close

తాజా వార్తలు

చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని

చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని

కాంపౌండు గొడవలు తెలీదు. రాజకీయాలకు దూరం. స్నేహం చేయడం బలహీనతగా మార్చుకున్నవాడు.. అందుకే ‘అందరివాడు’ అనిపించుకున్నాడు. సినిమాల్లో సెంచరీ చేసిన అతికొద్ది మందిలో శ్రీకాంత్‌ ఒకడు. ఇప్పుడు తన స్కోరు.. 125. ఇటీవల విడుదలైన ‘ఆపరేషన్‌ 2019’తో ఆ మైలు రాయిని అందుకున్నాడు శ్రీకాంత్‌. ఈ సందర్భంగా సరదాగా ‘హాయ్‌’తో ముచ్చటించాడు. పిల్లలు, కుటుంబం, సినిమాల గురించి విషయాలు వెల్లడించారు.

‘‘మా ఇద్దరబ్బాయిలకూ క్రికెట్‌ అంటే ఇష్టం. రోషన్‌ అండర్‌ 16 ఆడాడు. చిన్నప్పటి నుంచీ నాకు క్రికెట్‌ అంటే ఇష్టం. మా ఊర్లో.. చేల మధ్యన చెక్క బ్యాటులు పట్టుకుని తెగ ఆడేసేవాడ్ని. అయితే అప్పుడు అన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. జాతీయ జట్టుకు ఎలా ఎంపికవుతారు? అనే విషయంలోనూ అవగాహన ఉండేది కాదు. అందుకే.. నా ఆట పల్లెటూరు వరకే పరిమితం అయ్యింది. రోషన్‌ని క్రికెటర్ని చేద్దామనుకున్నా. నా ఇష్టాల్ని వాడిపై రుద్దేశా. పొద్దుటే 5 గంటలకు లేపి గ్రౌండ్‌కి పంపేవాడ్ని. కాకపోతే వాడి దృష్టి సినిమాలపై పడింది.’’
‘‘విరోధి సినిమాకి నిర్మాతగా వ్యవహరించా. అది చాలా మంచి సినిమా. అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం నా మనసు నిర్మాణం జోలికి వెళ్లడం లేదు. నాలాంటి వాళ్లు సినిమాలు తీయకూడదు. గ్యారెంటీగా డబ్బులు పోతాయి. ఎందుకంటే నాకేమో మొహమాటం. ఓ మాట పడలేం.. అనలేం. గీచి గీచి బేరాలు చేయలేం. మా అబ్బాయిలు హీరోలు అవుతున్నారు కదా? వాళ్లకోసమైనా అప్పుడప్పుడూ సినిమాలు తీయాలేమో’’

* వంద సినిమాల ప్రయాణాన్ని ఆస్వాదించారా?  వంద నుంచి 125 చిత్రాల ప్రయాణాన్ని ఇష్టపడ్డారా?
ఓ రకంగా వంద సినిమాల వరకూ బాగా ఆస్వాదించా. ఆ ప్రయాణం చాలా కిక్‌ ఇచ్చింది. క్రికెట్‌లో అంతే కదా.. వంద పరుగులు చేయడం ఓ మధురానుభూతి. తరవాత పరుగులన్నీ బోనస్‌ అనుకోవాలి. వంద సినిమాల ప్రయాణం రకరకాల అనుభూతుల్ని ఇచ్చింది. పడ్డాను. లేచాను.. మళ్లీ పడ్డాను.. నిలదొక్కుకున్నాను.. ఇలా చాలా ఫీలింగ్స్‌ ఇచ్చింది. 101 నుంచి అన్నీ అలవాటైపోయాయి. ప్రతీ సినిమానీ ప్రేమించే చేశా.
* ప్రతినాయకుడిగానూ ప్రయత్నించారు. ఆ సినిమా ఫలితం నిరాశ పరిచిందా?
‘యుద్ధం శరణం’ ఆడితే.. ప్రతినాయకుడిగా సెటిల్‌ అయిపోయేవాడినేమో. ‘విలన్‌గా కనిపించడానికి నీకు చాలా టైమ్‌ ఉంది..’ అనుకున్నారు ప్రేక్షకులు. మరో పదేళ్ల తరవాత కథానాయకుడిగా నటించలేను. అప్పుడెలాగూ సహాయక, ప్రతినాయక పాత్రలుంటాయి కదా? అందుకే ప్రస్తుతం కథానాయకుడిగానే దృష్టిసారిస్తున్నా. ఇప్పుడు నా చేతిలో కథానాయకుడిగా నాలుగు చిత్రాలున్నాయి.
* 125 సినిమాలు అయిపోయాయి.. ఫస్ట్‌ డే షూటింగ్‌ అనుభవాలు, చెప్పిన డైలాగ్‌ గుర్తుందా?
ఎందుకు గుర్తు లేదు. నా తొలి చిత్రం ‘పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌’. ఉషాకిరణ్‌ తీసిన సినిమా అది. అరకు వ్యాలీలో షూటింగ్‌ చేశాం. అందులో నేను నక్సలైట్‌ నాయకుడిగా నటించా. ‘తూర్పు నుంచి పడమరకి.. పడమర నుంచి తూర్పుకి మార్చింగ్‌ చేస్తూ.. పహారా కాస్తున్నవాళ్లం’ అనే డైలాగ్‌ చెప్పించారు. ఇన్నేళ్లయినా.... ఆ డైలాగ్‌, అప్పటి అనుభవాలూ ఇప్పటికీ మదిలో మెదులుతున్నాయి. నిన్నో మోన్నో ఆ సినిమా చేసినట్టు అనిపిస్తోంది. ఆ లొకేషన్లు చూసినప్పుడల్లా అప్పటి రోజులు గుర్తొస్తాయి. ఆ సినిమాకి రూ.5 వేలు పారితోషికం తీసుకున్నా.
* పాత తరం కథానాయికలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. ఊహకూ అలాంటి అవకాశాలొచ్చాయా?
తనకు అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ తనకే ఆసక్తి లేదు. సరదాగా ఇంటర్వ్యూలకు రావొచ్చు కదా అంటేనే భయపడిపోతోంది. ఇక సినిమాలేం చేస్తుంది. సినిమాలు చేయకూడదు... అనేది తనకు తాను తీసుకున్న నిర్ణయమే. పిల్లలు, సంసారం.. ఇలా బాధ్యతలు పెరిగాయి కదా? ఇప్పుడు మా రెండో అబ్బాయి రోహన్‌ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు.
* కథ సిద్ధమైపోయిందా? ఇంతకీ మీవాడేం చేస్తున్నాడు?
కథేంటి? దర్శకుడు ఎవరు? అనేది ఇంకా ఆలోచించలేదు. వాడికోసం చాలామంది లైన్‌లో ఉన్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనంటే...డబ్బుల కోసమో, అవకాశాలు రావన్న భయంతోనో తొందరపడి అప్పట్లో చాలా సినిమాలు చేశా. వాడికి ఆ అవసరం లేదు. నిదానంగానే సినిమాలు చేస్తాడు. లాస్‌ఏంజిల్స్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడకొచ్చి డాన్సులు నేర్చుకుంటున్నాడు. ప్రైవేటుగా బీబీఎమ్‌ చదువుతున్నాడు.
* మీ లక్షణాలు పిల్లల్లో ఎవరికి వచ్చాయి?.
ఒకట్రెండు సినిమాలు చేసేవరకూ అది చెప్పలేం. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారనే అనిపిస్తోంది. ఎందుకంటే మనిషికి అహంకారం ఉండకూడదు. అది ఆవహిస్తే పతనం మొదలైపోతుంది. ఈ విషయాన్ని మా పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటా. వాళ్లూ నాలానే సున్నితంగానే ఆలోచిస్తారు. కానీ నిర్ణయాలు త్వరత్వరగా తీసుకుంటారు. నాకు మొహమాటం ఎక్కువ. వాళ్లకు అలాంటివి లేవు. మనకంటే చురుగ్గా ఆలోచిస్తున్నారు.
* మీ అమ్మాయిని తీసుకురారా..?
తనక్కూడా సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. అయితే.. బాస్కెట్‌బాల్‌ ఆడుతుంది. అండర్‌ 14 జట్టు తరపున జాతీయ స్థాయిలో ఆడింది.
* అప్పట్లో మీరు పడిన కష్టాలన్నీ ఎప్పుడైనా నెమరు వేసుకుంటారా?
స్ట్రగుల్స్‌ అనేవి అందరికీ ఉంటాయి. సినిమాలు ఫ్లాప్‌ అయినప్పుడు, మన అవకాశం.. మరొకరికి వెళ్లిపోయినప్పుడు బాధ అనిపించేది. కొన్ని కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నా.. నా ప్రయాణం సాఫీగానే సాగిపోయింది. ఎక్కువగా ఇబ్బంది పడింది లేదు. ‘ఎన్ని కష్టాలు పడుతున్నానో..’ అనుకోవడానికి నాకెప్పుడూ టైమ్‌ చిక్కలేదు. రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడేవాడ్ని. తెల్లవారుఝామున నాలుగు గంటల వరకూ షూటింగ్‌ చేసి, మళ్లీ ఉదయం ఏడింటికి సెట్‌కి వచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అంత కష్టపడేవాళ్లు ఎక్కడ? ఆదివారాలు కూడా పనిచేయడం లేదు. ఒక్క సినిమాతో స్టార్‌ అయిపోవచ్చు. అప్పట్లో ‘ఆమె’, ‘తాజ్‌ మహాల్‌’, ‘ఆహ్వానం’.. ఇలా నా కెరీర్‌లో వరుస హిట్లు పడ్డాయి. ఓ సీజన్‌లో అయితే అన్నీ హిట్లే. నాలా ఇప్పుడెవరైనా అన్ని హిట్లు కొడితే... వాళ్లే సూపర్‌ స్టార్లు.
* వరుస హిట్లు, చేతికి అందిన అడ్వాన్సులతో ఉక్కిరిబిక్కిరి అయిన సందర్భాలున్నాయా? డబ్బుల్ని జాగ్రత్త పెట్టగలిగారా?
డబ్బువస్తున్న కొద్దీ ఖర్చులు పెరుగుతాయి కదా? నా విషయంలోనూ అదే జరిగింది. అయితే దుబారా చేసింది లేదు. ఇల్లు కట్టుకోగలిగా. ఊర్లలో పొలాలు కొన్నా. అయితే వ్యాపారాల జోలికి వెళ్లలేదు. అది నా ఒంటికి పడదు.
* రాజకీయ నాయకులెవరూ... మిమ్మల్నీ ఆకర్షించే ప్రయత్నం చేయలేదా?
నాకు అసలు అసక్తే లేను. ఎవరైనా పిలిస్తే.. ‘అరె వాళ్లు పిలిచారు కదా, వెళ్లకపోతే బాగుండదేమో’ అని మొహమాటపడి వెళ్లే ఫీల్డు కాదు కదా? మొక్కుబడి ప్రయత్నాలు నాకు చేతకావు. ఒకవేళ దిగితే... దాని అంతు చూడాల్సిందే. అందుకే అటువైపు వెళ్లలేదు. అప్పుడు ప్రజారాజ్యంలో చేరాను అన్నారు. ఇప్పుడు ‘జనసేన’లో చేరిపోయినట్టు వార్తలు పుట్టిస్తున్నారు. వాటిలో నిజం లేదు.
* ‘మా’లో మీరు కీలక సభ్యుడు. ఇప్పుడు ‘మా’లో గొడవలు లేవంటారా?
‘మా’ ఇదివరకెప్పుడూ లేనంత గొప్పగా ఉంది. నాలుగు దఫాలుగా నేను ‘మా’లో లేను. ఆ గొడవలు నాకెందుకు అని వచ్చేశా. అప్పట్లో ఎవరైనా ఓ పని నెత్తిన పెట్టుకుని చేస్తుంటే అడ్డుకొనేవాళ్లు చాలామంది ఉండేవాళ్లు. ఏ అసోసియేషన్‌లోనైనా అలాంటివాళ్లు ఉంటారు. అందుకే ‘మా’కి దూరంగా ఉండేవాడ్ని. ‘మా’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఫండ్‌ రైజింగ్‌ చేయాలి అనుకున్నప్పుడు, శివాజీరాజా బలవంతంపై నేను ‘మా’లో చేరాను. మా టీమ్‌ రాకముందు ‘మా’ నిధులు  రూ.2.5 కోట్లు మాత్రమే.. ఇప్పుడు 6.5 కోట్లు ఉన్నాయి. మరి మేం బాగా చేసినట్టా? చేయనట్టా? ఇదంతా మర్చిపోయి మేమేదో చేశామని కొంతకాలం క్రితం గోల గోల చేశారు. ఓ తప్పు జరుగుతుంటే సహించలేను. అలాంటిది ఏ తప్పు చేయకుండా.. మాపై బురద జల్లడానికి ప్రయత్నించారు. పెద్దవాళ్లంతా మా పనితీరు గమనించారు. ‘మీరింత బాగా పనిచేస్తే... ఇలా అంటున్నారేంటి’ అని చిరంజీవిగారే ఆశ్చర్యపోయారు. మేం హుషారుగా పనిచేస్తున్నాం కదా.. ‘వీళ్లేంటి ఇంత పేరు తెచ్చేసుకుంటున్నారు’ అనే భావనతో కొంతమంది అడ్డు తగలడానికి ప్రయత్నించారు.

- మహమ్మద్‌ అన్వర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.