
తాజా వార్తలు
దిల్లీ: అలహాబాద్, ఫజియాబాద్, మొఘల్ సరయ్ నగరాల జాబితాలోనే త్వరలోనే ఆగ్రా నగరం కూడా చేరబోతోంది. ఎందుకంటే త్వరలోనే ఆ నగరం పేరు మారే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రాకు కొత్త పేరు సూచించాలంటూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది.
ఆగ్రాను పూర్వం మహారాజ్ అగ్రసేన్ పేరు మీదుగా ‘అగ్రవన్’ అని పిలిచేవారు. అక్కడ అత్యధికంగా ఉన్న అగర్వాల్ సమాజం కూడా ‘ఆగ్రా’ పేరును ‘అగ్రవన్’గా మార్చాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ‘నగరానికి చారిత్రక కారణాలతో మరేదైనా పేరు ఉంటే దానిని సూచించాలని ప్రభుత్వం నుంచి మాకు లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో మరో పేరు కోసం పరిశోధిస్తున్నాం’ అని అంబేద్కర్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ సుగం ఆనంద్ తెలిపారు. పర్యాటక ప్రాంతంగా ఆగ్రాకు ఎంతో పేరుంది. ప్రఖ్యాత తాజ్మహల్ ఆగ్రాలోనే ఉంది.