రాజకీయ లబ్ధి కోసమే జలవివాదం: బండి సంజయ్‌

తాజా వార్తలు

Published : 04/07/2021 16:04 IST

రాజకీయ లబ్ధి కోసమే జలవివాదం: బండి సంజయ్‌

హైదరాబాద్‌: జలవివాదం పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేవలం స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తోందనే విషయం తెలియదంటూ సీఎం కేసీఆర్‌ అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. 299 టీఎంసీల నీటి కోసం అపెక్స్ కమిటీలో కేసీఆర్ సంతకం చేశారన్నారు. దానిపై తెలంగాణ భాజపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని.. 575 టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు 50-50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరగాలని కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి కేవలం 299 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయని ఆక్షేపించారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్.. రెండు సార్లు అపెక్స్‌ సమావేశాన్ని వాయిదా వేశారన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని సీఎం ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తెరాస చేసిందేమీ లేదు..

కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పథకాలతోనే ప్రజలకు ఊరట లభించిందన్నారు. ఉచిత రేషన్, ఉచిత టీకా కార్యక్రమాలను కేంద్రమే తీసుకొచ్చిందని.. తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ చూస్తే రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందనే విషయం స్పష్టమవుతోందన్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే దర్యాప్తు జరిపించిన దాఖలాలు లేవని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని