close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఈఎస్‌ఐ... అవినీతికి సై 

ఈఎస్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. కొందరు ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఔషధ కొనుగోళ్లలో నిబంధనలకు పాతరేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో నిర్ధారణ పరీక్షల కిట్‌లను అవసరానికి మించి కొన్నట్టుగా అంతర్గత విచారణలో తేలింది. ప్రభుత్వ వైద్య సంస్థలకు సరఫరా చేసే ధరలకే కొనుగోలు చేయాల్సి ఉండగా.. అంతకుమించిన ధరలకు కొన్నారు. 2015-2019 వరకూ కేవలం ఈ కిట్‌ల కోసమే దాదాపు రూ.21 కోట్ల మేరకు అదనంగా చెల్లించినట్లు అంతర్గత విచారణాధికారి ప్రభుత్వానికి నివేదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ 

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నవ్యాంధ్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఇప్పటివరకూ ఇరురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు. 85 ఏళ్ల బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఇంటర్‌ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

ఆత్మహత్యలకు పాల్పడ్డ ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ప్రతిపక్షాలను కూడా నియంత్రిస్తుండడం దారుణమని వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, తెజస నేతలు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మహేశ్వరి అనే విద్యార్థిని తల్లికి రూ.లక్ష చెక్కును అందించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం తదితరుల చేతులమీదుగా అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. తెలంగాణ పాలకులతో లాలూచీ

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్ని నిలిపివేసి, గోదావరి జలాల తరలింపు పథకాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం అవివేకమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో కాలువల ద్వారా నాగార్జునసాగర్‌ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోయడానికి రూ.50 కోట్లకుపైగా అయ్యే వ్యయంలో ఏపీ ఎందుకు వాటా చెల్లించాలి? అదే మొత్తంతో ఏపీలోని ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలి. తెలంగాణ పాలకులతో లాలూచీ పడి రాష్ట్ర సొమ్ము దుబారా చేసే హక్కు జగన్‌కి ఎవరిచ్చారు? పెట్టుబడి మనది, ప్రయోజనం మరో రాష్ట్రానికా?’’ అని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘కర్ణాటక’ రాజీనామాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు నేడు

కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు తీర్పు బుధవారానికి వాయిదా పడింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్‌- జేడీఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు రెండు విడతలుగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. ఈ అంశంపై గత శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. మంగళవారానికి వాయిదా పడిన విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొనసాగించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఇంటింటికీ తాగునీటికి రూ.18.55 లక్షల కోట్లు 

దేశంలో చెన్నై తదితర ప్రాంతాల్లో నీటి సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికీ గొట్టాల ద్వారా తాగునీరందించడానికి భారీగా నిధులు అవసరమని ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకుగాను వచ్చే 15 ఏళ్లలో 270 బిలియన్‌ డాలర్లు (రూ.18.55 లక్షల కోట్లు) అవసరమవుతాయని పేర్కొంది. నదుల అనుసంధానానికే 168 బి. డాలర్లు (రూ. 11.54 లక్షల కోట్లు) వెచ్చించాలని మెర్రిల్‌ లించ్‌ సంస్థ అంచనావేసింది. నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలు అవసరమని, దీనిపై దృష్టి సారించాలని భారత పరిశోధన విభాగం అధిపతి అమిష్‌ షా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. జీవితాంతం టోల్‌ కట్టాల్సిందే 

ప్రజలకు మంచి రహదారులు కావాలంటే వాళ్లు టోల్‌ రుసుము కట్టాల్సిందేనని, ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేనందున టోల్‌ వ్యవస్థ కొనసాగుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో మంగళవారం ఆయన ఈ విషయంపై మాట్లాడారు.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌ వసూలుపై కొందరు సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా గడ్కరీ సమాధానమిస్తూ సామర్థ్యం ఉన్న ప్రాంతాల నుంచి టోల్‌ తీసుకుని, గ్రామాలు.. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఆ నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మొండి బకాయిలు రూ.9.34 లక్షల కోట్లకు తగ్గాయ్‌

గత ఆర్థిక సంవత్సరం (2018-19) ముగిసే నాటికి వాణిజ్య బ్యాంకుల మొత్తం మొండి బకాయిలు రూ.1.02 లక్షల కోట్లు తగ్గి రూ.9.34 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఫలితాన్ని ఇచ్చాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పారదర్శకంగా నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) గుర్తింపు, పరిష్కారం, ఒత్తిడిలో ఉన్న ఆస్తుల రికవరీ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం, ప్రక్షాళన వంటి ప్రభుత్వం చర్యలతో మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రెండేళ్ల అనుభవం.. 60 ఏళ్ల లోపు వయసు 

రవిశాస్త్రి, అతడి సహాయక బృందం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో టీమ్‌ఇండియా కోచింగ్‌ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ ప్రకటన వెలువరించింది. ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పదవులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఏదైనా టెస్టు జట్టుకు జట్టుకు రెండేళ్లు లేదా అసిసోయేట్‌ జట్టు/‘ఎ’/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు కోచ్‌గా పని చేసి ఉండాలి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవమూ ఉండాలి. వయసు 60 మించకూడదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బాలికల పాలిట బూచోడు 

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఓ సెక్యూరిటీ గార్డును మైలార్‌దేవుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సుశీల్‌కుమార్‌ సింగ్‌(38) రాజేంద్రనగర్‌లో స్థిరపడ్డాడు. హసన్‌నగర్‌ బస్తీలో నివాసముంటూ కాటేదాన్‌ పారిశ్రామికవాడలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వారాంతాల్లో సెలవు ఉండటంతో బస్తీల్లో తిరిగేవాడు. ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను పసిగట్టి వారికి చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకుని నిర్మానుష్య ప్రదేశాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. తరువాత వారిని అక్కడే వదిలి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.