close

తాజా వార్తలు

సాధికారతకు ఆ మూడే ముఖ్యం!

మహిళ... ఓ కుటుంబానికి ఆధారం. ఇంట్లో పనులన్నీ చకచకా సాగిపోవాలంటే ఆమె తప్పనిసరి. అటువంటి స్త్రీ సమాజంలో సమానత్వం సాధించడం ఎలా?  సాధికారత దిశగా అడుగులు వేయాలంటే ఏం చేయాలి? ఇటువంటి వాటికే సమాధానం చెబుతూ అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ సతీమణి మిలిందా గేట్స్‌ ఓ పుస్తకం రాసింది. తన జీవితంలోని సంఘటనలు, అనుభవాలను అందులో వివరించింది. అదే ‘ది మొమెంట్‌ ఆఫ్‌ లిఫ్ట్‌ - హౌ ఎంపవరింగ్‌ విమెన్‌ ఛేంజెస్‌ ద వరల్డ్‌’. ఆ విశేషాలేంటంటే...

ప్రతి స్త్రీ సమానత్వం, సాధికారత దిశగా అడుగులు వేయాలంటే... మూడు అంశాలను గమనించుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఒకటి తన ఇల్లు, రెండోది పని వాతావరణం, మూడోది సమాజం. ఈ మూడు చోట్ల స్త్రీకి అనుకూలమైన మార్పులు జరిగితే... మరెంతోమంది మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తారని అంటుంది మిలిందా. ఇలాంటి ఎన్నో స్వానుభవాలను ఉదాహరణలుగా తన పుస్తకంలో వివరించింది. ‘భోజనం తరువాత పని చేయడానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నా. సాయంత్రాలు ఏదయినా చదవడం, బిల్‌, పిల్లలతో కబుర్లు చెప్పడం, విశ్రాంతి ఇచ్చే టీవీ కార్యక్రమం చూడటం... ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. రాత్రుళ్లు వంటింట్లో ఎక్కువసేపు గడపాల్సి వచ్చేది. వంటింటి పనులు ఎంతకీ పూర్తయ్యేవి కావు. అది గమనించిన నేను ఇంటిపనుల్లో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పా. తరువాత ఎవరి పనులు వాళ్లు చేసుకుని వెళ్లిపోయేవారు. నాకంటూ మళ్లీ కొన్ని పనులు ఉండిపోయేవి. వంటింట్లో నా పనులన్నీ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటకు వెళ్లకూడదనే షరతు పెట్టా. అంతా నాకు సాయం చేయడం మొదలుపెట్టారు. ఇరవై నిమిషాల పని కాస్తా... ఐదు నిమిషాల్లో అయిపోయేది. ఇది నా స్వానుభవం. ప్రతి స్త్రీ కూడా ఇలాగే కుటుంబ సహకారం తీసుకోగలిగితే కొంత సమయం కలిసొస్తుంది. నాలా కొంత విశ్రాంతీ తీసుకోవచ్చు...’ అని అంటుంది మిలిందా.

సమస్యను తెలియజేసేలా...

మిలిందా తమ ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో దేశాలకు వెళ్లడం పరిపాటే. అలా వెళ్లినప్పుడల్లా చాలా విషయాలు తెలుసుకుంటుంది. ఓసారి ఆమె గుర్తించిన అంశాన్ని తన పుస్తకంలో ప్రస్తావించింది. స్త్రీ తలచుకుంటే సామాజికపరంగా ఎలా మార్పు తెవచ్చో వివరించింది. ‘అది టాంజానియాలోని చిన్న ఊరు. అక్కడ ఆనా అనే అమ్మాయి పని... రోజూ వంటచెరకు సిద్ధంచేసుకోవడం, చాలా దూరం వెళ్లి నీళ్లు తీసుకురావడం, గంటలతరబడి వంటింట్లో వండటం. కొన్నాళ్లకు ఆమెకు పిల్లాడు పుట్టడంతో మిగిలినవి చేయడం కష్టంగా అనిపించింది. అదే విషయాన్ని భర్తతో చెప్పింది. అతడు నీళ్లు తీసుకురావడం మొదలుపెట్టాక మరికొందరు మగవాళ్లు తోడయ్యారు. క్రమంగా అది వాళ్లకూ కష్టమై... అంతా కలిసి ఊళ్లోనే ఓ బావి తవ్వారు. ఆ నీటితో పంటలు పండించడం మొదలుపెట్టారు. ఈ కథను ఉదహరిస్తూ... ప్రతి స్త్రీ ధైర్యంగా సమస్యను చెప్పగలిగితే సమాజంలో మార్పు తేవొచ్చు’ అని అంటుంది మిలిందా.

ఆ ధైర్యం ఉండాలి...

మిలిందా దినచర్య చాలా భిన్నంగా ఉంటుంది. రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు నిద్రపోయే ఆమె... మర్నాడు ఆరు లేదా ఆరున్నర గంటలకు నిద్రలేస్తుంది. ఓ గంటసేపు తనకంటూ క్వయిట్‌ టైం అని పెట్టుకుంది. ఇతర పనులయ్యాక బయటకు వెళ్తుంది. తన ఫౌండేషన్‌ కావచ్చు... మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన పైవోటల్‌ వెంచర్స్‌ కావొచ్చు. ఎక్కడయినా సరే చాలా తక్కువ సమయంలోనే సమావేశాలు పూర్తి చేస్తుంది. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించేందుకే ఆమె పైవోటల్‌ వెంచర్స్‌ని ప్రారంభించింది. ఒక మహిళ వృత్తిగతంగా ఉన్నత స్థాయికి చేరుకుంటే... తనలాంటి మరికొందరికి చేయూత అందిస్తుందని నమ్ముతుందామె. ఆ సాధికారత గురించి వివరిస్తూనే వ్యాపారవేత్తలనే కాదు... ఉద్యోగినులు కూడా కుటుంబ   సభ్యుల సహకారంతో ఇంటిపనుల్ని సమన్వయం చేసుకోవడం తప్పనిసరి అని ఈ పుస్తకంలో వివరించింది. ‘ఒక మహిళ కావాలనుకుంటే... చాలా తెలివిగా డబ్బు ఖర్చు చేస్తుంది. కుటుంబ ఆరోగ్యం, స్కూలు ఫీజు, పొదుపు చేస్తూనే అన్నింటినీ సమన్వయం చేస్తుంది. సాధికారత స్త్రీకే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళల్ని ప్రోత్సహించాలి. మేం వ్యాపారం చేయాలనుకున్నవారికి అవసరమైన నిధులు సమకూరుస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సంస్థే ఉంది. మా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుని, స్ఫూర్తినిచ్చే మహిళల నుంచి నేనేం నేర్చుకున్నానో కూడా ఈ పుస్తకంలో వివరించా...’ అని  చెబుతుందామె.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.