close

తాజా వార్తలు

అతికి వేద్దాం అడ్డుకట్ట

ఓ పిల్ల లేదా పిల్లాడు అతిగా మాట్లాడుతున్నా... విపరీతంగా అల్లరి చేస్తున్నా... చాలా హైపర్‌ తెలుసా... అని టక్కున అనేస్తాం. ఆ హైపర్‌ అనే పదం కొన్నిసార్లు నచ్చినా... పిల్లలకు మాత్రం అది సమస్యే. అందుకే వాళ్ల ప్రవర్తనను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ... సమస్య అనిపించిన చోట అడ్డుకట్ట వేయడం చాలా అవసరం.

ట్టిగా మాట్లాడటం, విరామం లేకుండా తినడం, చిన్నచిన్న వాటికే అలగడం... ఓ పట్టాన మాట వినకపోవడం... ఇలా పిల్లల్లో చాలా కోణాలే ఉంటాయి. పిల్లలు కదా అనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకుంటే... మరికొందరు సమస్యను గుర్తించినా ఎలా పరిష్కరించాలో తెలియక పెద్దయ్యాక మారిపోతారని  వదిలేస్తుంటారు. కొందరు సమస్య కనిపించిన వెంటనే తిట్టడం, అరవడం, కొట్టడం చేస్తుంటారు. ఇవేవీ సరికాదు. ఓ పద్ధతి ప్రకారం వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. లేదంటే భవిష్యత్తులో   మొక్కై వంగనిది మానై వంగదు అన్న చందాన అవుతుంది.

* వసపిట్టలా వాగుతున్నారా...
సాధారణంగా చిన్నారులు తల్లిదండ్రుల్ని అనుకరిస్తుంటారు. పెద్దవాళ్లు ఎక్కువగా మాట్లాడితే పిల్లలూ అదే చేస్తారు. కానీ కొందరు పిల్లలు పెద్దవాళ్లు వింటున్నా, వినకపోయినా వాళ్ల పాటికి వాళ్లు ఏదో చెప్పేస్తుంటారు. పనుల్లో ఉన్నామని చెప్పినా అర్థం చేసుకోకుండా... మధ్య మధ్యలో వెళ్లి సందేహాలు అడగడం, ఏవేవో చెప్పడం చేస్తుంటారు. అలాంటప్పుడు పిల్లలు అడిగిందే అడుగుతున్నారా... చెప్పిందే చెబుతున్నారా అనేది గమనించాలి. ఈ పరిస్థితిని సోషల్‌ ఇంటలిజెన్స్‌ అంటారు. మరొకటి ప్రాగ్మాటిక్‌ ప్రీడిజార్డర్‌. అంటే పిల్లలకు ఎప్పుడు ఎక్కడ, ఏం మాట్లాడాలో   తెలియదు. వాళ్ల పాటికి వాళ్లు ఏదో ఒకటి చెప్పేస్తుంటారు.    మూడోది ఏడీహెచ్‌డీ. అతిగా స్పందించడమే సమస్య. తెలివితోనే అతిగా మాట్లాడుతుంటారు. కొందరు నలుగురిలో ఎక్కువ మాట్లాడితే గొప్ప అనుకుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఈ సమస్యను మేనిక్‌ డిజార్డర్‌ అంటారు. కొందరు చిన్నారులయితే కంగారులో ఏదేదో చెప్పేస్తుంటారు. ఆ పరిస్థితే యాంగ్జైటీ డిజార్డర్‌. ఇలాంటి సమస్యలున్న చిన్నారుల్ని ఇతరులతో పోల్చకూడదు. తల్లిదండ్రులే నియంత్రణలో పెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ల ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ‘నేను ఎలా మాట్లాడుతున్నానో గమనించు. నువ్వు కూడా అలాగే మాట్లాడాలి...’ అని పిల్లలకు అర్థమయ్యేలా పదే పదే చెప్పాలి. మాట్లాడే సమయంలోనూ తప్పొప్పులను సరిదిద్దాలి.   ఇతరులు ఎలా ఉంటే అభిమానిస్తారో విడమరిచి చెప్పాలి. అతిగా మాట్లాడితే ఎదురయ్యే నష్టాలు తెలియజేయాలి. మాట్లాడే సమయాన్ని తగ్గించడాన్ని ఓ పోటీలా పెట్టాలి. ఎంత చెప్పినా మార్పు రాకపోతే నిపుణుల్ని సంప్రదించాలి.

* తినడమే పనా...
‘పిల్లలు - తిండి’ అనే అంశం తీసుకుంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి అతిగా తినడం.. రెండోది నచ్చింది నియంత్రణ లేకుండా తినడం. ఇది తల్లిదండ్రులు చేసే అలవాట్ల వల్లే వస్తుంది. కొందరు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అతిగి తినిపిస్తుంటారు. అలా వాళ్లకి ఎక్కువ తినడం అలవాటు అవుతుంది. పెద్దయ్యాకా అదే కొనసాగిస్తారు. మరికొందరు పిల్లలు సరిగా తినట్లేదని బయటి ఆహారం కొనివ్వడం, గుడ్లు, మాంసాహారం ఇలా పిల్లలు ఇష్టపడేవి ఎక్కువగా పెట్టడం మొదలుపెడతారు. దానివల్ల పొట్ట సామర్థ్యం పెరుగుతుంది. మరికొందరు ప్రకటనలు చూసి, ఇంకొందరు ఇతరులు తింటుంటే ప్రభావితం అయి... లాగించేయడం కూడా మామూలే. ఒత్తిడి, భయం, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేక కూడా అతిగా తినడానికి అలవాటు పడుతుంటారు. పిల్లలు ఎప్పుడయినా అతిగా తింటున్నారని అనిపిస్తే... ఆహారం పెట్టడానికి కచ్చితంగా సమయం పాటించాలి. తిన్నాక మళ్లీ మళ్లీ అడుగుతుంటే ఓ పని చెప్పి... అది చేశాక కోరిన ఆహారం అనే షరతు పెట్టాలి. క్రమంగా మెదడు కూడా ఆహారం కాకుండా ఇతర అంశాల గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. క్రమశిక్షణ వస్తుంది. ఈ పద్ధతిని బిహేవియర్‌ మాడిఫికేషన్‌ అంటారు. అలానే ఆహారం ప్రస్తావన తెస్తున్నప్పుడు వారి మనసును ఆసక్తుల వైపు మళ్లించాలి. తిండి గుర్తుకు రాకుండా ఏదో ఒక వ్యాపకంతో వారిని తీరిక లేకుండా చేయాలి.
 

ఊరికే అలగడం...

కొందరు పిల్లలు చిన్న విషయాలకే అలుగుతుంటారు. మరికొందరు తమ మనసులో బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక, కోరిన వస్తువు పొందేందుకు అలక, కోపం, గట్టిగా ఏడవడం వంటివి ఎంచుకుంటారు. ఇలా చేస్తే అమ్మానాన్నలు కరిగిపోయి అడిగినవి చేస్తారనేది వారి భావన. కొన్నిసార్లు అది ముచ్చటగానే ఉంటుంది కానీ... అదే కొనసాగితే సమస్యే. ఇలాంటి చిన్నారులకు అవసరానికి, విలాసానికి గల తేడాలు వివరించాలి. లేదంటే ‘నువ్వు ఫలానా పనిచేయి... అప్పుడు నువ్వు అడిగింది ఇస్తా’ అంటూ హామీ ఇస్తూనే వాయిదా వేస్తుండాలి. డిమాండ్లు, కోరికలు పెరిగినప్పుడు ‘నా మాట వింటేనే, నేను చెప్పింది చేస్తేనే’ అంటూ ఆంక్షలు పెట్టడం అవసరం. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే వారి కోరికలు తీర్చగలుగుతున్నారనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు అడిగారు కదా, ఏడ్చారు కదా అని వెంటనే చేసేయడం సరికాదు. ఓపిగ్గా   విడమరిచి చెప్పాలి. అమ్మ కాదంటే నాన్న.. నాన్న కాదంటే అమ్మని అడగడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో వాళ్లంతా ఒకే మాట మీద ఉండాలి. అది పిల్లలకు తెలిసేలా చేయాలి.

భరించలేని అల్లరా...

ల్లరి ముద్దే. కానీ అతి మితిమీరితేనే సమస్య. అలా మితిమీరకుండా చూసుకోవడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. అదేపనిగా ఎగరడం, శబ్దాలు చేయడం, చేతిలో వస్తువులు విసిరికొట్టడం, ఇతరుల్ని కొట్టడం... ఇవన్నీ అల్లరి కోవలోకే వస్తాయి. కొందరిలో ఈ సమస్య జన్యుపరంగానూ వస్తుంది. ఏడీహెచ్‌డీ ఉన్నప్పుడు కూడా ఇలానే ప్రవర్తిస్తుంటారు. కొందరి పిల్లల మెదడు పనితీరు వాళ్ల నియంత్రణలో ఉండదు. అలాంటప్పుడే చేతిలో ఉన్నవి విసిరి కొట్టి లేదా ఎదురుగా ఉన్నవాళ్లని కొట్టి ఆ తరువాత శాంతిస్తారు. తాము చేసింది తప్పని ఎప్పటికో బాధపడతారు. అతిగా గారాబం చేయడం, క్రమశిక్షణ నేర్పక పోవడం వల్ల ఇలా ప్రవర్తిస్తారు. మాట వినరు. ఎదురుసమాధానం ఇస్తారు. నా మాటే వినాలి అనే తత్వాన్ని పెంచుకుంటారు.  ఇలాంటి పిల్లల్ని కొడితే, తిడితే వారిలో మార్పు రాదు.  ముందు తల్లిదండ్రులిద్దరూ ఒకేమాటపై ఉండాలి. వాళ్లు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది ఓ డైరీలా రాసిపెట్టాలి. వీలైతే కుటుంబ రాజ్యంగం అంటూ కొన్ని నియమాలు పెట్టి పాటించేలా చేయాలి. మార్పు వస్తే మెచ్చుకోవాలి. అల్లరి చేసే సందర్భాలను గమనిస్తూ ముందే నియంత్రణలో పెట్టే ప్రయత్నాలు చేయాలి. ‘నేను ఇలా చేస్తే అమ్మానాన్నలు ఊరుకోరు’ అనే భావన వారిలో పెరిగేలా చూడాలి. వాళ్ల గురించి ఇతరులతో పోల్చడం, చుట్టుపక్కల వారితో చర్చించడం చేస్తుంటే ఆపేయాలి. రోజూ వారి ప్రవర్తన గమనిస్తూ ఏ మాత్రం మార్పు కనిపించినా ఓ స్టార్‌ ఇవ్వాలి. లేదంటే నిపుణుల్ని సంప్రదించడం మంచిది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.