‘లోక్‌సభ’కు జై.. ‘అసెంబ్లీ’కి నైనై!!

తాజా వార్తలు

Updated : 11/02/2020 14:59 IST

‘లోక్‌సభ’కు జై.. ‘అసెంబ్లీ’కి నైనై!!

స్థానిక అంశాలకే పెద్ద పీట అంటున్న పౌరులు
మోదీ 2.0 తర్వాత మరో రాష్ట్రంలో కమలానికి ఎదురుదెబ్బ

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవా. దేశవ్యాప్తంగా కమల వికాసం. దిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలూ కైవసం. 2015లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీ క్లీన్‌స్వీప్‌. కాలచక్రం మళ్లీ ఐదేళ్లు తిరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలు. దిల్లీ పరిధిలో లోక్‌సభలో మళ్లీ ఏడుకు ఏడు స్థానాలు భాజపా వశం. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహం.. మోదీ హవా... కాంగ్రెస్‌ బలహీన పడడం వంటివి కలిసొస్తాయని కమలనాథులు ఆశించారు. జాతీయ అంశాల అజెండాతో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయినా, మళ్లీ అదే సీన్‌. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మళ్లీ పట్టం కడుతూ ఓటర్లు తీర్పిచ్చారు. 8 నెలల్లోనే ఎందుకింత మార్పు? ఓటర్లను అంతగా ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఆయా రాష్ట్రాల ఫలితాలు ఏం చెబుతున్నాయి?


ఫలితాల్లో వ్యత్యాసం


(దిల్లీ ఫలితాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి.. తుది ఫలితాల్లో శాతాలు మారొచ్చు)

లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పార్టీకి ఓటేస్తారన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. ఓటర్ల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. అందుకు దిల్లీ ఎన్నికలే నిదర్శనం. 2014 ఎన్నికల్లో భాజపా దిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకుంది. 46 శాతం ఓట్లు సంపాదించింది. అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్‌ శాతం 32.6 శాతం మాత్రమే. ఆ ఎన్నికల్లో 70కి కేవలం 3 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా భాజపా 56 శాతం ఓట్లతో 7 స్థానాలనూ కైవసం చేసుకుంది. అదే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఈ సారి దాదాపు 38 ఓటింగ్‌ శాతంతో 8 సీట్లకే (ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్‌ బట్టి) పరిమితమైంది.


స్థానిక అంశాలకే పెద్దపీట

2015, 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఓటర్ల మనోగతం ఎప్పటికప్పుడు మారుతోందని చెప్పొచ్చు. మోదీ రెండోసారి అధికారంలోకి రావడానికి జాతీయ అంశాలు తోడ్పడ్డాయన్నది కాదనలేని సత్యం. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదంటే మళ్లీ మోదీనే రావాలనే ఆకాంక్ష ఓటర్లలోకి బలంగా వెళ్లింది. దీంతో రెండోసారి పట్టం కట్టారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆప్‌-భాజపా మధ్యే ప్రధానంగా ఈ సారి ఎన్నికలు జరిగాయి. సీఏఏ, ఆర్టికల్‌ 370, అయోధ్య వంటి జాతీయ అంశాలతో భాజపా ఎన్నికలకు వెళ్లింది. ఇవే అంశాలపై ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఆప్‌ నేతలు సమయమనం కోల్పోకుండా వ్యవహరించారు. స్థానిక అంశాలు, ప్రభుత్వ పథకాలే అజెండాగా ముందుకెళ్లారు.


మినీ భారతం..


ఆమ్‌ ఆద్మీ పార్టీ నెలకొల్పిన మొహల్లా క్లినిక్స్‌

దిల్లీ అంటేనే మినీ భారతం. ఇక్కడ అనేక ప్రాంతాల చెందిన ఓటర్లు ఉంటారు. ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన పంజాబీలు, జాట్లు ఎక్కువగా నివసిస్తుంటారు. దీనికి తోడు పూర్వాంచల్‌ ( యూపీ,బిహార్‌లో భోజ్‌పురి భాష మాట్లాడే ప్రాంతం)కి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. వీరి ఓట్లను ఆకర్షించేందుకు భోజ్‌పురి గాయకుడైన మనోజ్‌ తివారీని భాజపా వ్యూహాత్మకంగా దిల్లీ శాఖకు అధ్యక్షుడిని చేసింది. ముఖ్యంగా వీరంతా నివసించడానికి ఇబ్బంది పడుతుంటారు. అందుకే.. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనధికార కాలనీలను కేంద్రంలోని భాజపా సర్కారు క్రమబద్ధీకరించడం గమనార్హం. అదే సమయంలో ఆప్‌ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం, మొహల్లా క్లినిక్కుల పేరిట వైద్యాన్ని అందించడం.. పరిమిత యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటివి ఆయా వర్గాలను ఆకట్టుకున్నాయి. దీనికి తోడు గతంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లంతా ఆప్‌ వైపు మళ్లడంతో ఆ పార్టీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించింది. పైగా ఇక్కడి ప్రజలు విద్యావంతులు. దీంతో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ఓటేస్తుంటారు. అదే సమయంలో భాజపా స్థానిక విషయాలను పక్కనపెట్టి జాతీయ అంశాలను తెరపైకి తీసుకురావడం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.


భాజపాకు మరో రాష్ట్రంలో..


ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జేఎంఎం నేత హేమంత్‌ సొరెన్‌

లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు చాలా రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన కమలం పార్టీకి దిల్లీ ఓటమితో మరో దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఝార్ఖండ్‌, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఝార్ఖండ్‌లో 14 స్థానాలకు 11 చోట్ల భాజపా గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి గెలుపొందింది. హరియాణా విషయంలోనూ అదే జరిగింది. 10కి 10 స్థానాలను కైవసం చేసుకున్న భాజపా.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మెజారిటీ స్థానాలు సాధించలేక చివరికి దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర (48)లో 23 స్థానాలను గెలుచుకున్న భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. దీనికి తోడు శివసేనతో విభేదాల కారణంగా అధికారానికి దూరమైంది. తాజాగా దిల్లీలో పాగా వేయాలని ఆశించినా కల నెరవేరలేదు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

ఇవీ చదవండి..

వీరు హ్యాట్రిక్‌ సీఎంలు..!

దిల్లీ ఎన్నికల ఫలితాలు- లైవ్‌ బ్లాగ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని