close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరు

అయిదువేల టీఎంసీల నీటితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ప్రతీ అంగుళానికి నీరందేలా చూడాలని తెలంగాణ మంత్రిమండలి తీర్మానించింది. రెండు రాష్ట్రాల పరస్పర సహకారంతో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని ప్రకటించింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్‌ ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. యావత్‌ తెలుగు ప్రజానీకానికి మంచి జరగాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా భావించిందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హోదా ఇవ్వాల్సిందే: ఏపీ సీఎం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ గట్టిగా గళమెత్తింది. ప్యాకేజీ వద్దే వద్దని తేల్చి చెప్పింది. హోదా ఇవ్వాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా ఆమోదించారు. మండలిలోనూ ఇదే తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని అభివృద్ధి పథలో నడిపేందుకు సంజీవని అయిన ప్రత్యేక హోదా తప్పనిసరి’ అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పట్టణ పేదలకు అద్దె ఇళ్లు

పట్టణాలు, మెట్రో నగరాల్లో ఏటికేడు పెరిగిపోతున్న మురికివాడలను తగ్గించడానికి సింగిల్‌ రూమ్‌ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ యోచిస్తోంది. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి వీటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఎత్తైన అపార్ట్‌మెంట్లను నిర్మించాలని, ఇందులో కుళాయి ద్వారా నీటి సరఫరా అందుబాటులోకి తేవాలని, ఫ్లాట్‌కు ఒక మరుగుదొడ్డి నిర్మించాలని ప్రతిపాదించింది. ‘‘ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన’’ పథకం కింద అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంత ఆర్థికసాయం చేయాలని కేంద్ర కార్మికశాఖను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరనుందని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గుణాత్మక మార్పు కనిపించడంలేదు: జగన్‌

రైతు భరోసాతో పాటు నవరత్నాల్లో భాగంగా తాము అమలు చేయబోయే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే సొమ్మును అప్పులకు జమ చేసుకునే పరిస్థితి ఉండకూడదని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రుణ మంజూరులో ఏటికేడు వృద్ధి ఉన్నా.. గుణాత్మక మార్పు కనిపించడంలేదని సీఎం పేర్కొన్నారు. 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం సీఎం అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 2.29 లక్షల కోట్లతో రూపొందించిన 2019-20 వార్షిక రుణ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. డ్రైవింగ్‌ లైసెన్సుకు కనీస విద్యార్హత తొలగింపు

యువతకు ఉపాధికావకాశాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ డ్రైవింగ్‌ లైసెన్సుపై కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కమర్షియల్‌ రవాణా లైసెన్సు పొందాలంటే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులు కాకపోయినా ఇకపై లైసెన్సు పొందవచ్చని తాజాగా ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. కాకపోతే మోటారు వాహనాల చట్టం ప్రకారం తగు నైపుణ్య శిక్షణ విధిగా పొందాల్సిందేనని, ట్రాఫిక్‌కు సంబంధించిన సంకేతాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే 

పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐ స్థాయి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నానని, బతికున్నంత వరకు పార్టీని వీడేది లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీని వీడుతున్నారా? అని మళ్లీ మళ్లీ అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ బాగుండాలని మాత్రమే రాజ్‌గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. గత సభలో 14 మంది తెరాస ఎంపీలున్నా ప్రజల కోసం పోరాడలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పది కోట్లు ఇస్తామంటూ భాజపా ఎర

కర్ణాటకలో అధికార జనతాదళ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఘట్టం ముగియడంతో మళ్లీ ‘ఆపరేషన్‌ కమల’ను తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భాజపా నాయకులు మా మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. భాజపాలో చేరితే రూ.10 కోట్లిస్తామని ఆశ చూపుతున్నారు’’ అని ఆరోపించారు. ‘పది మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వారంతా భాజపాలోకి వస్తున్నారు. మీరు కూడా రండి అంటూ ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తున్నారు’ అని కుమారస్వామి ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆర్‌ఐఎల్‌ ఆదాయ అంచనాలకు గండి!

గత కొద్ది త్రైమాసికాలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు ఒత్తిడిలో ఉంటున్నాయి. ప్రస్తుతం రిఫైనింగ్‌, పెట్రో రసాయనాలకున్న ప్రతికూలతల దృష్ట్యా ఆర్‌ఐఎల్‌ 2019-20 ఆదాయ అంచనాలు 15 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్‌ తన నివేదికలో తెలిపింది. ఇక అంతర్జాతీయ సముద్ర సంస్థ(ఐఎమ్‌ఓ) నిబంధనలు నిరుత్సాహపరిస్తే మాత్రం ఆదాయ అంచనాల్లో మరింత కోతలు పడే అవకాశం ఉంది. ధరలను 12-20 శాతం మేర పెంచితే ప్రధాన వ్యాపారాలకు దన్నుగా నిలవవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వామ్మోర్గాన్‌! 

జోరుమీదున్న ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. విధ్వంసక బ్యాటింగ్‌తో పరుగుల వరదపారించిన ఆ జట్టు మంగళవారం 150 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మోర్గాన్‌ (148; 71 బంతుల్లో 4×4, 17×6)తో పాటు బెయిర్‌స్టో (90; 99 బంతుల్లో 8×4, 3×6), రూట్‌ (88; 82 బంతుల్లో 5×4, 1×6) చెలరేగడంతో మొదట ఇంగ్లాండ్‌ 6 వికెట్లకు 397 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గానిస్థాన్‌ 8 వికెట్లకు 247 పరుగులే చేయగలిగింది. హస్మతుల్లా (76), రెహ్మత్‌ షా (46), అస్ఘర్‌ (44) రాణించినా అఫ్గానిస్థాన్‌..  ఆద్యంతం లక్ష్యానికి చాలా దూరంగానే ఉండిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలా చేస్తే ఏమీ నేర్చుకోలేం

సవాళ్లని స్వీకరించడమన్నా.. సాహసాలు చేయడమన్నా ఇష్టమని చెబుతుంటుంది కాజల్‌. ఆ ఆలోచనలకి తగ్గట్టుగానే ఆమె చేతలుంటాయి. ఆమధ్య ఆమె మేకప్‌ ముసుగు తీసేసి ఫొటోలకి పోజులిచ్చి తన ప్రత్యేకతని ప్రదర్శించింది. కెమెరా ముందే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తానింతే అంటోందామె. ‘‘చేసే పని ఏదైనా సరే, అది ఇంతకుముందు చేసినట్టు ఉండకూడదనే రకం నేను. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు మనసుకు ఉత్తేజాన్నే కాదు.. సరికొత్త అనుభవాల్నీ పంచుతుంటాయి.  నలుగురు నడిచిన దారిలో నేనూ వెళితే నా  ప్రత్యేకత ఏముంటుంది? ఒకవేళ అలా ప్రయాణం చేస్తే జీవితంలో ఏమీ నేర్చుకోలేం’’ అంది కాజల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.