close

తాజా వార్తలు

నిశీధిలో నిశ్చింతగా..

శుభరాత్రి ప్రయాణం చేద్దాం

రాత్రిపూట ప్రయాణమంటే? రోడ్డుమీద ఆపేవారుండరు.. వాయువేగంతో దూసుకెళ్లిపోవచ్చు...వందల కిలోమీటర్లైనా అవలీలగా గమ్యం చేరొచ్చు...ట్రాఫిక్‌ చిక్కులుండవు.. మాటిమాటికీ గేర్‌ మార్చే చికాకులుండవు...ఈ లాభాలు సరే! ఏ మాత్రం పరాకుగా ఉన్నా బండి పల్టీలు కొడుతుంది...వేగం అదుపు తప్పితే ఊహించని ప్రమాదం ముంచుకొస్తుంది....తెల్లారేసరికి గమ్యం చేరే మాటలా ఉంచితే జీవితాలే తెల్లారిపోతాయి...మరి ఇది ఆపడానికి ఏం చేయాలి? రాత్రి ప్రయాణం ఎలా శుభంగా    ముగించాలి? వేసవి సెలవుల్లో అత్యధికంగా చేసే దూరప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ముందు జాగ్రత్తగా..
వాహనానికి సరైన లైట్లు ఉన్నాయో, లేదో ముందే సరిచూసుకోవాలి. చాలా కార్లలో ఇపుడు హాలోజన్‌ బల్బులు ఉంటున్నాయి కానీ వాటి హెడ్‌లైట్ల ఫోకస్‌ సరిగా ఉండదు. జాతీయ రహదారుల్లో వెళ్తుంటే 60వాట్ల హెడ్‌లాంప్‌ల వెలుతురు ఏమాత్రం సరిపోదు. ఫోకస్‌ తక్కువగా ఉంటే సరిచేయించుకోవాలి. అదేసమయంలో బ్రేక్‌ ల్యాంపులు, టెయిల్‌ ల్యాంప్‌లు, టర్న్‌ ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ట్రాఫిక్‌ ఉన్న పట్టణ ప్రాంతాల్లో నడిపే పక్షంలో హెడ్‌ ల్యాంప్‌లను తక్కువ బీమ్‌లో ఉంచుకోవాలి. ఇతర వాహన చోదకులపై వెలుతురు పడకుండా వారికి ఇబ్బంది లేకుండా చేస్తుంది. పరిసరాలు చీకటిగా ఉండి ఏ వాహనాలూ చుట్టుపక్కల లేకుంటేనే హైబీమ్‌ లైట్లు వాడాలి. విండ్‌షీల్డ్‌, కిటికీ అద్దాలు శుభ్రంగా ఉంటేనే ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనపడతాయి. ప్రయాణానికి ముందే వీటిని శుభ్రం చేసుకోవాలి. విండ్‌షీల్డ్‌ వాషర్‌లో నీరు ఉందో, లేదో కూడా పరీక్షించాలి. విండ్‌షీల్డ్‌ శుభ్రత కోసం మైక్రోఫైబర్‌ టవల్‌, న్యూస్‌పేపర్లు దగ్గర్లో ఉంచుకోవాలి. అదనపు టైరు, వాటిలో తగినంత గాలి, నావిగేషన్‌ చెకింగ్‌, టార్చ్‌లైట్‌.. ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. దూరప్రయాణం చేస్తుంటే ఆ దారిలో ఎక్కడ మలుపులు ఉన్నాయి? ఎక్కడ రోడ్లు బాగా లేవు? వంతెనలు, స్పీడ్‌ బ్రేకర్లు.. ఈ వివరాలన్నీ తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు.

కారణాలు ఏమైనా మనలో చాలామంది రాత్రిపూట ప్రయాణాలే చేస్తుంటారు. ముఖ్యంగా దూర ప్రయాణాలైతే. బస్సు, కారు, మోటార్‌సైకిల్‌.. ఎవరి వీలును బట్టి వారు ఏదో ఒక వాహనంలో గమ్యం చేరాలనుకుంటారు. కానీ పోలీసు, రవాణాశాఖ అధికారుల నుంచి నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్‌ బ్యూరో దాకా చెబుతున్నది ఏంటంటే అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా వాహన ప్రయాణాలకు ఆపత్కాలం. అత్యధిక ప్రమాదాలు జరుగుతోందీ, అధిక మరణాలు సంభవిస్తున్నదీ అప్పుడే అంటున్నాయి గణాంకాలు. దానికి సాక్ష్యంగా అర్ధరాత్రి ప్రమాద వార్తలు నిత్యం పత్రికల్లో, టీవీల్లో చదువుతున్నాం. వింటున్నాం. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వీటిలో సగానికి పైగా ఆపొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. దానికేం చేయాలంటే.



మత్తు వదలాలి

నిద్రమత్తు, మద్యపానం రాత్రి ప్రయాణానికి ప్రధాన శత్రువులు. ఈ రెంటినీ నియంత్రిస్తే ప్రమాదం నుంచి గట్టెక్కినట్టే.
* దూరప్రయాణం ముందురోజే కంటి నిండా నిద్రపోవాలి. వీలైతే పగటిపూట ఓ కునుకు వేయాలి.
* దగ్గు మందు, యాంటీ-అలర్జీ ఔషధాలు మత్తు కలిగిస్తాయి. ప్రయాణంలో వీటిని వాడొద్దు.
* తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కుదిరితే తేలికపాటి కసరత్తులు చేయాలి.
* డ్రైవింగ్‌ చేస్తున్నపుడు తదేక దీక్షతో రోడ్డునే చూస్తుంటే కళ్లపై భారం పడుతుంది. అప్పుడప్పుడు అటూఇటూ చూపు సారించాలి.
* చూయింగ్‌ గమ్‌ నములుతుంటే జీర్ణ వ్యవస్థ పనిచేస్తూ మెదడు చురుగ్గా ఉంటుందంటారు వైద్యులు.
* దూరప్రయాణమైతే దూరాన్ని భాగాలుగా విభజించుకుని వాహనం అక్కడక్కడ నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.
* కళ్లు మూతలు పడుతున్నా, శరీరం నిస్సత్తువగా అనిపించి తూలిపోతున్నా, కాళ్లనొప్పులు భరించలేకున్నా డ్రైవింగ్‌ ఆపి కాసేపు నిద్ర పోవాలి.
* ‘తాగి బండి నడపొద్దు’ అని కనీస జ్ఞానం ఉన్నవారెవరైనా చెబుతారు. మద్యంతో శరీరంపై, నడిపే వాహనంపై నియంత్రణ కోల్పోతాం. డ్రైవరే కాదు.. అర్ధరాత్రుళ్లు తాగి అడ్డదిడ్డంగా రోడ్లపైకి వచ్చే వాళ్లను సైతం గమనించాల్సిన బాధ్యత మనదే.



ఇవీ పాటించాలి

* కుదిరితే మన వెనకాల ఇంకో వాహనం ఉండేలా చూసుకోవాలి. లేదా మనమే ఇతర వాహనాన్ని అనుసరించాలి. గడ్డు పరిస్థితుల్లో వాళ్ల నుంచి సాయం పొందొచ్చు.
* ఖరీదైన కార్లలో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌లుంటాయి.  అవి చేతులు, కాళ్ల పనిభారాన్ని తగ్గిస్తాయి. దీంతో నిద్రలో జోగిపోతాం. స్టీరింగ్‌ వదిలేస్తాం. అది జరగకుండా మాన్యువల్‌ డ్రైవింగ్‌ మోడ్‌లో వెళ్తేనే మంచిది.
* అతి వేగం ఎప్పుడూ మంచిది కాదు. కారు లైటు వెలుతురు కనిపించేంత వరకే వేగం స్థాయి ఉండాలి. అప్పుడే అత్యవసరంగా బ్రేక్‌ వేసినా ఇబ్బంది ఉండదు. స్పీడ్‌బ్రేకర్లు, గుంతలు, మలుపులు గమనించగలుగుతాం.
* రాత్రివేళ వేగంగా వెళ్తుంటాం. సడెన్‌గా ఆపాల్సిన పరిస్థితి వస్తే నియంత్రించుకోవడం కష్టం. అందుకే ముందు వాహనాలకు కొంచెం దూరం పాటించడం ఉత్తమం. బండిని ఓవర్‌టేక్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చినా దూరం నుంచే హారన్‌ కొడుతూ అలర్ట్‌ చేయాలి.
* రోడ్డు పక్కన ఆపిన టెయిల్‌ లైట్లు లేని భారీ ట్రక్కులు, ట్రాక్టరు ట్రైలర్లు, అత్యధిక ప్రమాదాలకు కారణమవుతాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. హై బీమ్‌ లైట్లు వాడితే వీటిని తేలికగా గమనించవచ్చు.
* ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే పార్కింగ్‌ లాంప్‌లను ఆన్‌ చేయాలి. ఆగే స్థలం కూడా సురక్షితమైందిగా ఉండాలి. మలుపుల్లో ఆపొద్దు.



రక్షణ కవచాలు

రాత్రివేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల నుంచి కాంతి మన కళ్లలో పడినపుడు కొద్దిక్షణాలపాటు ముందు ఏముందో కనిపించదు. దీని కారణంగా ఒక్కోసారి బండిపై నియంత్రణ కోల్పోతుంటాం. ఆ ప్రమాదాన్ని తప్పించడానికి మార్కెట్లో డే-నైట్‌ యాంటీ గ్లేర్‌ డ్రైవింగ్‌ విజర్లు దొరుకుతున్నాయి. వీటిని కారు విండ్‌షీల్డ్‌కి అమర్చితే కళ్లలో కాంతి పడి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి తప్పుతుంది. ఫిల్మ్‌స్ట్రిప్‌లా వీటిని విండ్‌షీల్డ్‌కి అతికించుకోవచ్చు. ఇవి కాకుండా కారు క్యాబిన్‌లోనే అమర్చుకునేలా యాంటీ గ్లేర్‌ నైట్‌ డ్రైవింగ్‌ అద్దాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల నుంచి వచ్చే కాంతిని ఆ అద్దం కేంద్రీకృతం చేసుకుంటుంది. మోటార్‌ సైకిళ్లపై రాత్రిపూట ప్రయాణం చేసేవారి కోసం కూడా నైట్‌ డ్రైవింగ్‌ గాగుల్స్‌ దొరుకుతున్నాయి. వీటి ధర రూ.వెయ్యి నుంచి మూడున్నర వేలు.

- బెజవాడ వెంకటేశ్వర్లు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.