close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌@ 9 PM

1. కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత!

నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం లభించింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ తిరిగి పున:సమీక్షించే వరకు మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఐసీజేలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చారు. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. కర్ణాటకం: విశ్వాస పరీక్ష వాయిదా?

కర్ణాటక రాజకీయాల్లో మలుపులు కొనసాగుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో విశ్వాస పరీక్షే తరువాయి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో కొత్త సాంకేతిక అంశాలను ఆధారంగా చేసుకుని విశ్వాస పరీక్షను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కొన్ని అంశాలను స్పీకర్‌ ముందుంచింది. అటు భాజపా విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్న నేపథ్యంలో స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. పీపీఏలపై అసత్య ప్రచారం: చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల కోసం తాము విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటే.. వైకాపా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలో సొంత విద్యుత్‌ సంస్థలు ఉన్న జగన్‌ అక్కడ ఎక్కువ ధరకు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారని నిలదీశారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ ప్రజలకు అందించాలని తాము తపిస్తే.. రెండు నెలల్లోనే వ్యవస్థను అస్తవ్యస్థం చేసి చీకటి రోజులను తెచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పీపీఏలపై  పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో తమ దగ్గర ఎలాంటి క్విడ్‌ ప్రోకోలు లేవనే విషయం జగన్‌ గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. కపిల్‌ కమిటీకి టీమిండియా కోచ్‌ ఎంపిక బాధ్యత

టీమిండియా కొత్త కోచ్‌ ఎంపిక బాధ్యతను క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని తాత్కాలిక కమిటీకి అప్పగించింది. కపిల్‌దేవ్‌తో పాటు అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి ఈ కమిటీలో ఉన్నారు. వీరు డిసెంబర్‌లో భారత మహిళల జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పురుషుల కోచ్‌నూ ఎంపిక చేయాలని బీసీసీఐ వారిని కోరిందని తెలిసింది. అప్పటిలాగే ఈ వ్యవహారం మళ్లీ సీఓఏలో విభేదాలకు కారణం కావొచ్చని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. ఆస్తి వివాదంలో కాల్పులు.. 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఆస్తి వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం ఉదయం స్థలం కోసం రెండు వర్గాలు ఘర్షణలకు దిగి పరస్పరం కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ కుమార్‌ అగర్వాల్‌  తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఉబ్బా గ్రామంలో ఆస్తి కోసం జరిగిన వివాదంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు ఊరట

బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని బిగ్‌బాస్‌ నిర్వాహకుడు అభిజిత్ ముఖర్జీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి వరకు అరెస్టు వంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. యాంకర్ శ్వేతరెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్, నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్‌స్టేషన్లో బిగ్‌బాస్‌ నిర్వాహకులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. ‘ఏ ప్రాతిపదికన ఆ భవనాలను కూలుస్తారు’

పురాతన భవనాలను ఏ చట్టం ప్రకారం కూలుస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పురాతన భవనాలను కూల్చివేసే అంశంపై గతంలో పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎర్రమంజిల్‌లో ప్రస్తుతం ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం వారసులు నిర్మించిన పురాతన కట్టడాలను కూల్చివేయడానికి వీల్లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై మళ్లీ వాదనలు వింటామని పేర్కొన్న హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అసోంలో వరదలు.. హీరో రూ.2 కోట్ల విరాళం!

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రకృతి వైపరిత్యానికి అక్షయ్‌ చలించిపోయారు. తనవంతు సాయంగా అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి, జాతీయ ఉద్యానవనం సంరక్షణకు రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. కియా సెల్టోస్‌: తొలిరోజే బుకింగ్స్‌ అదుర్స్‌

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్‌ భారత్‌లో విడుదల చేస్తున్న తొలి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘కియా సెల్టోస్‌’. బుకింగ్స్‌ ప్రారంభించిన కొద్ది సమయంలోనే వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తొలిరోజే రికార్డు స్థాయిలో 6,046 ఆర్డర్లు లభించడం విశేషం. ఆగస్టు 22న మార్కెట్లో ఆవిష్కరించనున్న సెల్టోస్‌ను రూ.25,000 ముందస్తుగా చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు తొలి వారంలో ఈ కార్లు షోరూమ్‌లను చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఊహించని రీతిలో వచ్చిన స్పందనకు ఆ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. నిజమైన పౌరులను గుర్తించడమే లక్ష్యం..

అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా ప్రభుత్వం వారిని గుర్తించి దేశం నుంచి పంపించివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో  సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు జావేద్‌ అలీ ఖాన్‌ ఎన్‌ఆర్‌సీ(జాతీయ పౌర జాబితా)ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారా ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు అమిత్‌షా సమాధానమిస్తూ.. అసోంలో ఎన్‌ఆర్‌సీ అమలు అంశం ఎన్నికల మ్యానిఫెస్టోలో(భాజపా) భాగంగా ఉందని, దాని కారణంగానే అధికారంలోకి వచ్చామని అన్నారు. అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా ప్రభుత్వం వారిని గుర్తించి అంతర్జాతీయ చట్టం ప్రకారం బహిష్కరిస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.