close

తాజా వార్తలు

అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఎవరంటే..

దిల్లీ: తాజా సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని నవసారి నుంచి పోటీచేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఆర్‌ పాటిల్‌ అఖండ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిపై ఏకంగా 6.89లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఈయనే కావడం విశేషం. అంతేగాక.. దేశ చరిత్రలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు నమోదైన మెజార్టీ రికార్డుకు పాటిల్‌ చేరువయ్యారు. 2014 అక్టోబరులో  జరిగిన బీద్‌(మహారాష్ట్ర) ఉప ఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి గోపినాథ్‌ ముండే కుమార్తె ప్రీతమ్‌ ముండే రికార్డు స్థాయిలో 6.96లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

సీఆర్‌ పాటిల్‌ గుజరాత్‌లోని నవసరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయనకు 9,69,430 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 2,81,663 ఓట్లు పోలయ్యాయి. దీంతో 6.89లక్షల ఓట్ల తేడాతో పాటిల్‌ ఘన విజయం సాధించారు. ఇక దేశవ్యాప్తంగా 6లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందిన వారు మరో ముగ్గురు ఉన్నారు. వీరంతా భాజపాకు చెందిన వారే కావడం విశేషం. భాజపా నేతలు సంజయ్‌ భాటియా(కర్నల్‌, హరియాణా) 6.56లక్షలు, కృష్ణపాల్‌(ఫరీదాబాద్‌, హరియాణా) 6.48లక్షలు, సుభాష్‌ చంద్ర బహేరియా(భిల్వాడా, రాజస్థాన్‌) 6.12లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 

5లక్షల కంటే ఎక్కువ ఆధిక్యంతో విజయం సాధించిన వారు 10 మంది ఉన్నారు. 
* భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 5.5లక్షల మెజార్టీతో గెలుపొందారు. 

* మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి శంకర్‌ లల్వాణీ 5.47లక్షల ఓట్ల తేడా విజయం సాధించారు. 

* మధ్యప్రదేశ్‌లోని విదిశ నుంచి బరిలోకి దిగిన భాజపా నేత రమాకాంత్‌ భార్గవ 5.03లక్షల ఆధిక్యంతో గెలిచారు. 

* గుజరాత్‌లోని వడోదరలో భాజపా అభ్యర్థి రంజన్‌బెన్‌ భట్‌ 5.87లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే రాష్ట్రం సూరత్‌లో దర్శన విక్రమ్‌ జర్దోశ్‌ 5.48 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

* మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ 5.53లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 

* దేశ రాజధానిలో ఇద్దరు భాజపా అభ్యర్థులు 5లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. వాయువ్య దిల్లీలో హన్స్‌ రాజ్‌ 5.53లక్షలు, పశ్చిమ దిల్లీలో పర్వేశ్‌ వర్మ 5.68లక్షల ఆధిక్యంతో గెలిచారు.  

* రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్‌లో సీపీ జోషీ 5.76లక్షల తేడాతో గెలువగా.. రాజ్‌సమంద్‌ నియోజకవర్గంలో జైపూర్‌ రాజవంశీకురాలైన దియా కుమారి 5.51లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 

* ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసిలో తన సమీప ఎస్పీ అభ్యర్థి షాలినీ యాదవ్‌పై 4.79లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

అత్యంత తక్కువ మెజార్టీతో గెలిచింది వీరే..

ఇక తాజా ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో గెలిచిన ఎంపీ భాజపాకు చెందిన భోలానాథ్‌. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్‌ నుంచి పోటీ చేసిన భోలానాథ్‌ తన సమీప అభ్యర్థిపై కేవలం 181 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన తర్వాత లక్ష్యద్వీప్‌లో ఎన్‌సీపీ అభ్యర్థి మహ్మద్‌ ఫైజల్‌ 823 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా(భాజపా) కుంతిలో 1,445 ఓట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అపరూప పొద్దార్‌(ఆరంబాగ్‌, పశ్చిమబెంగాల్‌) 1,142ఓట్లు, కాంగ్రెస్‌ నేత కుల్దీప్‌ రాయ్‌ శర్మ(అండబాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌) 1,407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.