close

తాజా వార్తలు

యువరక్తం జోరు నెగ్గేదెలా సీనియరు..!

అశ్విన్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం 

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాగే టీమిండియాలో ఇద్దరు స్పిన్నర్లకు మించి అవకాశం ఉండదు. కొత్త నీరొచ్చినప్పుడు వెళ్లిపోయే పాత నీరులా యువతరం జోరు మీదుంటే  సీనియర్లు వెళ్లిపోక తప్పదు. ఐతే కొత్త.. పాత నీరు కలిసే చోటు ఒకటుంటుంది. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ది ఇప్పుడిదే పరిస్థితి. మంగళవారం యాష్‌ 33వ పుట్టిన రోజు. జట్టులో చోటు కోసం విపరీతంగా శ్రమిస్తున్న అతడి భవితవ్యం మున్ముందు ఎలా ఉండనుందో..!

ఐపీఎల్‌తో వెలుగులోకి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వెలికి తీసిన ఆణిముత్యాల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకడు. ఎంఎస్‌ ధోనీ అండతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రధాన బౌలర్‌గా అవతరించాడు. డెత్‌ ఓవర్లలో ప్రమాదకర బంతులు విసిరి అవసరమైన ప్రతిసారీ వికెట్లు తీసేవాడు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఛాంపియన్స్‌ లీగ్‌ ట్వంటీ20లో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై అదరగొట్టాడు. పొట్టి క్రికెట్‌ ఫార్మాట్లో అతడి మెరుపులకు మెచ్చిన సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. 2010లో హరారే వేదికగా వన్డేల్లో శ్రీలంకపై అశ్విన్‌ అరంగేంట్రం చేశాడు. వారం రోజుల్లోనే టీ20ల్లో రంగ ప్రవేశం చేశాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసి 2011లో వెస్టిండీస్‌పై సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. 8 వికెట్లు తీసి అరంగేట్రంలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అవతరించాడు. నరేంద్ర హీర్వాణి (16 వికెట్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు. 16 టెస్టుల్లోపే 9 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 18 టెస్టుల్లోనే 100 వికెట్లు ఖాతాలో వేసుకొని అత్యంత వేగంగా శతక వికెట్లు సాధించిన ఎర్రపల్లి ప్రసన్న రికార్డును బద్దలు కొట్టాడు.

తెలివిగా బౌలింగ్‌

అశ్విన్‌ ఆర్మ్‌బాల్‌ ఎంత పక్కగా ఉంటుందో క్యారమ్‌ బంతి అంతే ప్రభావవంతంగా వేస్తాడు. ఇక ఆఫ్‌బ్రేక్‌లకు తిరుగులేదు. సమయోచితంగా ఆలోచిస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించేవాడు. అనతి కాలంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ మెరుగైన స్పిన్నర్‌గా అవతరించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం కాస్త గడ్డుకాలం ఎదుర్కొన్నాడు. 2013, డిసెంబర్లో జోహన్స్‌ బర్గ్‌ టెస్టులో ప్రత్యర్థి 458 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా 36 ఓవర్లు వేసి వికెట్‌ పడగొట్టలేకపోయాడు. ఆ తర్వాత 6 టెస్టుల వరకు రిజర్వు బెంచీపై కూర్చుకున్నాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్‌ టెస్టుకు ఎంపికవ్వలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న అశ్విన్‌ తన శైలిలో మార్పులు చేసుకొన్నాడు. ఫిట్‌నెస్‌పై శ్రమించాడు. 2015 ఆఖర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై 31 వికెట్లు తీసి 3-0తో టెస్టు సిరీస్‌ గెలిపించాడు. బ్యాటుతోనూ రాణిస్తూ జట్టుకు ఉపయోగపడ్డాడు. వెస్టిండీస్‌పై అతడికి బంతి, బ్యాటుతో అద్భుత రికార్డు ఉంది. 2016 టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశలో అదరగొట్టాడు. కానీ సెమీస్‌లో విండీస్‌ ఆటగాడు లెండిల్‌ సిమన్స్‌ (82*; 51 బంతుల్లో 7×4, 5×6) క్యాచ్‌ ఇచ్చిన బంతిని నోబాల్‌ వేశాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. గావస్కర్‌ అయితే కామెంటరీ చేస్తూనే అతడిపై విమర్శలు కురిపించాడు. సిమన్స్‌ చెలరేగి ఆడటంతో 193 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ సునాయాసంగా ఛేదించింది. టీమిండియాకు ప్రపంచకప్‌ చేజారింది.

మణికట్టు పోటీలో వెనుకంజ

తన స్థానానికి తిరుగులేదని భావించిన అశ్విన్‌కు యువ స్పిన్నర్లు భారీ షాకులే ఇచ్చారు. మణికట్టు ద్వయం కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ విజృంభించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంతో క్రమం తప్పకుండా వారిని తుది జట్టుకు ఎంపికచేశారు. ఐతే సెలక్టర్లు ఊరికే యాష్‌పై వేటు వేయలేదు. 2017లో పరిమిత ఓవర్ల  క్రికెట్‌లో అతడి  ప్రదర్శన నామమాత్రమే. 8 వన్డేల్లో 8 వికెట్లే తీశాడు. ఇంగ్లాండ్‌పై తొలి పోరులో 8 ఓవర్లకు 0/63 పరుగులు ఇచ్చాడు. రెండో వన్డేలో కాస్త పుంజుకున్నాడు. బెన్‌స్టోక్స్‌, బట్లర్‌, రూట్‌ను పెవిలియన్‌ పంపాడు. ఐతే ఎకానమీ 7.11గా నమోదు చేశాడు. మూడో వన్డేలో మళ్లీ 9 ఓవర్లకు 0/60 పరుగులు ఇచ్చాడు. కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో సఫారీలపై 9 ఓవర్లకు 1/43 నమోదు చేశాడు. బంగ్లాపై 10 ఓవర్లకు 54, పాక్‌పై 10 ఓవర్లకు 70 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. జూన్‌లో విండీస్‌పై తొలి వన్డేలో 9  ఓవర్లకు 1/47, రెండో వన్డేలో 10 ఓవర్లకు 3/28 గణాంకాలు సాధించాడు. 2017లో ఒకే ఒక టీ20 ఆడాడు. నిలకడ లేమి వల్ల సెలక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం టెస్టుల్లోనూ అతడికి కాలం కలిసి రావడం లేదు.

కిం కర్తవ్యం?

తనను తాను మెరుగుపర్చుకొనేందుకు అశ్విన్‌ ఎప్పటికీ వెనుకాడడు. నిరంతరం కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటాడు. ఇటీవలే తమిళనాడు ప్రీమియర్‌ లీగులో ప్రయోగాలు చేశాడు. బౌలింగ్‌ శైలి మార్చాడు. మీడియం పేసర్ల తరహాలో రన్నప్‌ చేస్తూ క్రీజువద్దకు వచ్చి మెల్లగా బంతి విసిరాడు. ఆఫ్‌బ్రేక్‌లు వేసే అశ్విన్‌ గతేడాది లెగ్‌స్పిన్‌ను నేర్చుకున్నాడు. వైవిధ్యం కోసం క్యారమ్‌ బంతులను పక్కాగా విసురుతాడు. యువతరంతో పోటీపడాలంటే మున్ముందూ అతడు నేర్చుకోవడం ఆపొద్దు. నిలకడగా వికెట్లు పడగొట్టాలి. ఆపద్బాంధవుడిగా పేరుతెచ్చుకోవాలి. నాటింగ్‌హామ్‌ తరఫున మొన్నే తొమ్మిది వికెట్లు తీసి అదరగొట్టాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం అత్యంత అవసరం. గతేడాది ఆస్ట్రేలియాలో పర్యటనలో ఓ మ్యాచ్‌లో గాయపడ్డా బౌలింగ్‌ చేశాడు. వికెట్లేమీ తీయలేదు. దీంతో గంగూలీ, లక్ష్మణ్‌ వంటి మాజీ క్రికెటర్లు దేహాన్ని దృఢంగా ఉంచుకోవాలని లేదంటే యువ ఆటగాళ్లతో పోటీపడటం కష్టమని వెల్లడించారు. వారి సలహాలు పాటిస్తూ వికెట్లు తీస్తూ ముందుకెళ్తే అశ్విన్‌కు తగినన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే వెస్టిండీస్‌లో మాదిరిగా రిజర్వుబెంచీకి పరిమితం కావాల్సి ఉంటుంది!

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.