హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ నాదే: కౌశిక్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 12/07/2021 10:43 IST

హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ నాదే: కౌశిక్‌రెడ్డి

కార్యకర్తతో కాంగ్రెస్‌ నేత ఫోన్‌ సంభాషణ

హుజూరాబాద్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ బయటకొచ్చింది. మాదన్నపేటకు చెందిన విజేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని..  ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్‌ సంభాషణ బయటకు రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.

కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసులు

తెరాస టికెట్‌ తనకే ఖాయమైందంటూ కౌశిక్‌రెడ్డి ఫోన్‌ సంభాషణ బయటకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. గత కొంతకాలంగా కౌశిక్‌రెడ్డి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ తెరాస నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులందాయని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. కౌశిక్‌రెడ్డిని పిలిచి ఈ విషయంపై గతంలో హెచ్చరించినా అతనిలో మార్పురాలేదన్నారు. తాజా ఫోన్‌ సంభాషణపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నామని కోదండరెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని