తమిళనాట రాజకీయ సందడి మొదలైంది! 
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 19:10 IST

తమిళనాట రాజకీయ సందడి మొదలైంది! 

భాజపా సీట్ల సర్దుబాటు చర్చలు.. మూడో కూటమిపై కమల్‌ కసరత్తు!

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయం ఊపందుకుంది. కొత్త పొత్తులు, ఎత్తులు దిశగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. భాజపాతో దోస్తీతో ఎన్నికల బరిలోకి దిగుతున్న అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభించగా..  మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, ప్రముఖ సినీ హీరో కమల్‌హాసన్‌ ఏఐఎస్‌ఎంకే చీఫ్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఐజేకే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమిళనాట దిగ్గజ నేతలైన కరుణానిధి, జయలలిత మరణంతో రాజకీయ శూన్యత నెలకొందన్న అభిప్రాయంతో భావ సారూప్యత కలిగిన పార్టీలు, వ్యక్తులతో కలిసి మూడో కూటమి ఏర్పాటు దిశగా ఆయన పావులు కదుపుతున్నట్టు కనబడుతోంది.

భాజపా-అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు చర్చలు!

భాజపా, అన్నాడీఎంకే పార్టీలు ఎన్నికల్లో పొత్తులు దిశగా వేగం పెంచాయి. ఇందులో భాగంగా శనివారం ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు అంశంపై చర్చలు మొదలయ్యాయి. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, వీకే సింగ్‌తో పాటు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ అన్నాడీఎంకే ముఖ్యనేతలైన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం, పన్నీర్‌ సెల్వంతో చర్చలు జరిపారు. 

60 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న భాజపా!

ఇరు పార్టీల మధ్య భేటీ స్నేహపూర్వకంగానే సాగినట్టు భాజపా సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు త్వరలోనే కొలిక్కి రానున్నాయన్నారు. మరోవైపు, తమ పార్టీకి గెలిచే అవకాశం  ఉందని భావిస్తున్న 60 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే ప్రణాళిక ఆ పార్టీకి ఉంటుందని, ఇరు పార్టీలకు అంగీకారం అయిన తర్వాత ప్రకటిస్తామని భాజపా సీనియర్‌ నేత ఎం. చక్రవర్తి తెలిపారు. మరోవైపు, అన్నాడీఎంకే నేతలు ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న పీఎంకే ప్రతినిధి బృందంతో సాయంత్రం వేర్వేరుగా చర్చలు జరపనున్నారు. సినీనటుడు విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, జీకే వాసన్‌కు చెందిన తమిళ మానిలా కాంగ్రెస్‌ అన్నాడీఎంకేకు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే, భాజపా, మిత్రపక్షాలకు అన్నాడీఎంకే ఎన్ని సీట్లు చొప్పున కేటాయిస్తుందో చూడాలి.

అన్నాడీఎంకేతో పదేళ్లు కలిసి నడిచా.. కానీ!

దశాబ్ద కాలంగా అన్నాడీఎంకేతో కలిసి నడిచిన సినీనటుడు, ఏఐఎస్‌ఎంకే అధినేత ఆర్‌.శరత్‌ కుమార్‌ ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌ను శనివారం కలిశారు. ఏప్రిల్‌లో జరగబోయే ఎన్నికలపై చర్చించారు. కమల్‌తో భేటీ అనంతరం శరత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.  ‘తమిళనాడులో మాకు ఓటు బ్యాంకు ఉంది. ఏఐఎస్‌ఎంకే గత పదేళ్లుగా అన్నాడీంకేకు భాగస్వామిగా కొనసాగింది. ఆ పార్టీ నుంచి పిలుపు కోసం వేచి చూశాం. ఎలాంటి స్పందనా రాలేదు. మేం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. తమిళనాట మార్పు కోసం పోరాడతాం’’ అన్నారు.  ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము ఐజేకేతో చేతులు కలిపినట్టు శరత్‌ కుమార్‌ వెల్లడించారు. మంచి లక్ష్యాలు, భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి కూటమి ఏర్పాటుపై కమల్‌తో చర్చించానన్నారు. మూడో కూటమికి సీఎం అభ్యర్థి ఎవరని విలేకర్లు అడగ్గా.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చర్చిస్తామంటూ శరత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని