close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. దసరా కల్లా భవనాలు పూర్తి కావాలె: కేసీఆర్‌

దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు నిర్దేశించారు. తెలంగాణభవన్‌లో తెరాస ముఖ్య నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తెరాస నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 29 జిల్లాల్లో శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు ఇవాళ చెక్కులు అందజేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తిరుమలలో ఆ దర్శనాలు రద్దు

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రేక్‌ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్‌-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్‌ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా సామాన్య భక్తుల దర్శనం సమయం మరింత పెంచుతామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌

కర్ణాటక రాజకీయ నాటకీయం కొనసాగుతూనే ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్‌పై నిన్న విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. నేడు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. రెబల్స్‌ రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, అయితే అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్నది మాత్రం ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపు అసెంబ్లీలో కుమారస్వామికి బలపరీక్ష ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు వస్తారా రారా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే శాసనసభకు వెళ్లే ప్రసక్తే లేదని అసమ్మతులు గట్టిగా చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్టయ్యాడు. ఓ కేసు విచారణలో భాగంగా లాహోర్‌ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పాక్‌ మీడియా వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్‌, అల్లూరి పేర్లు పెట్టాలి

పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో వెల్లడించారు. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని  సభ్యులు సూచించారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, ఫూలే వంటి మహనీయుల పేర్లు పెట్టాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కోల్‌ ఇండియా విభజన..?

ప్రపంచలోనే అతిపెద్ద బొగ్గు మైనింగ్‌ సంస్థ కోల్‌ ఇండియాను విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యతో పోటీతత్వం పెరగటంతో పాటు నిధుల సమీకరణ కూడా మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం పంపిన ప్రతిపాదనను కోల్‌ ఇండియా, బొగ్గు మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేంద్రాలను, అన్వేషణ విభాగాన్ని ప్రత్యేక నమోదిత కంపెనీలుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ప్రపంచకప్‌లో ఐదుగురు ప్రత్యేక బ్యాట్స్‌మెన్‌ వీరే!

ప్రపంచకప్‌ ముగిసిన నేపథ్యంలో టోర్నీలో ఐదుగురు ప్రత్యేక బ్యాట్స్‌మెన్‌ పేర్లను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ మేరకు ఐసీసీ తన ట్విటర్‌ ఖాతాలో ‘‘ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ ప్రపంచకప్‌ టోర్నీలో అత్యంత ప్రత్యేకం’’ శీర్షికతో ఓ వీడియోను ఉంచింది. ఇందులో రోహిత్‌ శర్మతో పాటు మరో నలుగురి పేర్లను పొందుపర్చింది. ఈ జాబితాలో రోహిత్‌ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ తరువాతి స్థానాల్లో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నూతన గవర్నర్‌కు జగన్‌ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి జగన్‌ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా సీఎం నూతన గవర్నర్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విశిష్ట నాయకుడిగా కొత్త బాధ్యతను ఆయన సమర్థంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

9. ‘తెదేపా హయాంలో మేటర్‌ వీక్‌..పబ్లిసిటీ పీక్‌’

రాష్ట్ర బడ్జెట్‌లో పింఛన్ల కోసం అధిక నిధులు కేటాయించామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. పింఛన్లకు రూ.15,868 కోట్లు కేటాయించామన్నారు. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.11వేల కోట్లు కేటాయించి రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిదన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆర్థికమంత్రి సమాధానమిచ్చారు. తెదేపా పాలనలో ప్రచార ఆర్భాటం ఎక్కువని.. అందుకే ప్రజలు కూడా ‘మేటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌’ అంటుంటారని ఎద్దేవా చేశారు. పలు పథకాల్లో తెదేపా ప్రభుత్వం జరిపిన కేటాయింపులకు, ఖర్చుకు సంబంధం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. స్వల్పలాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్పలాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 11,682, సెన్సెక్స్‌ 89 పాయింట్లు లాభపడి 39,220 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలోని ఆటో సూచీ తప్పితే మిగిలినవి మొత్తం లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. డీసీబీ బ్యాంక్‌ షేర్లు 14శాతం కుంగాయి. ఈ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికానికి అంచనాల కన్నా తక్కువ స్థాయిలో ఫలితాలను ప్రకటించడంతో షేర్లు పడిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.