ప్రగతిభవన్‌, సచివాలయం భూములు అమ్మైనా దళితబంధు అమలు చేయాలి: రేవంత్‌

తాజా వార్తలు

Published : 31/07/2021 19:41 IST

ప్రగతిభవన్‌, సచివాలయం భూములు అమ్మైనా దళితబంధు అమలు చేయాలి: రేవంత్‌

హైదరాబాద్‌: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో  ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్‌, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ.. పోడు భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ.. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై ప్రేమ ఉండి కాదని.. కేవలం హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారని ఆయన ఆక్షేపించారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో లక్షమందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి ‘ఇస్తావా..చస్తావా’ అనే నినాదంతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధు అమలు చేయకపోతే తెరాస ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు.

ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు: భట్టి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని, కానీ, కేసీఆర్‌ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్టీలకు పోడు భూములపై హక్కులు కల్పించి.. వారు తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని