close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ చేరుకున్న కేసీఆర్‌ తొలుత దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం నేరుగా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌, ఇతర నేతలకు జగన్‌ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ జగన్‌ను ఆహ్వానించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి


2. లోక్‌సభలో ఏపీ ఎంపీల ప్రమాణం..

17వ లోక్‌సభ కొలువుదీరింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ప్రమాణం చేయించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత విపక్ష నేత, కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపీల ప్రమాణాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైకాపా, తెదేపా సభ్యులు ప్రమాణం చేశారు. లోక్‌సభలో ఇవాళ, రేపు ఎంపీల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి


3. వైద్యుల సమ్మె.. దిగొచ్చిన దీదీ

పశ్చిమబెంగాల్‌లో వైద్యుల సమ్మె ఉద్రిక్తంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వైద్యుల డిమాండ్‌ మేరకు సీఎం మమతాబెనర్జీతో జరిగే సమావేశం మొత్తాన్ని రికార్డు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు బెంగాల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ సమ్మె చేస్తున్న జూనియర్‌ వైద్యులకు రాసిన ఓ లేఖలో వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఆ లేఖలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


4. నైజీరియాలో ఆత్మాహుతి దాడి:30మంది మృతి

నైజీరియాలో బొకొహరం ఉగ్రవాదులు మరో దురాగతానికి పాల్పడ్డారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30మంది మృత్యువాత పడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ అభిమానులందరూ గుంపుగా టీవీలో మ్యాచ్‌ను వీక్షింస్తుండగా ముగ్గురు మిలిటెంట్లు తమను తాము పేల్చుసుకున్నారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


5. ‘ప్రాణహిత-చేవెళ్ల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు’

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఇంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టు మరొకటి లేదని చెప్పారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించాలని త్వరితగతిన పూర్తి చేస్తే కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేయడం తగదన్నారు. కాళేశ్వరం పనులు కేవలం 15 శాతం మాత్రమే పూర్తయ్యాయంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను తలసాని తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


6. జగన్‌కు కొత్త కాన్వాయ్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోకి కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యునర్‌ వాహనాలు చేరాయి. AP39PA2345 నంబర్‌తో ఈ కొత్త వాహనశ్రేణి ఉండనుంది. పాత కాన్వాయ్‌ను హైదరాబాద్‌ పంపడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


7. 28 ఏళ్ల కనిష్ఠానికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్లు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్ల విలువ మరింత పడిపోయింది. ఉదయం సెషన్లో ఒకానొక దశలో షేర్ల విలువ 10% తగ్గి  రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరుకుంది. గత 28 ఏళ్లలో షేరు విలువ రూ.52.70లకు చేరడం ఇదే తొలిసారి. రిలయన్స్‌ ఇన్ఫ్రా వార్షిక ఫలితాలపై తాము అభిప్రాయం వెల్లడించలేమన్న ఆడిటర్లు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ, అనుబంధ సంస్థల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆ ప్రభావం షేర్ల మీద పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


8. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు  దళాలపై కాల్పులు జరిపాయి. జవాన్లు అప్రమత్తంగా ఉండటంతో వాటిని తిప్పికొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


9. అమెజాన్‌ ఎంఐ డేస్‌ సేల్‌: ఈ ఫోన్లపై డిస్కౌంట్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియాలో ఎంఐ డేస్‌ పేరుతో షామీ, రెడ్‌మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది. సోమవారం ప్రారంభమైన ఈ సేల్‌ జూన్‌ 21 వరకూ కొనసాగనుంది. వివిధ షామీ ఫోన్లపై రూ.6,500 వరకూ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మొబైల్స్‌ ఎక్సేంఛ్‌పై రూ.4000 వరకూ తగ్గింపు లభించనుంది. ఇక యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులు అదనంగా మరో 5శాతం డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


10. ఫెడ్‌ భయాలు.. మార్కెట్లు బెంబేలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, వాణిజ్య యుద్ధ భయాలతో దేశీయ మార్కెట్లు సోమవారం బెంబేలెత్తిపోయాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లపై దృష్టిపెట్టిన మదుపర్లు ట్రేడింగ్‌ ఆద్యంతం జాగ్రత్త పాటించారు. దీనికి తోడు కీలక రంగ షేర్లు కుదేలవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి మార్కెట్లో సూచీలు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 491 పాయింట్లు దిగజారి 38,961 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.88గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.