ఆ  దేవుడికే తెలియాలి..

తాజా వార్తలు

Published : 12/11/2020 21:45 IST

ఆ  దేవుడికే తెలియాలి..

నీతీశ్‌పై మనోజ్‌ ఝా విమర్శలు

పట్నా: కేవలం 43 సీట్లు సాధించి ముఖ్యమంత్రి నీతీశ్‌ మరోసారి సీఎం పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్నారని, అయితే అవి కార్యరూపం దాల్చవని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా విమర్శించారు. ప్రస్తుతం ఆయన‌ ఎలాంటి స్థితిలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని అన్నారు. తాజా పరిస్థితులను విశ్లేషిస్తే ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని చెప్పారు. ఒక వేళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా ఎన్ని రోజులపాటు పదవిలో ఉంటారో ఆ దేవుడికే తెలియాలని మనోజ్‌ ఝా వ్యాఖ్యానించారు. 

బిహార్‌‌ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి 125 స్థానాలు సాధించినప్పటికీ, ప్రత్యర్థి ఆర్జేడీ కూటమి 110 స్థానాలతో గట్టిపోటీ ఇచ్చింది. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షమైన జేడీయూ సాధించినవి మాత్రం 43 స్థానాలే. మొత్తం 115 చోట్ల బరిలో నిలిచి 72 స్థానాల్లో ఓటమి పాలైంది. భాజపా మాత్రం 110 స్థానాల్లో పోటీ చేసి 74 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నీతీశ్‌ను కొనసాగిస్తారా? లేదా? అనేదానిపై  రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. దీనికి ఆర్జేడీ నేతల విమర్శలు మరింత బలం చేకూరుస్తున్నాయి.

అయితే, ఫలితాల తర్వాత భాజపా మాత్రం ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జేడీయూకు తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగా నీతీశ్‌కుమారే మళ్లీ సీఎం కొనసాగుతారనే చర్చకూడా నడుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నితీశ్‌ ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణం చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే భవిష్యత్‌లో అధికార మార్పిడి జరిగే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని