close

తాజా వార్తలు

అమ్మ చేతి గాజులే నా మొదటి పెట్టుబడి

ఓ రోజు రాత్రి మా లలితా జువెలర్స్‌ పెద్దాయన దగ్గరికి రూ.20,000 కలెక్షన్‌ కోసం వెళ్లాను. అప్పుడాయన ‘ఆత్మహత్య చేసుకుంటా’ అన్నారు. ‘ఎందుకు సార్‌?’ అంటే.. సమస్య చెప్పారు. ఎంత? అనంటే ‘కొన్ని కోట్లు’ అని చెప్పారు. నేను చూసుకుంటా అన్నానంతే! వెంటనే ‘మేనేజింగ్‌ డైరెక్టర్‌ నువ్వే’ అని రాసిచ్చారు.  రెండేళ్లు గడిచినా వ్యాపారం అర్థం కాలేదు. తర్వాత గేమ్‌ అర్థమైంది. నష్టం వచ్చిందని నేను మూడు నెలలకే పని వదిలేసుంటే.. ఈ రోజు కిరణ్‌కుమార్‌ అడ్రస్‌ ఇలా ఉండేది కాదు.

‘రఫ్పాడిస్తా..’  అంటూనే చిరంజీవి...
‘ఎవడుకొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో వాడే పండుగాడు’ అంటూనే మహేశ్‌బాబు ఎలా గుర్తొస్తారో..!
‘డబ్బులు ఊరికే రావు’...
ఈ మాట వినపడుతూనే... ఓ పెద్దమనిషి నున్నగా షేవ్‌ చేసుకొని, గుండు గీసుకొని.. నగల దుకాణంలో తిరుగుతూ చెప్పే మాటలు అందరికళ్లలో మెరుస్తాయి. ఈ డైలాగ్‌ కిరణ్‌కుమార్‌ది. ఈ మాట మీద పేటెంట్‌ హక్కులు సైతం తీసుకున్న కిరణ్‌కుమార్‌ లలితా జువెలర్స్‌ యజమాని. ‘మా దుకాణానికి రండి... ఫొటో తీసుకోండి. ఎస్టిమేట్‌ స్లిప్‌ తీసుకోండి... ఏ దుకాణంలోనైనా చెక్‌ చేసుకోండి. ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడే తీసుకోండి’... అంటూ బంగారం వ్యాపారంలో ఓ సంచలనంలా మారిన ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగారు? సాధారణ కుటుంబం నుంచి వచ్చి రోజూ 90కిలోల బంగారం ఎలా అమ్ముతున్నారు? ఆయన జీవిత విశేషాలేంటి?... ‘హాయ్‌’కి ప్రత్యేకం.

* బంగారం వ్యాపారంలో మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా..? మీరు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
మా పూర్వీకులు ఎవరూ ఈ వ్యాపారంలో లేరు. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. మా పూర్వీకులు రాజస్థాన్‌ నుంచి నెల్లూరుకు వచ్చారు. అక్కడ ఎక్కడ చూసినా బంగారం దుకాణాలే దర్శనమిస్తాయి. దక్షిణ భారతంలో బంగారం వ్యాపారం నెల్లూరులోనే ఎక్కువ. అక్కడి నుంచి కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తీసుకెళ్తుంటారు. పద్నాలుగేళ్లప్పుడే ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నా. మెల్లగా బంగారం వ్యాపారంలోకి వచ్చాను.

* ఈ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టారు?
ఓ బంగారం వ్యాపారి దగ్గరికి వెళ్లి కొంత పని నేర్చుకున్నా. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది.. ఎక్కడికి వెళ్తుంది.. విషయాలన్నీ తెలుసుకున్నా. అప్పట్లో మా అమ్మ దగ్గర నాలుగు బంగారు గాజులు ఉండేవి. ఈ 65 గ్రాముల బంగారాన్ని జుమ్కీలుగా మార్పించి.. చెన్నైకి తీసుకెళ్లి ఓ బంగారం కొట్టులో అమ్మేశాను. ఇలా అమ్మ నగలే పెట్టుబడిగా మొదలైంది నా వ్యాపారం. ఒకే సంవత్సరంలో ఏకంగా రూ.19 లక్షలు సంపాదించాను. నిద్రలేకుండా కష్టపడేవాణ్ని. రెండేళ్లలో నా దగ్గర మూడు కార్లయ్యాయి. అవి నేను తిరగడానికి కాదు! మా వ్యాపారానికి. ఒక్కోసారి ఆభరణాలు తీసుకొని నెల్లూరు నుంచి చెన్నైకి రోజుకు మూడునాలుగు సార్లు వెళ్లాల్సి వచ్చేది. అలా వ్యాపారం పెంచుతూ పోయాను. నా దగ్గర పని చేసిన వాళ్లూ మంచి స్థాయికి వచ్చారు. ఇప్పుడు నెల్లూరులో బంగారానికి గిరాకీ బాగా తగ్గింది. అలాగని వ్యాపారం మానుకోలేం కదా! కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. నా ఉద్యోగులకు పని కల్పించే ఉద్దేశంతో వ్యాపారం విస్తరించే ప్రయత్నం చేశాను.

* లలితా జువెలర్స్‌ నష్టాల్లో ఉన్నప్పుడు కొన్నారంట నిజమేనా?
1999 ఫిబ్రవరిలో టేక్‌ ఓవర్‌ చేశాను. మొదట్లో లలితా జువెలర్స్‌ బంగారాన్నే ప్యాకెట్‌లో పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి అమ్మేవాణ్ని. నాకు అన్నం పెట్టిన అమ్మ ఆ సంస్థ. ‘దానిని తీసుకుందాం’ అనుకున్నప్పుడు మా స్టాఫంతా ‘రిస్క్‌ అన్నా! వద్దు’ అన్నారు. ఒక్కరూ అనుకూలంగా మాట్లాడలేదు. వాళ్లకు తెలియకలా అన్నారు. ఇది కొన్న వెంటనే నా హోల్‌సేల్‌ బిజినెస్‌ ఆగిపోయింది. అయినా భయపడలేదు. మనిషి ఒకసారి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. సందేహం ఉండకూడదు.

* మొదట్లో లాభాలు ఎలా ఉండేవి?
నాకు రోజువారీ ఆదాయం ఉండేది. హోల్‌సేల్‌ వ్యాపారం చేసేటప్పుడు రోజుకు 300 కిలోల బంగారం అమ్మేవాణ్ని. లలితా జువెలరీ కొన్న తర్వాత ఆ వ్యాపారం ఆగిపోయింది. లాభం అనుకుంటే నష్టం వచ్చింది. ఎందుకలా జరిగిందని క్షణం ఆలోచించి.. గదిలో కూర్చొని ఓ అరగంట ఆలోచించి వెనక్కి వెళ్తే చాలు. చేసిన తప్పును సరిచేసుకుంటే చాలు. బిజినెస్‌లో రెండే ఉంటాయి. లాభం, నష్టం. లాభం వచ్చినప్పుడు నవ్వి, నష్టం రాగానే ఏడిస్తే ఎలా! నష్టం వస్తే ఇంకా హాయిగా ఉండాలి. లలితా జువెలర్స్‌ తీసుకున్నప్పుడు లాస్‌ అయ్యాను. నెలకు కోటీ డెబ్భై అయిదు లక్షల రూపాయలు పోయింది. మళ్లీ కోటీ డెబ్భై అయిదు లక్షలు ప్లస్‌లోకి వచ్చా. ఏ వ్యాపారంలో అయినా.. బాగా రాణించాలంటే గంట ఆలోచిస్తే చాలు. తర్వాతి రోజు ప్రాపర్టీ బాగా అవుతుంది. ఒక చోట పోతే... అక్కడ అలాగే ఉంటే ఎలా? హైదరాబాద్‌ మాత్రమే ఉందా? ఇండియాలో చాలా చోట్ల వ్యాపారం చేయొచ్చు. నాకు ఎనిమిది భాషలు వచ్చు. ఏదీ రాయలేను. మరాఠీ సొంతంగా నేర్చుకున్నా. నాకు నచ్చినట్లు మాట్లాడతా. సిగ్గుపడను.

* లలితా జువెలర్స్‌ పెద్దాయన ఎలా ఫీలయ్యారు?
పెద్దాయన నాతో నాలుగేళ్లు ఉన్నారు. ఆయన ముందు ఏనాడూ కూర్చోలేదు. పెద్దాయన ఆ రోజు నా దగ్గర 65 గ్రాముల బంగారం కొనకపోతే నేను లేను. వేలు పట్టి నడిపించిన మనిషిని ఎన్నటికీ మరచిపోలేను.

* మీ ప్రకటనలు ప్రతి ఇంటికీ చేరాయి.. ఇదెలా సాధ్యమైంది?
కొనుగోలుదారుల వల్లే నేనీస్థాయిలో ఉన్నాను. వాళ్లే నాకు దేవుళ్లు. ‘డబ్బులు ఊరికే రావ’న్న విషయం అందరికీ తెలిసిందే! దానినే నేను సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాను. మంచి ఆదరణ లభించింది. ‘డబ్బులు ఊరికే రావు’ డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. దీనికి పేటెంట్‌ తీసుకున్నాం. నేను సబ్జెక్ట్‌ చెప్తే మా టీంవాళ్లు యాడ్స్‌ తయారు చేస్తారు.

* ప్రకటనలతో వ్యాపారంలో మార్పులు వచ్చాయా?
మిగిలిన వ్యాపారులు మా వ్యాపారాన్ని తగ్గించాలని ప్రయత్నించారు. మాదంతా మిషన్‌మేడ్‌ అంటూ ప్రచారం చేశారు. నిజానికి ప్రజలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ‘మాకు తెలిసిన షాప్‌’ అంటూ ఒకే చోటికి వెళ్తుంటారు.

* ఆభరణాల్లో మోడల్స్‌ ముఖ్యం కదా! వాటిని ఎలా ఎక్కడ తయారు చేస్తారు?
కోల్‌కతా వర్కర్స్‌ని చెన్నైలో ఉంచి తయారు చేయిస్తున్నాం. ఫినిషింగ్‌ సరిగ్గా రావడం లేదనే ఫిర్యాదులు రావడంతో.. ప్రస్తుతం విజయవాడ, కోల్‌కతా, ముంబయి, రాజ్‌కోట్‌ ఇలా చాలా ప్రాంతాల్లో.. ఎక్కడి ఆభరణాలు అక్కడే తయారు చేయిస్తున్నాం. అన్నిటికీ సిస్టమ్‌ ఉంది. నేను ఆర్టిస్ట్‌ను కాదు. చిన్న గీత చెబితే.. వర్కర్‌కి అర్థమవుతుంది. ఇది మా అమ్మ కోసం, నా భార్య కోసం, చెల్లి, కూతురు, స్నేహితుడి గిఫ్ట్‌..’ అని ఆలోచించి చెబుతా. బాగోకపోతే పక్కన పెట్టేస్తా. నాకు నచ్చితే అందరికీ నచ్చుతుంది.

* రానున్న పదేళ్లలో లలితా జువెలర్స్‌ ఎంత మార్కెట్‌ చేయబోతోంది?
మనం ఏదీ ఊహించం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. రోజురోజుకీ కొనుగోలుదారులు పెరుగుతున్నారు. విదేశీ మార్కెటే బంగారం ధరలు నిర్ణయిస్తోంది. మన దేశం చేతిలో ఉన్నది 12.5 శాతం కస్టమ్‌ డ్యూటీనే! ఒక చీర వాడిన తర్వాత దాని విలువ సున్నా! బంగారం అలా కాదు. ఇప్పుడు కొంత పెట్టి కొంటే.. కొన్నాళ్లకి దాని విలువ పెరుగుతుంది. తగ్గదు.

* యువతకు మీరిచ్చే సలహా..
మీరు సంపాదిస్తే హ్యాపీ. ఫెయిల్‌ అయిన వాళ్లు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే గంటలో దాని గురించి తెలుసుకొని.. సరైన దారిలో ఎలా వెళ్లాలో చెప్తా!

సేవింగ్స్‌ కోసం బంగారం

బంగారం మట్టి అవ్వదు. ధర తగ్గొచ్చు, పెరగొచ్చు. తగ్గినా.. కొంత కాలానికి కచ్చితంగా పెరుగుతుంది. అదే ప్లాటినం అనుకోండి.. మనవాళ్లు కొనరు. దాని బదులు యాభై రూపాయలు ఇచ్చి స్టీలు కడియం చేయించుకోవచ్చు. అదే వజ్రాలు కొనే పనైతే మూడు రోజులు కాదు.. పది రోజులు ఆలోచించమని చెబుతాను. రెండు రాళ్లు తగ్గినా విలువ పడిపోతుంది. సేవింగ్స్‌ కోసం బంగారం కొనాలి. అవసరానికి ఉపయోగపడుతుంది. బ్యాంకులో కుదువపెట్టినప్పుడు తక్కువ విలువ కడితే బాధపడాల్సి వస్తుంది. అందుకే నాణ్యమైన బంగారం కొనండి.

తరుగు తక్కువ

మిషన్‌తో నగల తయారీకి సమయం తక్కువ పడుతుంది. గొలుసులు, గాజులే చేయగలం. మిగిలినవి హ్యాండ్‌మేడ్‌తోనే చేయాలి. బంగారంలో వేస్టేజ్‌ ఉండదు. తరుగు 0.04 శాతం కంటే తక్కువే ఉంటుంది.

భారత్‌లోనే ఎక్కువ

ప్రపంచంలో ఎక్కువ బంగారం ఎక్కడ అమ్ముతారంటే.. ఇండియాలో! ఇండియాలో ఎక్కడంటే హైదరాబాద్‌లో! ఇక్కడ ఎక్కడ అంటే లలితా జువెలర్స్‌లో అంటారు. అలాగే చెన్నై టీనగర్‌లోని లలితా జువెలర్స్‌లోనూ ఎక్కువ అమ్ముడవుతుంది. మొత్తం విలువలో మార్కెట్‌ స్టడీని బట్టి బయట బజార్‌కీ, మాకూ చిన్న వ్యత్యాసం ఉంది. మేం 60 శాతం హోల్డ్‌ చేస్తాం. నేను ప్రతి విషయం ఓపెన్‌గా చెబుతా. నేను మోసగాణ్ని అయితే.. ‘నగ చూపించి.. ఫొటో తీసుకొని వెళ్లి.. అన్ని షోరూమ్స్‌ తిరిగి రా’ అని చెప్పను. సినిమా డైలాగ్స్‌ చెప్పను. ఇప్పుడు మార్కెట్‌లో విమానంలా కాదు రాకెట్‌లా దూసుకుపోతున్నాం. అంతా అదృష్టం. 

నా అభివృద్ధిని వాళ్లు చూడలేదు

నా హాబీ పనే. సినిమాలు చూడను. నెల్లూరు నుంచి మిత్రులు వస్తే పెగ్గు వేస్తానంతే. అంతకుమించి ఎలాంటి అలవాట్లూ లేవు. ఏడాదికి మూడుసార్లు విదేశాలకు వెళ్తాను. ఇంట్లో ఎందుకు ఆఫీస్‌కు వచ్చేయ్‌ అని భార్యకు చెబుతుంటా. ఈ మధ్య నా భార్య వ్యాపారంలోనూ కొన్ని బాధ్యతలు చూస్తోంది. మాకు కూతురు, కొడుకు ఉన్నారు. పిల్లలు బడికెళ్తున్నారు. మా అమ్మానాన్న నా అభివృద్ధిని చూడకుండానే పోయారు. మేం ఎనిమిది మంది సంతానం. ఆరుగురు అక్కాచెల్లెల్లు. ఒక అన్న. నేనే అందరిలో చిన్నవాణ్ని.

రోజుకు 90 కిలోలు అమ్ముతా

బంగారాన్ని బ్యాంకులో కొని అదే ధరకు అమ్మాలి. అది హోల్‌సేల్‌ మార్కెట్‌కి వెళ్తుంది. వారు వ్యాపారులకు ఇస్తారు. ఇలా నాలుగు చేతులు మారడంతో.. ధర రెండు నుంచి పది శాతం దాకా పెరుగుతుంది. మా దగ్గర బ్యాంక్‌ నుంచి నేరుగా కొనుగోలుదారులకు చేరుతుంది. మేము రోజుకు 90 కిలోల వరకూ అమ్ముతాం. మాకు మిగిలేది 1.23 శాతం. వ్యాపారం పదివేల కోట్ల టర్నోవర్‌ ఉంటుంది. మొత్తంగా రూ.125 కోట్ల వరకూ వస్తుంది. 

బంగారం ఇలా కొందాం

కొన్ని షాపుల్లో కొనుగోలుదారులు రాగానే.. ‘అమ్మానాన్న బాగున్నారా’ అంటారు. ఐదేళ్ల కిందట పోయిన తాతయ్య గురించి బాధపడుతూ అడుగుతారు. కాఫీ తీసుకురా..! అని హడావిడి చేస్తారు. ఇలాంటి క్షేమ సమాచారాలు ఎవరినీ అడగను నేను. ఫోన్‌లో బాగున్నావా? అంటేనే నాకు నచ్చదు. నన్ను ఎవరైనా అడిగినా ఇష్టం ఉండదు. టైం వేస్ట్‌ పనులు ఎందుకు? సబ్జెక్ట్‌ ఉండాలి. ఇది నా మెంటాలిటీ. డబ్బులు తీసుకొని వచ్చి కొనుక్కోండి. మీకు ఒక్కగ్రాము ఎక్కువ వస్తే.. ఎక్కడైనా కొనండి. లలితా జువెలరీలో మాదిరి ఫొటో తీసుకొని, ఎస్టిమేట్‌ తీసుకోమని ఎవరైనా చెప్పారా! లేదు కదా!

మోసాలుంటాయి

కొంతమంది వ్యాపారులు బిల్లు ఇవ్వరు. కొనుగోలుదారులూ అడగరు. స్లిప్‌లో రాసిస్తారు. దీంతో జీఎస్‌టీ కట్టరు. కొనుగోలుదారులు పెద్ద షాపులో అయితే ధరలు ఎక్కువగా ఉంటాయనీ, తెలిసిన వారున్నారనీ ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. నాణ్యత గురించి పట్టించుకోరు. లలితా జువెలర్స్‌లో రూ.30,000 అయితే ఫలానా చోట రూ.29,900కే ఇస్తున్నారని వాళ్లనే నమ్ముతారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.