close

తాజా వార్తలు

పాక్‌ తెలుసుకో.. ఇస్రో శక్తి ఇదీ.. !

 అంతరిక్ష మార్కెట్‌ రేసులో ప్రధాన పోటీదారుగా అవతరణ


 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘చేతకాని పనిలో వేలు పెట్టడం దేనికీ..?’ ‘భారత్‌ లాంటి పేద దేశం రూ.900 కోట్లు వృథా చేసింది’.. చంద్రయాన్‌-2లో విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ గల్లంతైనప్పుడు పాక్‌ మంత్రి ఫవాద్‌హుస్సేన్‌ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఇవి. పాక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మెదడులో మట్టికూడా లేదు అని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. అది ఎలానో చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పేస్‌ ఏజెన్సీలతో పోలిస్తే మన ఇస్రో ప్రయోగాలకు అయ్యే వ్యయం చాలా తక్కువ. కేటాయించిన బడ్జెట్‌నే అతి పొదుపుగా వినియోగిస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. చంద్రయాన్‌-2 ఖర్చు కొంచెం అటూఇటుగా 140 మిలియన్‌ డాలర్లు.. హాలీవుడ్‌లో ఒక భారీ యాక్షన్‌ సినిమా కంటే ఈ ఖర్చు తక్కువ. నాసా వంటి అగ్రగామి స్పేస్‌ ఏజెన్సీలు ఇదే ప్రయోగం నిర్వహించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించాలి. అంతదేనికి చంద్రయాన్‌-1లో కూడా నాసా తన పరిశోధన పరికరాన్ని పంపింది.  భారత్‌ మంగళ్‌యాన్‌కు 74 మిలియన్‌ డాలర్లు ఖర్చైతే.. అమెరికా ‘మవెన్‌’కు 672 మిలియన్ డాలర్లు వెచ్చించింది. 
ఇంటర్నెట్‌.. డీటీహెచ్‌.. రేడియో, టెలీమెడిసిన్‌..డిఫెన్స్‌.. నేవిగేషన్‌.. కమ్యూనికేషన్స్‌.. ఖనిజాన్వేషణ.. ఇలా ప్రతి రంగంలో శాటిలైట్ల అవసరాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అంతరిక్ష మార్కెట్‌ విలువ 350 బిలియన్‌ డాలర్లు (రూ. 25లక్షల కోట్లు)అంటే పాక్‌ జీడీపీ కంటే చాలా ఎక్కువ. 2025 నాటికి ఈ మార్కెట్‌ 550 బిలియన్‌ డాలర్లు చేరుతుంది. ఇంత పెద్ద మార్కెట్లో ఉపగ్రహాలను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న దేశాల సంఖ్య 12 మాత్రమే. వీటిల్లో కూడా ఇరాన్‌.. ఉత్తరకొరియా వంటిదేశాలు ఈ దిశగా పెద్దగా పురోభివృద్ధి సాధించలేదు. సామర్థ్యం నిరూపించుకొన్న అతికొద్ది దేశాల్లో  భారత్‌కు చెందిన ఇస్రో కూడా ఒకటి. వచ్చే ఐదేళ్లలో అంతరిక్ష మార్కెట్‌లో ఇస్రో 10శాతం దక్కించుకోగలిగినా.. ఆ మొత్తం చాలా ఎక్కువ.   

కేంద్ర ప్రభుత్వం అండ..

రాజకీయాలకు అతీతంగా భారత కేంద్ర ప్రభుత్వం ఇస్రోకు ఎప్పుడూ అండగా నిలుస్తోంది. గత ఐదేళ్లలో చూస్తే ఇస్రో బడ్జెట్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రూ.6వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు చేరింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థలను, స్టార్టప్‌లను కూడా భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం భారత్‌ వివిధ రకాల సేవల కోసం దాదాపు 200 ట్రాన్స్‌పాండర్లను వాడుతోంది.. దీంతోపాటు వాతావరణ పరిశోధనల నిమిత్తం అంతరిక్షం నుంచి వివిధ సందర్భాల్లో తీసే చిత్రాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటోంది. భారత్‌ వినియోగించే మూడోవంతు ట్రాన్స్‌పాండర్లు విదేశాల నుంచి లీజుకు తీసుకొన్నవే. ఇస్రో పూర్తి స్థాయిలో  శక్తిసామర్థ్యాలను సంతరించుకొంటే పూర్తిగా దేశీయ ట్రాన్స్‌పాండర్లనే వినియోగించే అవకాశం ఉంది.  
ఇందు కోసం నమ్మకమైన శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌, అగ్‌మెంటెడ్‌ శాటిలైట్ లాంచ్‌ వెహికల్‌లను అభివృద్ధి చేసేపనిలో ఇస్రో కొన్నేళ్లుగా తలమునకలైంది. దీనిలో భాగంగా ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీని అభివృద్ధి చేసి 46ప్రయోగాలను విజయవంతం చేసింది. పీఎస్‌ఎల్‌వీ సామర్థ్యానికి మించిన ప్రయోగాల కోసం జీఎస్‌ఎల్‌వీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇప్పటి వరకు ఇది 3.5టన్నుల పేలోడ్‌ను జియోసింక్రనస్‌ ఆర్బిట్‌కు చేర్చగలదు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ ప్రయోగిస్తున్న ఏరియన్‌ 5 కంటే దీని సామర్థ్యం 1.5టన్నులు తక్కువ. కానీ, భవిష్యత్తులో ఇస్రో ఈ సామర్థ్యాన్ని తేలిగ్గా అందుకోగలదు.  శాటిలైట్‌ వెహికల్‌ అభివృద్ధి చెందే కొద్దీ ప్రయోగాల కోసం భారత్‌ విదేశాలకు చెల్లించే మారకద్రవ్యం మిగులుతుంది. ఇస్రోనే మరికొన్ని దేశాలకు ప్రయోగాలు చేసి కొంత ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇప్పటికే  ఇస్రో విదేశాలకు చిన్నచిన్న ప్రయోగాలను చౌకగా చేసిపెడుతోంది. 

ఇస్రో ఖర్చు కాదు.. పెట్టుబడి..

అంతరిక్ష మార్కెట్లో ఇస్రో రాకెట్లకు  డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. 2014లో 5 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఇస్రో.. 2015లో 17,  2016 లో 22 విదేశీ ఉపగ్రహాలను లక్ష్యానికి చేర్చింది. ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్‌ ఆదాయం కూడా 2015లో 204శాతం పెరిగింది. 2015-16 నుంచి ఇస్రో ఆదాయ వ్యయాల మధ్య తేడా క్రమంగా తగ్గుతోంది. 2017-18లో ఇస్రో రూ.2,388 కోట్లు వెచ్చించగా.. రూ.1,932 కోట్లను ఆదాయంగా పొందింది. భవిష్యత్తులో ఇస్రో వ్యయాలు తగ్గి లాభాల్లోకి వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయి. దీనికి పీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం మంచి ఉదాహరణ. ఈ ప్రయోగంలో భారత ఉపగ్రహాలతోపాటు 104 విదేశీ ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి చేర్చింది. ఈ ప్రయోగానికి అయిన ఖర్చులో సగం ఆదాయం రూపంలో ఇస్రోకు వాపస్‌ వచ్చేసింది. అంటే సగం ఖర్చుతోనే భారత ఉపగ్రహాలు కక్ష్యకు చేరినట్లయ్యాయి. ఇప్పుడు చిన్న ఉపగ్రహాల విప్లవం రానుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2030 నాటికి 17,000కు పైగా చిన్న ఉపగ్రహాలు కక్ష్యలో ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. దీనికి ఇస్రో ఇప్పటికే సిద్ధమవుతోంది. దీనికోసం స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను అభివృద్ధి చేస్తోంది. 2019చివరినాటికి ఇది సిద్ధం కావచ్చు. ఈ రంగంలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక సంస్థతో ఇస్రో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. 

దేశీయ పరిశ్రమలకు అండ..

అంతరిక్ష నౌకల అవసరాల నిమిత్తం వివిధరకాల  సాంకేతికతలపై ఇస్రో ప్రయోగాలు చేసి అభివృద్ధి చేస్తోంది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఇస్రో ఒక్కటే వినియోగించుకోదు. దేశీయ పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు కూడా నామమాత్రపు లాభంతో విక్రయిస్తోంది. ఇటీవల ఇస్రో లిథియం అయాన్‌ బ్యాటరీల టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిని దేశీయ సంస్థలకు అతితక్కువ ధరకే బదిలీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విద్యుత్తు వాహనాలవైపు మళ్లుతోన్న ఆటో పరిశ్రమకు ఇది కచ్చితంగా ఉపయోగపడే అంశం. ఈ రకంగా ఇస్రో దేశంలో పరిశ్రమల అభివృద్ధికి కూడా సాంకేతికతను అందజేస్తోంది. ఇక రక్షణ  రంగం, దేశంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టులకు సాయం వంటి కార్యక్రమాల్లో ఇస్రో పాత్ర మరువ లేనిది. 

సరికొత్త వాణిజ్య విభాగం ఏర్పాటు..

ఇటీవల ఇస్రో సరికొత్త వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)ను ప్రారంభించింది. ఇప్పటికే యాంత్రిక్స్‌ అనే వాణిజ్య విభాగం 1992నుంచి పని చేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ‘మణిరత్న’హోదా లభించింది. కొత్తగా ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఐఎల్‌ వాణిజ్య, అభివృద్ధికి అవసరమైన పరిశోధనలను ప్రోత్సహించనుంది. దీనికి రూ.100 కోట్ల బడ్జెట్‌ కూడా కేటాయించారు. 

పాక్‌ పరిస్థితి ఇదీ..
పాక్‌ స్పేస్‌ ఏజెన్సీ పేరు స్పేస్‌ అండ్‌ అప్పర్‌ అట్మాస్పియర్‌ కమిషన్‌(సుపర్‌కో)ను 1961లో ప్రారంభించారు. ఇది ముక్కీమూలిగీ 1990లో బదర్‌-1పేరుతో శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపింది.  నిధుల కరవు, సృజనాత్మక కొరవడటం వంటి కారణాలతో వరుస వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో చైనా సాయంతో ఒకటీ అరా ప్రయోగాలు చేసి జబ్బలు చరుచుకుంటోంది. 2022లో మానవ సహిత అంతరిక్షయాత్రను నిర్వహిస్తున్నట్లు ఇటీవల ఘనంగా ప్రకటించింది. అది కూడా చైనా సాయం లేకుండా సాధ్యం కాదు.  ఈస్పేస్‌ ఏజెన్సీ బడ్జెట్‌ 43 మిలియన్‌ డాలర్లు .. అంటే మన ఇస్రో చంద్రయాన్‌-2 అయిన ఖర్చులో మూడో వంతు కంటే తక్కువ. అదీ పాక్‌ శక్తి.  ఆకాశంపై ఉమ్మితే.. అన్న సామెత పాక్‌కు అతికినట్లు సరిపోతుంది కదా..!


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.