బెంగాల్‌ ఎన్నికలు: భాజపాలోకి దినేశ్ త్రివేది

తాజా వార్తలు

Updated : 06/03/2021 15:02 IST

బెంగాల్‌ ఎన్నికలు: భాజపాలోకి దినేశ్ త్రివేది

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా తృణమూల్‌ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది నేడు భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో త్రివేది కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బంగారు క్షణమిదని ఆనందం వ్యక్తం చేశారు. 

ఫిబ్రవరి 12న రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడుతూనే త్రివేది ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. బెంగాల్‌లో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది ఆ సందర్భంలో తెలిపారు. ‘‘బెంగాల్‌లో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. దాని గురించి ఇక్కడేం మాట్లాడట్లేదు. హింసను అరికట్టేలా నేనేమీ చేయలేకపోతున్నందుకు నాకు చాలా ఇబ్బందిగా, బాధగా ఉంది. నన్ను ఇక్కడికి పంపించినందుకు మా పార్టీకి నేను కృతజ్ఞతగా ఉంటాను. కానీ, అక్కడ దాడులు జరుగుతుంటే నేను మౌనంగా కూర్చోలేను. ఏం చేయలేని నువ్వు ఇక్కడ ఎందుకు? అని నా అంతరాత్మ ప్రశ్నిస్తోంది. అందుకే రాజీనామా చేస్తున్నా’’అని త్రివేది సభలో ప్రకటించారు.

గత కొన్ని నెలలుగా బెంగాల్‌లో పార్టీ ఫిరాయింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి.. భాజపాలో చేరారు. తాజాగా త్రివేది కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా ఆయనకు సాదర స్వాగతం పలికారు. ‘‘ఓ సరైన వ్యక్తి తప్పుడు పార్టీలో ఉన్నారని త్రివేది గురించి నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు ఆయన సరైన పార్టీలోకి వచ్చారు’’ అని నడ్డా అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని