close

తాజా వార్తలు

రంగుల కళవో!   

కోటింగ్‌తో కొత్త రూపు

మోజు పడి కొన్న బండి..తళతళా మెరిసిపోవాలని ఆశ...టెఫ్లాన్‌ కోటింగ్‌ వేయించాలా? సిరామిక్‌కి ఓటేయాలా? చాలామంది సంశయం! ఫిల్మ్‌ కోటింగ్‌కి వెళ్తే బాగుంటుందా? గ్లాస్‌ పాలిష్‌ చేయాలా? ఎవరూ తీర్చలేని సందేహం! దేనికెంత ఖర్చవుతుంది? ఏది ఎన్నాళ్లు నిలిచి ఉంటుంది?ఈ అనుమానాలన్నీ నిపుణుల ముందుంచాం...వారు చెప్పిన సమాచారం ఇదిగో.

కాలం చెల్లిన కారైనా, బాగా వాడిన బండైనా మళ్లీ మెరిసిపోవాలంటే శుభ్రం చేయాలి లేదా సర్వీసింగ్‌కి ఇవ్వాలి. అలా చేస్తే ఎన్నాళ్లు కొత్తగా ఉంటుంది? మహా అయితే వారం పదిరోజులు. ఏళ్లపాటు నిలిచిపోవాలంటే మాత్రం వాహనానికి కోటింగ్‌ పడాల్సిందే. 
కోటింగ్‌ అన్నా పెయింటింగ్‌ అన్నా ఇందులో ముఖ్యంగా ఉండేవి మూడు రకాలు. టెఫ్లాన్‌, సెరామిక్‌, ఫిల్మ్‌ ప్రొటెక్షన్‌ కోటింగ్‌. ఇందులో ఏది ఎంచుకున్నా ముందు వాహనాన్ని నీటితో శుభ్రంగా కడుగుతారు. తర్వాత కంపౌండింగ్‌ ప్రాసెస్‌ మొదలవుతుంది. ఆపై ఐపీఏ ఆల్కహాల్‌ పెట్టి వాహనాన్ని శుభ్రం చేస్తారు. తర్వాత రసాయనాలు అప్లై చేసి రోటరీ పాలిషర్‌తో, డ్యుయెల్‌ యాక్షన్‌ పాలిషర్‌తో బాడీని మరింత శుభ్రం చేస్తారు. ఈ ప్రాసెస్‌ ముగిశాక టెఫ్లాన్‌ కోటింగ్‌ వేయాలా? సెరామిక్‌ కోటింగ్‌ వేయాలా? మరేదైనా చేయాలా? నిర్ణయిస్తారు.

టెఫ్లాన్‌ కోటింగ్‌ :  అందుబాటు ధరలో 
వాడుకలో దీన్ని అంతా ఫ్లాన్‌ కోటింగ్‌ అంటున్నారుగానీ నిజానికి ఇది పెయింట్‌ రీస్టోరేషన్‌. కారు లేదా బైక్‌ని శుభ్రం చేసిన తర్వాత వాటి బాడీపై ఫ్లోరో పాలిమర్‌ని పూసి రోటరీ పాలిషర్‌తో రుద్దుతారు. బండి మీద ఫామ్‌ అయి ఉన్న దాదాపు ఒక మైక్రాన్‌ డల్‌ లేయర్‌ తీసేసి 0.2 మైక్రాన్ల మందంతో ఒక లేయర్‌ వేస్తారు. పెయింటెడ్‌ ప్యానెళ్ల మీద ఇది ఒక రక్షణాత్మక పొరలాగా ఏర్పడుతుంది. నిజానికి ఇది పాలీ టెట్రా ఫ్లోరో ఎథిలీన్‌ అనే సింథటిక్‌ వాక్స్‌. ప్రక్రియ పూర్తయ్యాక బండిని కాసేపు ఆరబెట్టగానే మెరుపు వచ్చేస్తుంది. ఇది కనీసం ఆర్నెళ్లైనా నిలిచి ఉంటుంది. కారుకి రూ.ఐదువేలు, మోటార్‌సైకిల్‌కి రెండువేలు ఖర్చవుతుంది.

సెరామిక్‌ కోటింగ్‌ :  ఖరీదు, మన్నికా ఎక్కువే 
తమ వాహనం ఎక్కువ కాలం కొత్తగా ఉండాలని కోరుకునేవాళ్లు దీన్నే ఎంచుకుంటున్నారు. దీన్నే నానో కోటింగ్‌ అంటున్నారు. దీంట్లో కూడా ఎప్పటిలాగే ముందు వాహనాన్ని శుభ్రం చేసి బొగ్గు, సిలిక మిశ్రమంతో తయారైన సిలికాన్‌ కార్బైడ్‌ రసాయనాన్ని పోత పోస్తారు. ఆరిన తర్వాత దాదాపు 30 మైక్రాన్ల మందం ఉండే ఈ లేయర్‌ అత్యంత దృఢంగా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 12గంటల సమయం పడుతుంది. ఇంకో 12గంటలు ప్రత్యేకంగా అమర్చిన అరల్లో ఆరబెడతారు. కారుకి రూ.25వేలు, బైక్‌కి రూ.5వేలు ఖర్చవుతుంది.       సెగ్మెంట్‌, పరిమాణాన్ని బట్టి మార్పులుంటాయి. ఏళ్లపాటు నిలిచి ఉంటుందిది.

పెయింట్‌ ప్రొటెక్షన్‌ ఫిల్మ్‌ :  కలకాలం నిలుస్తుంది 
కారు ఎక్కువకాలం మెరిసిపోవడమే కాదు.. పెద్దపెద్ద స్క్రాచెస్‌ నుంచి కూడా వాహనానికి రక్షణ కావాలంటే పెయింట్‌ ప్రొటెక్షన్‌ ఫిల్మ్‌తో సాధ్యం. దీనికోసం కారుకి దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఎప్పట్లాగే బండిని శుభ్రం చేశాక అధెసివ్‌ కెమికల్‌ వేసి ఫిల్మ్‌ని బాడీకి అతికిస్తారు. అద్దాలు, గ్రిల్‌ ఇలా అవసరం లేనిచోట తొలగిస్తారు. ఇందులో సాధారణంగా ట్రాన్స్‌పరెంట్‌ థర్మోప్లాస్టిక్‌ ఫిల్మ్‌ వాడతారు. వెంచర్‌ షీల్డ్‌ ఫిల్మ్‌ ఖరీదు మరింత ఎక్కువ. ఇది వేయిస్తే స్క్రాచ్‌ పడ్డచోట వేడినీళ్లు పోసినా, బండిని ఒకట్రెండు గంటలు ఎండలో పెట్టినా గీతలు మటుమాయం అవుతాయి. ఇది దాదాపు పదేళ్లవరకు ఉంటుంది. 
* ఇవి కాకుండా గ్లాస్‌ పాలిష్‌, ట్రైజాక్ట్‌, యాంటీ కరోజన్‌ ట్రీట్‌మెంట్‌, రాప్స్‌ అనేవి కూడా ఉంటాయి.

ఇవీ ప్రయోజనాలు.. 
కోటింగ్‌ చేసిన వాహనాల బాడీపై ఎట్టి పరిస్థితుల్లోనూ తుప్పు పట్టదు. చిలుము చేరదు. 
దుమ్ము, ధూళి, పక్షుల రెట్టలు వాహనాల ఉపరితలంపై పడ్డప్పుడు నిలిచి ఉండకుండా జారిపోతాయి. 
మట్టి, బురద, నీరు, ఆయిల్‌, చూయింగ్‌ గమ్‌ మరకలు  వాహనాలపై పడ్డా ఒక్కసారి తుడిస్తే పోతాయి. 
వాహనాలతో ఒరుసుకుపోయినపుడు, ఇతర వస్తువులతో రాసుకున్నపుడు గీతలు పడ్డా మాయమవుతాయి. 
పొడిగుడ్డతో గట్టిగా తుడిచినపుడు పడిన మరకలు తొలగిపోతాయి. 
కోటింగ్‌ చేస్తే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణగా ఉంటాయి. రంగు వెలిసిపోయి డల్‌గా తయారవవు. 
అత్యుత్తమ నాణ్యత కల్గిన 9హెచ్‌. కెమికల్‌తో కోటింగ్‌ చేస్తే పెద్దపెద్ద స్క్రాచ్‌లు కూడా మటుమాయం అవుతాయి. 
దుమ్ము, ధూళి చేరకపోవడంతో వాహనాల సర్వీసింగ్‌ ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. 
రాత్రి సమయాల్లో ప్రయాణిస్తుంటే దోమలు, చిన్నచిన్న పురుగులు పడి వాహనాల బాడీకి అతుక్కుపోతాయి. చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి. పెయింటింగ్‌/కోటింగ్‌ వేసిన బాడీకి ఆ సమస్య ఉండదు. 
మన వాతావరణంలో తేమశాతం ఎక్కువ. దీంతో కొన్నేళ్లలోనే వాహనాల రంగు డల్‌ అయిపోతుంది. కోటింగ్‌తో ఆ భయం ఉండదు.

నిపుణులతో వేయించాలి

చాలామంది తమ కారు, బైక్‌ని కుటుంబసభ్యుల్లో ఒకరిలా అపురూపంగా చూసుకుంటారు. బండిని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాంటివారు ఎక్కువగా కోటింగ్‌ చేయిస్తారు. దీంతో చాలా ప్రయోజనాలున్నాయి. అదేసమయంలో కోటింగ్‌ చేయించడం వల్ల వాహనంపై అసలేం గీతలు, మరకలు పడవు అనేది కూడా నిజం కాదు. కోటింగ్‌ చిన్నచిన్న గీతల నుంచి రక్షణ ఇస్తుందిగానీ పూర్తిగా కాపాడలేదు. ఇక కోటింగ్‌/పెయింటింగ్‌తో వాహనం అసలు రంగు పాడవుతుంది అని కొందరి భావన. ఇది అపోహే. నిపుణులు, సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌తో ఈ ప్రక్రియ చేయించనప్పుడే వాహనం రంగు దెబ్బతినే అవకాశం ఉంది. ఇందులో వాడే రసాయనాలు సైతం నాణ్యతతో కూడినవి ఉండేలా వాహన యజమానులు చూసుకోవాలి.
- గణేశ్‌, 3ఎం కార్‌కేర్‌ మేనేజర్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.