close

తాజా వార్తలు

చిరు గురించి మాట్లాడటం నా అదృష్టం: రాజశేఖర్‌

హైదరాబాద్‌: చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం తనకు కలిగిందని, ‘సైరా’ లాంటి పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం కూడా ఉండాలని అన్నారు ప్రముఖ నటుడు రాజశేఖర్‌. చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల విడుదలైన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్‌ నిర్మాత. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ‘సైరా’ చిత్రబృందాన్ని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సైరా చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం.హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్. చిరంజీవి లేకుండా రామ్ చరణ్ లేరు. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి బహుమతి ఇచ్చాడు. తెలుగువాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో నటించిన చిరంజీవికి హ్యాట్సాఫ్. ఇంత పెద్ద సినిమాను సురేందర్‌రెడ్డి చాలా బాగా తెరకెక్కించారు. చిరంజీవిని నిజంగా మెచ్చుకోవాలి. కోట్ల డబ్బు ఖర్చుపెట్టి ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ సినిమా చూసినప్పుడు నాకు చిరంజీవి వయసు కనిపించలేదు. ఆయన స్పీడ్‌ ఏమాత్రం తగ్గలేదు. తెలుగువారందరూ గర్వపడేలా చేశారు. ఇలాంటి కార్యక్రమం సుబ్బిరామిరెడ్డి మాత్రమే ఏర్పాటు చేయగలరు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు’’ అని అన్నారు.

నా నిర్మాతలందరిలో చరణ్‌ నెంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌: చిరు

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘సుబ్బిరామిరెడ్డి చాలా మంచి వ్యక్తి. పదిమందికీ సంతోషాన్ని పంచే వ్యక్తి. ఆయనకు కళాబంధు అనే పేరు ఎవరు పెట్టారో తెలియదు కానీ.. ఆయన మనసు నిజంగా ఓ అద్భుతం. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్నామని తెలిసినప్పటి నుంచి ఆయన ఎంతో శ్రద్ధ చూపించారు. ‘సైరా’ విజయం పట్ల ఆనందంతో మమ్మల్ని ఇలా అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన కళా హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆయన చూపించిన ప్రేమ, అభిమానంతో నా గుండె నిండిపోయింది. ‘సైరా’ను నా జీవితంలో గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించిన సురేందర్‌రెడ్డికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే. బుర్రా సాయిమాధవ్‌తో సహ ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంతటి గౌరవప్రదమైన సినిమాను నాకు బహుమతిగా ఇచ్చిన రామ్‌చరణ్‌ నా నిర్మాతలందరితోనూ నెంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌. నేటితరం కథానాయికలకు తమన్నా ఆదర్శం. ఆమె సినిమా పట్ల చూపించే శ్రద్ధ మాటల్లో చెప్పలేనిది.’ అని తెలిపారు.

నేను ప్రొడ్యూసర్‌ని కాదు.. వర్కర్‌ని: రామ్‌చరణ్‌

ఈ కార్యక్రమంలో ‘సైరా’ నిర్మాత రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ‘సుబ్బిరామిరెడ్డి సర్‌ అభినందన కార్యక్రమం లేకపోతే ఆ సంవత్సరం మాకు ఏదో వెలితిగా ఉంటుంది. నాకు ఇంతటి గొప్పఅవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్యూ డాడీ. ఆయనకు ప్రొడ్యూసర్‌నని అందరూ నన్ను పొగుడుతున్నారు. కానీ, నేను అలా భావించడంలేదు. ఆయన సినిమాలో నేను ఒక వర్కర్‌ని మాత్రమే. ఆయన సంకల్పమే మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించింది.’ అని పేర్కొన్నారు.

గర్వంగా ఉంది: అల్లు అరవింద్‌

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మంచి సినిమాలను గౌరవించడం సుబ్బిరామిరెడ్డి గొప్పతనం. ‘సైరా’ చిత్రం సినీ పరిశ్రమతోపాటు  మా కుటుంబానికి కూడా భారీ విజయాన్ని అందించింది. ఇటువంటి మంచి సినిమాని మా మేనల్లుడు రామ్‌చరణ్‌ తీశాడన్న గర్వంగా ఉంది.’ అని సరాదాగా అన్నారు.

చిరు మమూలు సినిమాని సైతం చరిత్రలో నిలబెడతారు : సాయిమాధవ్‌

ప్రముఖ మాటల రచయిత బుర్రాసాయిమాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘సైరా’ విడుదలైన తర్వాత చిరంజీవి అభిమాని ఒకరు నాకు ఫోన్‌ చేసి.. ‘మన అన్నయ్యకు చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇచ్చారు’ అని అన్నారు. అప్పుడు అతనితో నేనొక్కమాట చెప్పాను. ‘ చిరంజీవి నటించిన మామూలు సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. మామూలు సినిమాలను సైతం ఆయన చరిత్రలో నిలబెట్టారు. అలాంటిది చరిత్రలో నిలిచిపోయే లక్షణాలున్న సినిమా చిరంజీవికి వస్తే ‘సైరా’లా ఉంటుంది. నా జీవితం మొత్తం గొప్పగా చెప్పుకొనే సినిమాకు నేను పనిచేశాను.’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్‌రెడ్డితోపాటు రత్నవేలు, పరుచూరి బ్రదర్స్‌, తమన్నా, బ్రహ్మాజీ ‘సైరా’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, నటుడు మురళీమోహన్‌ ‘సైరా’ చిత్రబృందానికి తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్ర నటుడు వెంకటేశ్‌, దర్శకులు అనిల్‌ రావిపూడి, మెహర్‌ రమేశ్‌, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.