close

తాజా వార్తలు

పెన్ను పట్టుకొని రాయలేకపోతున్నా!

సమస్య - సలహా

సమస్య: నా వయసు 20 సంవత్సరాలు. బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. గత ఆర్నెల్ల నుంచి పెన్ను పట్టుకొని సరిగా రాయలేకపోతున్నాను. బోర్డు మీద చాక్‌పీస్‌తో రాస్తే బాగానే ఉంటోంది. కానీ పెన్ను పట్టుకొని రాస్తున్నప్పుడే ఇబ్బంది మొదలవుతోంది. దీంతో చేతిరాత చెత్తగా ఉంటోంది. అదేపనిగా పెన్ను గట్టిగా పట్టుకుంటే వేళ్లు నొప్పి పెడుతున్నాయి. ఇదేమైనా తీవ్రమైన సమస్యనా? దీనికి పరిష్కారమేంటి?

- నిశత్‌ తబస్సుమ్‌ (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మిగతా పనులన్నీ బాగానే చేసుకుంటూ పెన్ను పట్టుకోగానే ఇబ్బంది మొదలవుతోందని అంటున్నారంటే మీరు ‘రైటర్స్‌ క్రాంప్స్‌’ సమస్యతో బాధపడుతున్నారని తోస్తోంది. ఇదో ప్రత్యేకమైన సమస్య. దీన్ని సెలెక్టివ్‌ (టాస్క్‌ స్పెసిఫిక్‌) డిస్టోనియా అంటారు. ఇది వేళ్లు, చేయి, మోచేయి కండరాల బిగువును దెబ్బతీస్తుంది. దీంతో పెన్ను పట్టుకొని రాయటం, వాద్యాలు వాయించటం, కుట్టటం, అల్లటం, టైప్‌ చేయటం వంటి కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది. దీని మూలంగా చేతి రాత మారిపోతుంటుంది. సంతకం చేసే తీరు మారుతుంది. గిటారు, ఫిడేలు వంటివి వాయించేటప్పుడు ఆయా వాద్యాలను పట్టుకోగానే వేళ్లు, చేతులు వంకర పోతుంటాయి. కొందరికి ఇతరత్రా పనుల్లోనూ ఇబ్బందికరంగా పరిణమించొచ్చు. డిస్టోనియా ఎందుకు వస్తుందనేది కచ్చితంగా తెలియదు. వేళ్ల కదలికలు దెబ్బతినటం, వేళ్లు వంకర పోతుండటం వల్ల చాలామంది దీన్ని చేతుల సమస్యగానే భావిస్తుంటారు. ఎముకలు, కండరాల సమస్యగా పొరపడుతుంటారు. కొందరు ఒత్తిడి మూలంగా ఇలా జరుగుతుందనీ అనుకుంటుంటారు. నిజానికిది నాడీ సమస్య. మెదడులోని సెరిబ్రల్‌ కార్టెక్స్‌తో ముడిపడిన సమస్య. ఇందులో చేతులు, వేళ్లలోని కండరాలకు మెదడు నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయి. ఫలితంగా కండరాలు మరీ అతిగా సంకోచించి ఆయా పనులకు విఘాతం కలుగుతుంది. అందువల్ల మీరు వెంటనే నాడీ సమస్యలకు చికిత్స చేసే న్యూరాలజిస్టును సంప్రదించటం మంచిది. అలాగే ఒకసారి చేయి నిపుణుల సలహా కూడా తీసుకుంటే మేలు. ఇతరత్రా కీళ్ల సమస్యలేవైనా ఉంటే తెలుసుకోవచ్చు. యాంటీకొలనెర్జిక్‌ రకం మందులతో డిస్టోనియాను నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొందరికి బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావొచ్చు. చికిత్స తీసుకోకపోతే సమస్య మున్ముందు ఎక్కువయ్యే అవకాశముంది. పెన్ను, పెన్సిల్‌ వంటివి గట్టిగా పట్టుకొని ఎక్కువసేపు రాస్తుంటే కండరాలు పట్టేసి నొప్పి తలెత్తొచ్చు. కొందరు దీని మూలంగా ఒత్తిడికి, కుంగుబాటుకూ లోనవుతుంటారు. ఇవి సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయటం తగదు. ఇప్పట్నుంచే ఎడమ చేయితో రాయటం సాధన చేయటం మంచిది. పెన్ను పట్టుకొనే తీరును మార్చుకోవటం, లావుగా ఉండే పెన్ను వాడుకోవటం, ప్రత్యేకమైన పట్టీలు ధరించటం, కాగితం లేదా చేతి స్థితిని మార్చుకోవటం వంటివీ ఉపయోగపడతాయి.

* మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
* సమస్య - సలహా సుఖీభవ
* ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
*
email: sukhi@eenadu.in
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.