రోగులకు కష్టాలు తప్పడంలేదు. జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలలో బోరబండ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది పనిచేస్తున్నారు. బోరబండ ప్రాంతంనుంచి తరలించిన డిస్సెన్సరీ కనీసం బస్టాపు, ప్రధాన రహదారికి చేరువగా కాకుండా దాదాపు కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేశారు. దీంతో అవస్థలు తప్పడం లేదు.
- పంజాగుట్ట, హబ్సిగూడ, అల్వాల్‌, బోరబండ - న్యూస్‌టుడే

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.