తెరాసలోకి మాజీ మంత్రి ముద్దసాని తనయుడు
close

ప్రధానాంశాలు

తెరాసలోకి మాజీ మంత్రి ముద్దసాని తనయుడు

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనకు మంత్రులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో హుజూరాబాద్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన కశ్యప్‌ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా తెరాస సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా కశ్యప్‌ మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్‌ సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చెందుతోంది. అందుకే కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరా. త్వరలో హుజూరాబాద్‌లో జరిగే సమావేశంలో వందల మంది అనుచరులు కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరతారు. రానున్న ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ విజయం సాధించేందుకు అంకితభావంతో పనిచేస్తా’’ అని అన్నారు.

హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే

ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కశ్యప్‌రెడ్డిని తెరాసలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రులు హరీశ్‌, ఈశ్వర్‌, కమలాకర్‌ చెప్పారు. హుజూరాబాద్‌ 2001నుంచి తెరాసకు కంచుకోటని, అక్కడి ప్రజలు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలవారని పేర్కొన్నారు. ఉపఎన్నికలో తెరాసను గెలిపిస్తారని.. మోసాలకు, కుట్రలకు తగిన శాస్తి చేస్తారని వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలో తిరిగి ఎగిరేది గులాబీ జెండానేనని ఈటల రాజేందర్‌ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌ రాజేశంగౌడ్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని