close

తాజా వార్తలు

ముందే వేసుకోండి మూడేళ్ల ప్లాన్‌

డిగ్రీ విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళిక

డిగ్రీ అడ్మిషన్లు దాదాపు పూర్తయ్యాయి. అందరూ మొదటి సంవత్సరం తరగతులకు హాజరవుతున్నారు. చాలామంది ఇక మూడు లేదా నాలుగేళ్లు గడిస్తే ఆ తర్వాతేంటో అప్పుడు ఆలోచించవచ్చు.. అనుకుంటారు. అందువల్ల విలువైన కాలాన్ని, భవిష్యత్తును నష్టపోయే అవకాశం ఉంది. డిగ్రీలో చేరగానే రిలాక్స్‌ కాకుండా తర్వాత ఏం చేయాలో ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం మంచిది. తగిన ప్రణాళిక తయారు చేసుకొని ఇప్పటి నుంచే సన్నద్ధమైతే కలలను సాకారం చేసుకోవచ్చు.

న్నత విద్యకు, పలు ఉద్యోగాలకు కనీస అర్హత డిగ్రీ. దీనితో కలెక్టర్‌ ఉద్యోగాల నుంచి క్లర్కు పోస్టుల వరకు పోటీపడవచ్చు. ఎన్నో రకాల పీజీలు చేయవచ్చు. పరిశోధనలు చేసి డాక్టరేట్‌లు సంపాదించుకోవచ్చు. ఎన్ని మార్గాలు ఉన్నా... ఎవరి ఆసక్తి మేరకు వారు తమ మార్గాన్ని ముందే నిర్దేశించుకోవాలి. తగిన ప్రయత్నాలను డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించాలి. అభిరుచుల మేరకు నిపుణులు, సీనియర్ల సాయంతో స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మంచి భవిష్యత్తు కోసం మూడేళ్లకు అనువైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
డిగ్రీ తర్వాత ముఖ్యంగా కనిపించే మార్గాలు మూడు. అవి... డిగ్రీకి అనుబంధంగా ఉన్నత విద్య కొనసాగింపు, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరడం, ఉద్యోగ ప్రయత్నాలు. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే సన్నద్ధమైతే కెరియర్‌ సరైన దిశగా సాగుతుంది. సమయం వృథా కాకుండా కోరుకున్న దారిలో స్థిరపడవచ్చు. ప్రణాళిక లేకపోతే అన్ని విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుత కోర్సులకు కొనసాగింపుగా ఉన్నత విద్యలో చేరాలనే లక్ష్యం ఉన్నవారు డిగ్రీ సిలబస్‌ బాగా చదవాలి. ప్రొఫెషనల్‌ కోర్సులు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు సంబంధిత పరీక్షల వివరాలను సేకరించుకోవాలి. అందుకు అవసరమైన సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించాలి.

అనుబంధ ఉన్నత విద్య

డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకునేవారు ఇప్పుడే తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ సబ్జెక్టు స్పెషలైజేషన్‌తో పీజీ చేయవచ్చు. ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల చేయాలనుకుంటున్న పీజీకి తగిన సంస్థ ఏది, ప్రవేశం ఎలా తదితర వివరాలను సేకరించుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్లను ఎంచుకుంటే పీజీలో నాణ్యమైన విద్యను పొందవచ్చు. అందుకే అవగాహనతో అడుగులేస్తే మేటి సంస్థల్లో సీటు సాధించుకోవచ్చు. పలు ఐఐటీలు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియాలజీ, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులను ఎమ్మెస్సీ స్థాయిలో అందిస్తున్నాయి. వాటిలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కూడా అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత చదువులకు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సన్నద్ధం కావచ్చు. దేశంలోని టాప్‌ విశ్వవిద్యాలయాల్లో హెచ్‌సీయూ ఒకటి. సైన్స్‌ కోర్సులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, బెంగళూరు, ఐఐఎస్‌ఈఆర్‌; హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌కు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; ఆంగ్లం, విదేశీ భాషలకు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ ప్రఖ్యాత సంస్థలు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో  బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, తేజ్‌పూర్‌ యూనివర్సిటీ మొదలైనవి ముందు వరుసలో ఉంటాయి. డిగ్రీ ప్రారంభం నుంచే ప్రణాళికతో ప్రయత్నిస్తే వీటిలో సీటు సంపాదించుకోవచ్చు.

ప్రొఫెషనల్‌ కోర్సులు

ప్రొఫెషనల్‌ కోర్సులు అంటే ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్‌ మొదలైనవి. డిగ్రీలో చదివిన గ్రూపులతో సంబంధం లేకుండా ఎవరైనా వీటిలో చేరవచ్చు. ఈ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువమంది ఎంబీఏ చదవడానికి ప్రాధాన్యమిస్తున్నారు.మేనేజ్‌మెంట్‌ కోర్సులకు రాష్ట్రస్థాయిలో ఐసెట్‌, జాతీయస్థాయిలో క్యాట్‌, ఎక్స్‌ఏటీ, మ్యాట్‌...తదితర పరీక్షలెన్నో ఉన్నాయి.  ఎంబీఏకి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు జాతీయ స్థాయిలో ప్రసిద్ధ సంస్థలు. క్యాట్‌ స్కోర్‌తో ఐఐఎంలతోపాటు జాతీయ స్థాయిలో పేరు పొందిన ప్రభుత్వ సంస్థలు, బీ-స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. 80 పర్సంటైల్‌ సాధించివారికి మంచి బిజినెస్‌ స్కూల్‌లో సీటు లభిస్తుంది. వీటిలో కోర్సు పూర్తి చేస్తే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచి సన్నద్ధమైనవారు క్యాట్‌లో 80 పర్సంటైల్‌ పొందడం సాధ్యమే. అందుకే మేనేజ్‌మెంట్‌ కోర్సులు లక్ష్యమైతే క్యాట్‌పై గురిపెట్టాలి. ఎంసీఏ చదవాలనుకున్నవారు ఎన్‌ఐటీలు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు కోసం నిమ్‌సెట్‌ పరీక్ష రాసుకోవచ్చు. డిగ్రీ అనంతరం లా కోర్సుల్లో చేరాలనుకున్నవారికి జాతీయ స్థాయిలో దిల్లీ యూనివర్సిటీ మేటి సంస్థ. రాష్ట్రస్థాయి సంస్థల్లో లాసెట్‌ ద్వారా అవకాశం లభిస్తుంది. బీఎడ్‌కి ఆర్‌ఐఈ, మైసూరు; అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తదితరాలు పేరున్న సంస్థలు.  ప్రసిద్ధ సంస్థల్లో  సీటు కోసం మంచి ర్యాంకు సాధించడానికి ఇప్పటి నుంచే సిద్ధం కావడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కుతుంది.

జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలు 

జామ్‌: సైన్స్‌ కోర్సుల్లో పీజీ చేయాలనుకునేవారు దృష్టి సారించాల్సిన పరీక్ష జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ (జామ్‌). దీనిద్వారా ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సుల్లోకి ప్రవేశం లభిస్తుంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియాలజీ, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ తదితర పీజీ కోర్సుల్లో చేరవచ్చు. సాధారణ డిగ్రీతో ఐఐటీ కల నెరవేర్చుకోవడానికి జామ్‌ చక్కని దారి. వాటి తర్వాత భవిష్యత్తులో పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు. 
సీఈఈబీ: బయోటెక్నాలజీలో ఉన్నత విద్య సాగించాలని కోరుకునేవారు కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (సీఈఈబీ) పై దృష్టి పెట్టవచ్చు. జేఎన్‌యూ ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. జేఎ  న్‌యూ, హెచ్‌సీయూతోపాటు 40కి పైగా సంస్థల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సుల్లోకి ఈ పరీక్ష స్కోరు ద్వారా ప్రవేశం లభిస్తుంది. కోర్సుల్లో చేరినవారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ నెలకు రూ.5000 స్టయిపెండ్‌ అందిస్తుంది. 
సీయూసెట్‌: కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) పేరుతో పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వివిధ సబ్జెక్టుల్లో ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహా 14 సెంట్రల్‌ యూనివర్సిటీలు, బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ప్రవేశాలు సీయూసెట్‌తో జరుపుతారు.
ఐఎస్‌ఐ: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)- కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమాటిక్స్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. వీటిల్లో చేరితే  నెలకు రూ.5000 చొప్పున స్టయిపెండ్‌ అందుకోవచ్చు. ఏ విభాగంలో పీజీ ఎంచుకుంటారో దాన్ని డిగ్రీ స్థాయిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
జెస్ట్‌: జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (జెస్ట్‌)తో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. స్టయిపెండ్‌ ఇస్తారు. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతో డిగ్రీ చేస్తున్నవారు ఈ పరీక్షకు హాజరుకావచ్చు. సిలబస్‌ వివరాలను చూసుకొని ముందు నుంచి సన్నద్ధం కావడం మంచిది.

ఉద్యోగాల దిశగా...

డిగ్రీ అనంతరం ఉద్యోగాన్ని ఆశించేవారికి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలు అత్యున్నతమైనవి. కేంద్రంలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్షకు  పోటీ పడవచ్చు. జాతీయ బ్యాంకుల్లో క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఐబీపీఎస్‌ నిర్వహించే క్లరికల్‌, పీవో పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. రాష్ట్ర స్థాయిలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జరిపే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు హాజరుకావచ్చు.యూనిఫాం ఉద్యోగాలు కోరుకునేవారికి డిగ్రీ అర్హతతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు మంచి అవకాశం. తరచూ రైల్వేలు నిర్వహించే స్టేషన్‌ మాస్టర్‌, గూడ్స్‌ గార్డు, క్లర్క్‌..తదితర పోస్టుల పరీక్షలకూ  డిగ్రీనే కనీస విద్యార్హత. ఇలా పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో ఆసక్తి ఉన్నవాటిని ఎంచుకొని డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సిద్ధమైతే త్వరగా ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.
రైల్వే, బ్యాంక్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ప్రభుత్వ బీమా కంపెనీలు తదితర ఉద్యోగ పరీక్షలన్నింటికీ సిలబస్‌ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అందువల్ల ఒకదానికి సన్నద్ధమైనా మిగతా పరీక్షలన్నీ రాసుకోవచ్చు. గ్రూప్‌-1, సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకుంటే సిలబస్‌కు అనుగుణంగా సమకాలీన అంశాలను గమనిస్తూ అధ్యయనం చేయాలి. ఆర్ట్స్‌ కోర్సులు అంటే హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, జాగ్రఫీ తదితర సబ్జెక్టులను డిగ్రీలో చదువున్నవారికి చాలా వరకు ఆ సిలబస్‌ పోటీ పరీక్షల్లో ఉండటం కొంత కలిసొస్తుంది. వీరు సైన్స్‌ సబ్జెక్టులపై దృష్టి సారించాలి. అభ్యర్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవడం డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించాలి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.