ఇంద్రవెల్లి నుంచి దళిత-గిరిజన దండోరా

ప్రధానాంశాలు

ఇంద్రవెల్లి నుంచి దళిత-గిరిజన దండోరా

పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి

అమీర్‌పేట, గాంధీభవన్‌, న్యూస్‌టుడే: క్విట్‌ ఇండియా దినోత్సవమైన ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో లక్షమందితో ‘దళిత-గిరిజన దండోరా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ బలోపేతానికి ఇక్కడి నుంచే కదం తొక్కుదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. బేగంపేటలోని చిరాన్‌ఫోర్ట్‌ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ మంచిర్యాల జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయన తనకు సోదర సమానులన్నారు. ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. కార్యకర్తలు ఎవరికీ భయపడకుండా.. ధైర్యంగా ముందుకెళ్లాలని, అధిష్ఠానం వెన్నుదన్నుగా ఉంటుందన్నారు.

సెప్టెంబరు 17 వరకూ..: మధుయాస్కీ
‘దళిత-గిరిజన దండోరా’ను ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహిస్తామని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ తెలిపారు. హుజూరాబాద్‌ నుంచే మొదలు పెట్టాలనే ఆలోచన చేసినప్పటికీ  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దళిత, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున అక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం ఆయా వర్గాలను ఎలా మోసం చేస్తోందో వివరిస్తామన్నారు. వ్యాఖ్యాత, నటి కత్తి కార్తీక ఆదివారం మధుయాస్కీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.


నా ఫోనుపైనా నిఘా ఉంది: ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతిపక్షాల, ప్రజాస్వామ్యవాదుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసేందుకు ఇజ్రాయెల్‌ నుంచి పెగాసస్‌ లాంటి సాంకేతికతను ప్రభుత్వం కొనుగోలు చేసిందని నల్గొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఫోనుతో పాటు అనేక మంది నాయకుల ఫోన్లపై నిఘా ఉందన్నారు. పెగాసస్‌పై పార్లమెంట్‌లో జరిగే చర్చలో మాట్లాడతానని తెలిపారు. రాష్ట్రంలో దళిత బంధు అమలు చేసేందుకు రూ.1.50లక్షల కోట్లు సమకూర్చాకే దాని గురించి సీఎం కేసీఆర్‌ మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి అసమర్థతతోనే కృష్ణానీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని