కేసీఆర్‌ పాలనలో ఉద్యమకారులకు నిరాశ
close

ప్రధానాంశాలు

కేసీఆర్‌ పాలనలో ఉద్యమకారులకు నిరాశ

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌లో చేరతానన్న సామ వెంకట్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడితే కేసీఆర్‌ పాలనలో అవి నిష్ఫలమై, ఉద్యమకారులు నిరాశలో కూరుకుపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ క్రమంలోనే రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌ సామ వెంకట్‌రెడ్డి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు. ఆయనతో పాటు మండలి కార్యవర్గమంతా తెరాసకు రాజీనామా చేసిందని తెలిపారు. వారు తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ను కలిశారని, రాష్ట్రానికి వెళ్లి ముఖ్య నాయకులతో చర్చించి వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని వివరించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తాను ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా పని చేశానని తెలిపారు. తమ సంఘానికి 33 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయని, సుమారు 40 వేల మంది సభ్యులున్నారన్నారు. త్వరలోనే తాము కాంగ్రెస్‌లో చేరతామని తెలిపారు. ఫోన్ల హ్యాకింగ్‌పై గురువారం చేపట్టనున్న రాజ్‌భవన్‌ ముట్టడిపై మాణికం ఠాగూర్‌తో చర్చించినట్లు రేవంత్‌ చెప్పారు.

అప్పుడు అంగీకరించిన కేంద్రం ఇప్పుడు యూటర్న్‌
దేశంలో 121 మంది వాట్సప్‌ వినియోగదారులపై పెగాసస్‌ స్పైవేర్‌ దాడి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం 2019లోనే అంగీకరించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆ ఏడాది డిసెంబరు 11న లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. దాడి జరిగినట్లు ఇదివరకు అంగీకరించిన కేంద్రం.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకుందని ఎద్దేవా చేశారు. భారతీయ పాత్రికేయులు, న్యాయవాదులపై నిఘా ఉంచడానికి వాట్సప్‌ హ్యాకింగ్‌కు గురైందా? అని నాడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు అప్పటి ఐటీ మంత్రి సంజయ్‌ధోత్రే సమాధానమిచ్చారు. ‘‘పెగాసస్‌ అనే స్పైవేర్‌ ద్వారా కొందరు వాట్సప్‌ వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వాట్సప్‌ సంస్థ భారత ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. దాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధి చేసింది. భారత్‌లో 121 మంది; ప్రపంచ వ్యాప్తంగా 1,400 మంది వినియోగదారుల ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్‌ స్పైవేర్‌ని ఉపయోగించారు. ఈ సమస్యను ఫిక్స్‌ చేసినట్లు 2019 మే 20న వాట్సప్‌ సంస్థ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (ఐసీఈఆర్‌టీ)కు నివేదించింది. దాడిచేసిన వ్యక్తి... మొబైల్‌లో దేన్నయినా చొప్పించి ఉండొచ్చని, దాడి ఎంత విస్తృతస్థాయిలో జరిగిందో తెలియలేదని చెప్పింది. సమస్యను ఫిక్స్‌ చేసినందున ఆ దాడి ఇకపై కొనసాగదని పేర్కొంది. ఈ సమస్యను అధిగమించే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ గురించి వాట్సప్‌ సంస్థ 2019 సెప్టెంబరు 5న సీఈఆర్‌టీకి లేఖ రాసింది’’ అని నాడు సంజయ్‌ధోత్రే ఇచ్చిన సమాధానాన్ని రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని