close

తాజా వార్తలు

దశ తిరిగేది ఏ దిశలో?

విద్యార్థి జీవితంలో మిగిలిన పరిస్థితులన్నీ ఒకెత్తు! పదో తరగతి పూర్తయినవేళ ఎదురయ్యే స్థితి ఒకెత్తు! పాఠశాల నుంచి బయటపడి... నాలుగు రోడ్ల కూడలి కాదు, జీవితంలో ఎటువెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన.. అనేక కూడళ్ల వద్ద నిలబడి దశాదిశా తేల్చుకోవాల్సిన తరుణమిది! ఎంచుకోవాల్సినవేమిటి? అందుకు కావాల్సిన లక్షణాలేమిటి?

ఎంచుకుంటున్నదారి మంచిదేనా? వేరేవారిని చూసి గుడ్డిగా వెళుతున్నామా? ఇవన్నీ బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి!

ది పూర్తయిన ప్రతి విద్యార్థికీ ఇంటర్మీడియట్‌లో చేరటం ఒక మార్గమైతేే- పాలిటెక్నిక్‌/ ఐటీఐల్లో చేరటం మరో దారి. ఇవి కాకపోతే ఒకేషనల్‌/ డిప్లొమా కోర్సుల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అవసరం, ఆసక్తులను బట్టి ఆర్మీ, నేవీ, రైల్వేల్లో ఉద్యోగ ప్రయత్నాలూ చేయవచ్చు. కోర్సులతో సంబంధం లేకుండా డీటీపీ, టాలీ, గ్రాఫిక్స్‌లాంటి షార్ట్‌టర్మ్‌ కోర్సులు నేర్చుకుంటే ఉపాధి పొందవచ్చు.
వివిధ వృత్తుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ సింహద్వారంలా ఉపయోగపడుతుంది. కోరుకున్న విభాగంలో రాణించడానికి అందుకు తగ్గ కోర్సులను ఇంటర్లో ఎంచుకోవడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పది పూర్తయిన ఎక్కువమంది ఇంటర్మీడియట్‌ కోర్సుల్లోనే చేరుతున్నారు. భవిష్యత్తులో ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు మొదలైన వృత్తుల్లో  రాణించడానికి ఇంటర్మీడియట్‌ పునాదిగా నిలుస్తుంది. జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌, క్లాట్‌; రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌, డైట్‌సెట్‌, లాసెట్‌ వీటన్నింటికీ ఇంటరే ఆధారం.
తెలుగు రాష్ట్రాల్లో బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్లో దాదాపు 85 గ్రూపు కాంబినేషన్లు ఉన్నాయి. అయితే ప్రతి చోటా అందుబాటులో ఉన్నవి మాత్రం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీలే. మ్యూజికల్‌, లాజిక్‌, సైకాలజీ సబ్జెక్టులను సైతం ఇంటర్‌ నుంచే చదువుకోవచ్చు. కానీ ఈ కోర్సులు అందించే కళాశాలలు చాలా తక్కువ. ప్రతి గ్రూపులోనూ 3 లేదా 4 సబ్జెక్టులుంటాయి. వీటితోపాటు ఆంగ్లం, మరో భాష తప్పనిసరి.

ఇంటర్లో ఏ గ్రూప్‌తో ఏమిటి?

ఎంపీసీ: ఇంటర్లో చేరే విద్యార్థుల్లో ఎక్కువమంది ఎంచుకుంటోన్న గ్రూప్‌ ఇదే. బీఈ/  బీటెక్‌, బీఆర్క్‌ కోర్సులు చదవడానికి దీన్ని ఎంచుకోవడం తప్పనిసరి. అలాగే పైలట్‌ కావాలన్నా ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులకూ ఎంపీసీ ఉండాల్సిందే. ఇంటర్‌ గ్రూప్‌ సబ్జెక్టులతోనే బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ లో చేరవచ్చు. స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, జియాలజీ...ఇలా కొత్త సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. డీఎడ్‌, లా, డిజైన్‌, ఫార్మసీ..ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. 

బైపీసీ: వైద్య వృత్తి, అనుబంధ రంగాల్లో రాణించడానికి ఇంటర్లో బైపీసీ తప్పనిసరి. అలాగే వ్యవసాయ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌, కొన్ని పారామెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఈ గ్రూప్‌ తప్పనిసరి. ఫిషరీ సైన్స్‌, ఆక్వా, మైక్రో బయాలజీ మొదలైన కోర్సులకు బైపీసీ అనివార్యం. ఇంటర్లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరవచ్చు. మ్రైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌...తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలో తీసుకోవచ్చు. ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, డీఎడ్‌, లా, డిజైన్‌...తదితర కోర్సుల్లో వీరు చేరవచ్చు. బైపీసీ గ్రూప్‌ తీసుకున్నవారు కొన్ని డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులు పూర్తిచేసి సొంతంగా రాణించవచ్చు.

ఎంఈసీ:  వర్తక, వాణిజ్య, గణాంకశాస్త్ర రంగాల్లో రాణించాలనుకునేవారికి ఇది మేటి కోర్సు. ఈ గ్రూప్‌ విద్యార్థులకోసమే అంటూ ప్రత్యేకమైన కోర్సులు ఏమీ లేనప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌లలో రాణించడానికి ఎంఈసీ ఉపయోగపడుతుంది. బిజినెస్‌ ఎనలిస్ట్‌, స్టాటిస్టీషియన్‌, మార్కెట్‌ నిపుణులు...మొదలైన రంగాలకు ఎంఈసీ కాంబినేషన్‌ పనికొస్తుంది. వీరు ఇవే సబ్జెక్టులతో డిగ్రీలో కొనసాగవచ్చు. డీఎడ్‌, లా...మొదలైన కోర్సుల్లోనూ చేరిపోవచ్చు. ఎకనామిక్స్‌పై పట్టున్నవారికి సైన్స్‌ కోర్సులతో సమాన అవకాశాలు లభిస్తున్నాయి.

సీఈసీ/ హెచ్‌ఈసీ: ఎకనామిక్స్‌, కామర్స్‌ కలయికతో ఈ కోర్సులు చదివినవారు అకౌంటింగ్‌ రంగంలో రాణించవచ్చు. వీరు భవిష్యత్తులో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సుల్లో చేరవచ్చు. లేదా న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య అభ్యసించవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ బీఎఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులు ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవి. ఇంటర్‌ తర్వాత సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు... ఇలా నచ్చిన కోర్సులను బీఏ స్థాయిలో ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు.

ఏ స్ట్రీమ్‌కు ఎవరు సరిపోతారు? 

పదో తరగతి తర్వాత సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌ స్ట్రీముల్లో దేన్ని ఎంచుకోవాలన్నది ప్రతి విద్యార్థికీ సమస్యగా ఉంటుంది. సైన్స్‌ స్ట్రీమ్‌ వారికి ఇంటర్‌ తర్వాత అవసరమైతే కామర్స్‌, హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌లోకి మారే వెసులుబాటు ఉంటుంది. హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌, కామర్స్‌ వారు మాత్రం ఇంటర్‌ తర్వాత సైన్స్‌లోకి మారే అవకాశం ఉండదు. అభిరుచీ, ఆసక్తులకు సరిపోయేది ఎంచుకుంటే రాణించే అవకాశం ఎక్కువ. అవసరమైతే నిపుణుల దగ్గర కెరియర్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవటం మంచిది. ఈ విషయంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, సీనియర్ల సహాయం తీసుకోవచ్చు.

సైన్స్‌ (బయాలజీ): దీన్ని ఎంచుకోవాలంటే...మంచి జ్ఞాపకశక్తి, జీవశాస్త్ర అంశాలపై ఇష్టం అవసరం. చిత్రపటాలూ, ఫార్ములాలూ, పట్టికలూ లాంటివి గుర్తుంచుకోవాలి. సేవాభావం, కష్టపడి కృషిచేయగలిగే సామర్థ్యం, పట్టుదల, సహనం అవసరం. ఈ స్ట్రీమ్‌లో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. 

సైన్స్‌ (మ్యాథ్స్‌): దీన్ని ఎంచుకోవాలంటే... గణితంపై పట్టు ఉండాలి. సంఖ్యలూ, ఫార్ములాలూ, థియరిమ్స్‌ లాంటివి గుర్తుంచుకోవాలి. తార్కికంగా ఆలోచించే లక్షణం ఉండాలి. దేన్నయినా విశ్లేషించి సరైన అంచనాకు వచ్చే పరిజ్ఞానం అవసరం. యంత్రాలూ, కంప్యూటర్లతో పనిచేయటంపై, సాంకేతికతపై ఆసక్తి ఉండాలి.  ఈ స్ట్రీమ్‌లో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది.

కామర్స్‌: దీన్ని ఎంచుకోవాలంటే... వ్యాపార రంగంపై, సంబంధిత ప్రభుత్వ విధానాలపై ఆసక్తి ఉండాలి. జాతీయ అంతర్జాతీయ సంఘటనల పరిశీలన అవసరం. ఫార్ములాలూ, ఆర్థిక పదజాలం గుర్తుంచుకోవాలి. గణాంకాలూ, గణిత సంబంధ అంశాలను ఇష్టపడే స్వభావం ఉండాలి. 

హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌: దీన్ని ఎంచుకోవాలంటే... బయాలజీ, మ్యాథ్స్‌, కామర్స్‌ అంశాలంటే ఆసక్తి లేనివారు దీన్ని ఎంచుకోవచ్చు. చరిత్ర, సామాజికశాస్త్రాలపై, సామాజిక ప్రగతి, కార్యకలాపాలపై అభిరుచి ఉన్నవారికి ఇది తగినది. ఈ స్ట్రీమ్‌లో థియరీ ఎక్కువ, ప్రాక్టికల్‌ చాలా తక్కువ. అయితే సివిల్స్‌ పరీక్షల లక్ష్యం ఉన్నవారికిది ప్రాథమికంగా అనువైనది. 

గ్రూపుల ఎంపికలో గమనించాల్సినవీ, చేయకూడనివీ... www.eenadupratibha.net


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.