అంతర్జాతీయ తెలుగు మినీ కథల పోటీకి ఆహ్వానం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అంతర్జాతీయ తెలుగు మినీ కథల పోటీకి ఆహ్వానం

భీమవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు చిన్న కథల పోటీ నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ గజల్ శ్రీనివాస్, రెడ్డప్ప ధవేజీ ఓ ప్రకటనలో తెలిపారు. కథ నిడివి చేతిరాతలో A4లో రెండున్నర పేజీలు, డీటీపీలో ఒకటిన్నర పేజీ మించకూడదని, పేజీకి ఒకవైపు మాత్రమే రాయాలని సూచించారు. ‘దస్తూరి స్పష్టంగా ఉండాలి. ఒకరు ఒక్క కథ మాత్రమే పంపాలి. ఈ కథలు తెలుగు భాష లేదా భారతీయత.. వీటిలో ఏదో ఒక అంశం మీద మాత్రమే రాయాలి. హామీ పత్రంలో కథ తమ సొంత రచన అని పేర్కొనడంతో పాటు ఇంతకుముందు ఎందులోనూ ప్రచురితం గానీ, ప్రసారం గానీ అవ్వలేదని తెలియజేయాల్సి ఉంటుంది. ఏ ఇతర పోటీలకు కూడా పంపలేదని పేర్కొనడం తప్పనిసరి’ అని నిర్వాహకులు సూచించారు. హామీ పత్రంలో తప్ప కథ పేజీలో ఎక్కడా రచయిత పేరు, వివరాలు ఉండకూడదని, అందులో రచయిత పూర్తి పేరు, చిరునామా, వాట్సాప్‌ ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ విధిగా పొందుపరచాలన్నారు. 

కథలను డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి, సమన్వయకర్త, ఆంధ్ర సారస్వత పరిషత్, 11-1-4, SBI మోబర్లీపేట బ్రాంచ్ బిల్డింగ్, మెయిన్ రోడ్, అమలాపురం-533201 చిరునామాకు పంపాలని సూచించారు. ప్రవాస భారతీయులు dr.srskolluri@gmail.comకి జూన్ 25వ తేదీలోపు మెయిల్‌ చేయాలని కోరారు. విజేతల వివరాలను జులై 8న, 10.30 గంటలకు జరిగే అంతర్జాల కథా సదస్సులో తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ facebook pageలో వీక్షించొచ్చు. అదేరోజు విజేతలకు ప్రథమ బహుమతిగా ₹3,000, ద్వితీయ బహుమతిగా ₹2,000, తృతీయ బహుమతిగా ₹1,000, రెండు ప్రత్యేక బహుమతులుగా ₹500 నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


మరిన్ని