close

తాజా వార్తలు

ఆ అమ్మాయి వివాదంలోనే టెకీ హత్య

కేపీహెచ్‌బీలో టెకీ హత్య కేసులో నిందితుడి అరెస్టు

 విస్తుపోయే విషయాలు వెల్లడించిన పోలీసులు

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలోని ఏడో ఫేజ్‌లో ఐటీ సంస్థ యజమాని సతీశ్‌బాబు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి స్నేహితుడు, ఐటీ సంస్థ భాగస్వామి హేమంత్‌ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డాడని వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హేమంత్‌ కనిపించకపోవడం, ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండటంతో ఆయనకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు అనుమానించి చివరకు హత్య చేసినట్టు నిర్థారణకు వచ్చినట్టు తెలిపారు. తన ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయితో సహజీవనం చేశాడని.. దీన్ని హెచ్చరించడంతోనే సతీశ్‌పై కక్ష పెంచుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఆగస్టు 28న రాత్రి సతీశ్‌బాబును ప్రణాళిక ప్రకారమే తన ఇంటికి పిలిచి హత్య చేశాడని తెలిపారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తెలిపారు. అలాగే, మృతదేహాన్ని ముక్కలుగా కోసేందుకు కట్టర్‌ కూడా కొన్నాడనితెలుపుతూ ఈ కేసులో విస్తుపోయే అంశాలను వెల్లడించారు.

ఈ కేసులో పూర్వాపరాలు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన కథనం ప్రకారం.. ‘‘ హేమంత్‌ ఇంటికి తాళం వేసి ఉండటంతో పగులగొట్టి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ సతీశ్‌ బాబు మృతదేహం గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. దాని ఆధారంగా హత్య కేసు నమోదు చేశాం. ఈ కేసులో నిందితుడు హేమంత్‌ది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. మృతుడు సతీశ్‌ బాబుది ప్రకాశం జిల్లా వాసి.  ఇద్దరూ కోరుకొండ పాఠశాలలో క్లాస్‌మేట్స్‌. పదేళ్ల క్రితం సతీశ్‌ బాబు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ శిక్షణా సంస్థ ఏర్పాటు చేశాడు. దాంతో కొంత ఆదాయం రావడంతో అక్కడే ఐటీ స్లేట్‌ కన్సల్టెన్సీ అనే సంస్థను మరికొందరి భాగస్వామ్యంతో ఏర్పాటుచేశాడు.  

ఆ అమ్మాయితో సహజీవనం
 2016లో హేమంత్‌ ఉద్యోగం కోసం సతీశ్‌ వద్దకు హైదరాబాద్‌ వచ్చాడు. స్నేహితుడే కావడంతో తన కంపెనీలో అడ్మినిస్ట్రేషన్‌గా ఉద్యోగం ఇచ్చాడు. హేమంత్‌ కొంత కాలం ఐటీ సొల్యూషన్స్‌లో శిక్షణ ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే కంపెనీని  కేపీహెచ్‌బీకి షిఫ్ట్‌ చేశారు. ఆ సమయంలోనే హేమంత్‌ కూడా రూ.3లక్షలు పెట్టి భాగస్వామిగా చేరాడు. 2017లో విజయవాడకు చెందిన ఓ యువతి తెలిసినవారి ద్వారా ట్రైనింగ్‌ తీసుకొనేందుకు సతీశ్‌ వద్దకు వచ్చింది.  ట్రైనింగ్‌ పూర్తయ్యాక ఆమె కూడా అదే కంపెనీలో రూ. 25వేల జీతానికి ఉద్యోగంలో చేరింది. కంపెనీలో పనిచేస్తున్న క్రమంలోనే కేపీహెచ్‌బీలో హేమంత్‌కు ఆమె అసిస్టెంట్‌గా పనిచేసేది. ఈ నేపథ్యంలో హేమంత్‌, ఆ యువతికి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ కాస్త చనువుగా ఉన్నా సతీశ్‌ పెద్దగా పట్టించుకోకపోయేవాడు. హేమంత్‌కు పెళ్లయింది. వీరిద్దరి మధ్య సంబంధం గురించి తెలిసి హేమంత్‌ భార్య కూడా దూరమైంది. 

హెచ్చరించినందుకే ఘాతుకం
హాస్టల్‌లో ఉండే యువతి, హేమంత్‌ కేపీహెచ్‌బీలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం మొదలు పెట్టారు. ఇద్దరూ బాగా సన్నిహితంగా మెలగడం గమనించిన సతీశ్‌బాబు అనుమానంతో విచారణ చేయించాడు. గత మూడు నెలలుగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని తెలిసింది. మరోవైపు, కేపీహెచ్‌బీలో ఉన్న కంపెనీ నష్టాల్లోకి రావడంతో హేమంత్‌ను నిలదీశాడు. అ యువతిని హాస్టల్‌కు పంపించేయాలని, ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందని నచ్చజెప్పే ప్రయత్నంచేశాడు. ఇద్దరూ ఒకేచోట ఉండటానికి వీళ్లేదని, ఆమెను హాస్టల్‌కు పంపించేయాలని ఒత్తిడి తెచ్చాడు. అప్పట్నుంచి ద్వేషం పెంచుకున్న హేమంత్‌.. సమయం కోసం వేచిచూశాడు.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని యత్నం..
వారం రోజులు గడవడంతో ఆగస్టు 28న ఇల్లు ఖాళీ చేశావా? లేదా? అంటూ సతీశ్‌ బాబు హేమంత్‌కు ఫోన్‌ చేశాడు. ఈ క్రమంలో పార్టీ చేసుకుందాం.. రా అంటూ తన ఇంటికి సతీశ్‌ను ఆహ్వానించాడు. సమీపంలోని దుకాణంలో నాలుగు బీర్లు కొన్నాడు. ఆ సమయంలోనే ఆ యువతిని హాస్టల్‌లో దించి వచ్చాడు. మద్యం తాగిన తర్వాత సతీశ్‌, హేమంత్‌ మధ్యా మాటా మాటా పెరగడంతో సుత్తితో సతీశ్‌బాబు తలపై బలంగా కొట్టి చంపాడు. ఆ రోజు రాత్రి మృతదేహాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఓ వాహనాన్ని కూడా అద్దెకు మాట్లాడాడు. ఆ రాత్రి 11 గంటలు 11.30గటల సమయంలో మృతదేహం తరలించే ప్రయత్నం జరిగింది. బరువు ఉన్నందున మోయలేని పరిస్థితుల్లో షిఫ్ట్‌ చేయలేకపోయాడు. మృతుడి వాహనాన్ని ఎవరైనా గుర్తిస్తారేమోనని సమీపంలో ఉన్న ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ వద్ద పెట్టాడు. తిరిగివచ్చి మృతదేహాన్ని తరలించడం సాధ్యపడక మరుసటి రోజు చేయాలనుకున్నాడు.

హత్యచేసి ఆచూకీ కోసం వెతికినట్టుగా నటన!

గత నెల 29న ఓ దుకాణానికి వెళ్లి కట్టర్‌ కొన్నాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి బయట పడేద్దామని ప్రయత్నించినా.. సాధ్యంకాలేదు. ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయాడు.అప్పటికే సతీశ్‌బాబు కోసం ఆయన స్నేహితులు వెతుకుతుండటంతో ఏమీ తెలియనట్టుగా వెళ్లి వారితో కలిసిపోయాడు. వారు కాల్‌ లిస్ట్‌ ఆరా తీస్తుండటంతో మాయమయ్యాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టుచేశాం. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం ఉందేమోనన్న కోణంలో విచారిస్తున్నాం. ఇప్పుడు లభ్యమైన ఆధారాలను బట్టి హేమంత్‌ ఒక్కడికే ఈ కేసులో ప్రమేయం ఉంది. అమ్మాయితో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నాడన్న ఒకే కారణంతో హత్యచేసినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీల సమస్య అంత పెద్దది కాదు’’ అని డీసీపీ వెల్లడించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.