close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. జషిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది. విజయలక్ష్మినగర్‌లో కిడ్నాపైన నాలుగేళ్ల జషిత్‌ను జిల్లా ఎస్పీ నయీం అస్మి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలుడిని ఆగంతుకులు రాయవరం మండలం కుతుకులూరులో విడిచిపెట్టి వెళ్లినట్లు సమాచారం తెలియడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి బాలుడిని తీసుకొచ్చారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు క్షేమంగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. బాలుడిని గుర్తించడంలో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్రానికి తొలి సేవకుడిని..

లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించవద్దన్న స్వామి వివేకానంద సూక్తి సదా ఆచరణీయమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. అవరోధాలను అధిగమించి సమగ్రాభివృద్ధి సాధించే దిశగా రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాక్షించారు. ‘‘హిజ్‌ ఎక్సలెన్సీ అని నన్ను పిలుస్తున్నారు. ఇది నాకు, ప్రజలకు మధ్య అడ్డంకి(బారియర్‌) అవుతుంది. నా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి వివిధ స్థాయుల్లో ప్రజలకు సేవలందించా.. నేను ఈ రాష్ట్ర మొదటి వ్యక్తినే(ఫస్ట్‌ సిటిజన్‌) కాదు, ప్రజలకు మొదటి సేవకుడిని.. అందువల్ల నన్ను హిజ్‌ ఎక్సలెన్సీ అని సంబోధించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోకాపేటలో టౌన్‌షిప్‌

గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పక్కనే ఉన్న కోకాపేటలో పర్యావరణహిత టౌన్‌షిప్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకారదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. 9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు వస్తాయని.. సుమారు 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని.. హైటెక్‌సిటీ అనుభవాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆరు నెలలు రాజకీయాలకు దూరం: రఘువీరారెడ్డి

ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సంబంధిత ఆలయ నిర్మాణం పూర్తి చేసే వరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాళ్లనూ మిగల్చరా? 

వివిధ స్వప్రయోజనాల కోసం ప్రజలు ప్రకృతిని ధ్వంసం చేస్తుండటంపై బుధవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే సరస్సులన్నీ మాయమయ్యాయని.. ఇకపై రాళ్లనూ మిగల్చరా అంటూ ప్రశ్నించింది. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఏక శిలా రూపాలు, రాళ్ల పరిరక్షణకు ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో బాబా ఫకృద్దీన్‌ ఔలియా దర్గా (ఫకృద్దీన్‌ గుట్ట)వద్ద పేలుళ్లతో రాళ్లను పగులగొడుతున్నారని, వారసత్వ చట్టం కింద వాటిని పరిరక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ‘సొసైటీ టు సేవ్‌ రాక్‌’ అనే సంస్థ తరఫున కార్యదర్శి ఫరూక్‌ ఖాదర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌ పాలనకు భయపడుతున్న ప్రజలు: రామ్‌మాధవ్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ పేర్కొన్నారు. తెదేపా పాలనపై విసుగుచెంది ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైకాపాను గెలిపించారన్నారు. తెదేపా, వైకాపా దొందూ దొందేనని విమర్శించారు. రాష్ట్రంలో భవిష్యత్తు భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పోతవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీని దేశ ప్రజలు 20 నుంచి 25 సంవత్సరాలపాటు ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మధ్యప్రదేశ్‌లో భాజపాకు ఝలక్‌!

కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఆనందంలో ఉన్న భాజపా నేతలకు మధ్యప్రదేశ్‌లో చిన్న ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారుకు మద్దతుపలికారు. అసెంబ్లీలో ఓ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా నారాయణ్‌ త్రిపాఠి, శరద్‌ కోల్‌ అనే ఇద్దరు భాజపా శాసనసభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ పరిణామం జరగటానికి ముందు శాసనసభలో భాజపా పక్షనేత గోపాల్‌ భార్గవ మాట్లాడుతూ వారు ఆదేశిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చివేయగలమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆర్‌ఎఫ్‌సీలో సౌతిండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ 6న 

దక్షిణ భారతదేశ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఆగస్టు 6వ తేదీన రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌’ పేరిట భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రధాన కార్యదర్శి నీరజ్‌ ఠాకూర్‌  తెలిపారు. నగరంలో మొదటి సారి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెడ్డింగ్‌ ప్లానర్లు హాజరుకానున్నారన్నారు. వెడ్డింగ్‌ ప్లానింగ్‌ రంగంలో వస్తున్న ఆధునికతతో పాటు సవాళ్లపై ఈ సదస్సులో నిపుణులు చర్చిస్తారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొత్త ప్రయాణం ఆరంభిస్తున్నాం

‘‘చిత్ర పరిశ్రమలో పంపిణీదారులుగా ప్రయాణం మొదలుపెట్టాం. ఆ తర్వాత నిర్మాతలుగా మారాం. 16 ఏళ్లలో 32 సినిమాల్ని పూర్తి చేశాం. ఇదో గొప్ప ప్రయాణం. ఈ ఇరవయ్యేళ్ల సినీ ప్రయాణంలో మేం సంపాదించిన అనుభవం మరింత మంది నిర్మాతలకి ఉపయోగపడాలన్నదే మా లక్ష్యం’’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు. ఆయన శిరీష్‌, లక్ష్మణ్‌లతో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌  పతాకంపై సినిమాల్ని నిర్మిస్తున్నారు. పంపిణీదారులుగా, ప్రదర్శనకారులుగా కూడా కొనసాగుతున్నారు. వీళ్ల సినీ ప్రయాణం 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యాపిల్‌ పండులో బ్యాక్టీరియా దండు

రోజూ ఒక యాపిల్‌ తింటే వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే రాదంటుంటారు. అంతలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆ ఫలం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇష్టంగా ఆరగించే ఈ యాపిల్‌ పండు గురించి తాజా అధ్యయనమొకటి సంచలన విషయాలు బయటపెట్టింది. ఒక్కో యాపిల్‌లో సగటున 10 కోట్ల బ్యాక్టీరియా ఉంటున్నట్లు తేల్చింది. ఆ బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరమైనదా? లేక మేలు చేసేదా? అనే సంగతి సాగు చేసిన తీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. యాపిల్‌లో పీచుపదార్థం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి మేలు చేసే కొన్ని జాతుల బ్యాక్టీరియా కూడా ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.