సింగరేణి బొగ్గు తరలించేందుకు కుట్ర

ప్రధానాంశాలు

సింగరేణి బొగ్గు తరలించేందుకు కుట్ర

కేంద్రంపై మంత్రి హరీశ్‌రావు విమర్శ

అలాంటి పార్టీకి ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్న

హుజూరాబాద్‌ పట్టణం, హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సింగరేణి నుంచి బొగ్గును తరలించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం హుజూరాబాద్‌లో ఎంపీ బండా ప్రకాశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బొగ్గును తరలించేందుకు కుట్ర చేస్తున్న భాజపాకు ఉప ఎన్నికలో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అప్పట్లో ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్‌ మానకొండూరు-హుజూరాబాద్‌ మీదుగా నూతన రైల్వే లైన్‌ మంజూరు చేయించారని, దీనికి సంబంధించిన డీఆర్‌సీ కూడా పూర్తయిందని, ఇప్పుడు దాన్ని నిలువరించినందుకు భాజపాకు ఓటేస్తారా అని అడిగారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. మన థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని పేర్కొన్నారు. యూపీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలున్నాయని, తెలంగాణలో లేవన్నారు. మన అవసరాలకు పోనూ 6 నుంచి 10 మిలియన్ల యూనిట్లను పక్క రాష్ట్రాలకు అందిస్తున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపే కారణమని స్పష్టంచేశారు. ఇక్కడ భాజపా గెలిస్తే దిల్లీకి గులాంగిరీ చేస్తుందని, తెరాస గెలిస్తే రాష్ట్ర ప్రజలకు గులాములుగా ఉంటామని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం రైతులను కారు ఎక్కించాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వం రైతులపైకి కార్లను ఎక్కిస్తోందని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని