నలుగురి చేతిలో 4కోట్ల మంది బందీ: రేవంత్‌

తాజా వార్తలు

Updated : 07/07/2021 17:11 IST

నలుగురి చేతిలో 4కోట్ల మంది బందీ: రేవంత్‌

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గాంధీభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామి దయతో పాటు సోనియమ్మ ఆశీస్సులతో ఈ పదవి చేపడుతున్నా. నాలుగు కోట్ల మంది ఆకాంక్షల మేరకు పనిచేయడానికే సోనియాగాంధీ నాకు ఈ బాధ్యత అప్పగించారు. నలుగురి చేతిలో 4 కోట్ల మంది బందీలయ్యారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయం పాలన లేక పెద్ద దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టారీతిన ఆడుతున్నారు. కేసీఆర్‌ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను తెరాస ఆదుకోలేదు. గులాబీ చీడను పొలిమేరలు దాటేవరకు తరమాలి. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. రాహుల్‌ గాంధీ వంటి నాయకుడు మన సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు. నిరుద్యోగులు, దళితులు, బడుగు బలహీన వర్గాలను తెరాస ప్రభుత్వం నయవంచనకు గురిచేసింది. ఏపీలో కాంగ్రెస్‌ చనిపోయినా ఫర్వాలేదని తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదా? మన తెలంగాణ తల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ. నాలుగుకోట్ల మంది ప్రజలు తమ ఇళ్లలో సోనియమ్మ గుడి కట్టుకోవాలి. నాయకుల సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలి. ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)ను సలహాదారుగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. మంచిదే.. కానీ, పాదరసం లాంటి మా కార్యకర్తలే పీకేలు. ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులకు రెండేళ్లు సెలవు పెట్టాలి. రాష్ట్రం, దేశం కోసం పోరాడేందుకు కార్యకర్తలు ఇంట్లో అనమతి తీసుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

వ్యక్తగత నినాదాలు వద్దు
రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే కొందరు కార్యకర్తలు రేవంత్‌కు అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గమనించిన రేవంత్‌ వారిని సున్నితంగా మందలించారు. వ్యక్తుల పరంగా ఎవరికీ స్లోగన్‌లు వద్దు... ధిక్కరించిన వారిని అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయిస్తానంటూ హెచ్చరించారు. సోనియా, రాహుల్‌ గాంధీల నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే ఎంతటి వారినైనా క్షమించమన్నారు. వ్యక్తిగతం వద్దు.. సమష్టిగా పోరాడదామంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం పార్టీకి తీరని నష్టమని వివరించారు. పార్టీ సమష్టి పోరాటాలతోనే అధికారం చేజిక్కించుకోగలమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు సభకు భారీగా తరలివచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని