ఆమె కోసం..  బండెనక బండికట్టి!
close
ఆమె కోసం..  బండెనక బండికట్టి!

వసుంధర ప్రత్యేకం

గెలిచే వరకూ..

ఎంత కష్టపడినా కొందరి ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. ఇతర జబ్బులు ఉన్నవారికి ప్రాణాపాయం ఎక్కువగా ఉంటోంది. మృతుల సంగతి వారి కుటుంబసభ్యులకు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోతున్నామేమో! అనిపిస్తుంటుంది. చనిపోయిన వ్యక్తిని కడసారి చూసే అవకాశం కూడా ఉండదు. ఇది మరీ వేదనకు గురిచేస్తుంటుంది. కానీ, ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. కరోనాపై విజయం సాధించే వరకు విశ్రమించేది లేదు.

కారు వెనుక కారు

దాని వెనుక పెద్ద కారు

ఆ వెనుక భారీ వాహనాలు

పాతికా.. ముప్పయ్‌.. యాభై.. ఏకంగా వందకు పైగా వాహనాలు.. ఓ డాక్టరమ్మకు కృతజ్ఞతలు చెప్పడానికి వరుసకట్టాయివి. అరగంట పాటు ఒకటే హారన్లు.. అందులోని ప్రజల జేజేలు..

దేశాధ్యక్షుడి ముందు సైనికులు కవాతు చేసినట్టుగా ముచ్చట సాగింది. దేశం కాని దేశంలో భారతీయురాలికి దక్కిన గౌరవమిది. అమెరికాలో అరుదైన వందనాన్ని అందుకున్న డాక్టర్‌ ఉమారాణి మధుసూదనను ‘వసుంధర’ పలకరించింది.

మార్చి 21.. అమెరికాలోని కనెక్టికట్‌ సౌత్‌విండ్‌సర్‌లో ఓ భవనంలో ఫోన్‌ మోగింది. డాక్టర్‌ ఉమారాణి లిఫ్ట్‌ చేశారు. ఏదో చెప్పారు అవతలి వ్యక్తులు. ఉన్నఫళంగా మిడిల్‌టౌన్‌లో ఉన్న మిడ్‌స్టేట్‌ మెడికల్‌ సెంటర్‌ హార్ట్‌ఫోర్డ్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రికి బయల్దేరారామె. ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నాడు. దగ్గుతో ఆయాసపడుతున్నాడు. పరీక్షలు చేశారు డాక్టర్లు. అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆనాటి నుంచి ఆ ఆస్పత్రికి కేసులు వస్తూనే ఉన్నాయి. వైద్యులంతా అప్రమత్తమయ్యారు. రక్షణ చర్యలు తీసుకొని తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. కరోనా బాధితుల వార్డులోనే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు ఉమారాణి. ‘రాత్రికి రాత్రి శత్రుదేశం దండెత్తుతోంది.. అనగానే సిద్ధమైన సైనికుల్లా.. మారింది మా పరిస్థితి. మార్చి మూడో వారంలో మొదలైంది మా పోరాటం. బాంబులు, తూటాలు లేకపోవొచ్ఛు. స్కానింగ్‌ యంత్రాలు, ఆక్సిజన్‌ సిలిండర్ల శబ్దాలు, సిబ్బంది బూట్ల చప్పుడు.. యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడు రాత్రయిందో, ఎప్పుడు తెల్లారిందో తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయ’ని అక్కడి పరిస్థితిని చెప్పుకొచ్చారామె.

వారి చూపుల్లో ఎన్ని ప్రశ్నలో!

ఆస్పత్రిలో వందల్లో బాధితులు. వారి కళ్లల్లో వేలల్లో ప్రశ్నలు. మళ్లీ బతుకుతానా? కుటుంబాన్ని చూస్తానా? కచ్చితమైన సమాధానం లేని ఈ ప్రశ్నలు హృదయాన్ని కలచివేస్తున్నాయంటారు ఉమారాణి. ‘తమను ఎలాగైనా బతికించమంటూ కళ్లతోనే వేడుకునేవాళ్లు. వారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులందరూ ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు. ఎంత చేసినా.. ఏదో ఆవేదన! ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి మనసు బరువెక్కేది. అదే సమయంలో కోలుకొని ఇంటికి వెళ్తున్నవారిని చూసి సంతోషం కలిగేది’ అంటారు ఉమారాణి. రోజుకు 12 నుంచి 20 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్న ఉమారాణి ఇంటికి వెళ్లాక ఒంటరిగానే ఉంటున్నారు. భర్త ఇద్దరు పిల్లలు, తండ్రి అందరూ ఇంట్లోనే ఉన్నా.. తను మాత్రం ఓ గదిలో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో గడుపుతున్నారు. తన వస్తువులన్నీ గ్యారేజీలో ఉంచి.. ఇంట్లోకి అడుగుపెడుతున్నారామె. తన వల్ల ఎవరికీ ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తండ్రి స్ఫూర్తితో..

మైసూరుకు చెందిన ఉమారాణి ఆ నగరంలో ఎంబీబీఎస్‌ చదివారు. 2001లో అమెరికా వెళ్లారు. యూఎస్‌లో ఇన్‌ఫెక్టియస్‌ డిసీజెస్‌లో ఫెలోషిప్‌ చేసి వైద్యురాలిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ‘ప్రాణాలు నిలబెట్టే వైద్య వృత్తిని దైవంగా భావించాలని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. భయపడకుండా పని చేయాలనేవారు. ఇప్పుడు ఆయన నాతోనే ఉన్నారు. నాన్న ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించగలుగుతున్నా. కుటుంబమంతా నాకు అండగా ఉంద’ంటారు ఉమారాణి. ఈ డాక్టరమ్మ కృషితో ఎందరో కరోనా నుంచి కోలుకున్నారు. తమకు ప్రాణదానం చేసిన దేవతకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారంతా. తమవారిని కాపాడిన తల్లిని గౌరవించాలనుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు, వారి బంధువులు, అధికారులు, స్థానికులు అందరూ కలిసి.. సంఘీభావ సంకేతం తెలియజేయాలనుకున్నారు. అదీ ఆమెకు చెప్పకుండా. అందరూ కార్లలో, ఇతర వాహనాల్లో ఉమారాణి ఉంటున్న వీధిలో కవాతు నిర్వహించాలనుకున్నారు. ఆమెకు ఫోన్‌ చేసి ‘ఒకసారి బయటకు రండి’ అని పిలిచారు. ఎందుకో అనుకొని వచ్చారామె! ఆ వెంటనే కార్లన్నీ క్యూ కట్టాయి. హారన్లు మార్మోగాయి. డాక్టరమ్మకు జేజేలు పలుకుతూ ప్రజలు కదిలారు. ఉమారాణికి నోట మాట రాలేదు. ఊహించని గౌరవానికి ఆమె కళ్లు చెమర్చాయి. అరుదైన వందనం ఆమెలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ‘కరోనా ప్రబలుతున్న తీరుతో అప్పుడప్పుడు మాలో నిరుత్సాహం, ఆవేదన కలుగుతుంటాయి. ఈ గౌరవం కొత్త ఉత్తేజాన్నిచ్చింది. దీన్ని మా వైద్యులందరికీ లభించిన గుర్తింపుగా భావిస్తాన’ని చెప్పుకొచ్చారు ఉమారాణి.


Tags :

మరిన్ని