close
Array ( ) 1

తాజా వార్తలు

ఆసీస్‌పై గెలుపుతో సెమీస్‌ పక్కా!

కివీస్‌ చేతిలో ఓడినా బంగ్లా, లంకపై గెలిస్తే చాలు

వాట్‌ ఏ గేమ్‌! మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం తర్వాత అందరూ అంటున్న మాట. అందుకు తగ్గట్టే అదరగొట్టింది హర్మన్‌ సేన. ప్రత్యర్థేమో ఆతిథ్య జట్టు. నాలుగుసార్లు విశ్వవిజేత. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాతో ఫేవరెట్‌గా అడుగుపెట్టింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా భారీ షాట్లు బాదే ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం.

టీమ్‌ఇండియా చేసిందేమో 132 పరుగులు. పేస్‌ బౌలింగ్‌ అంత పదునైనదేమీ కాదు. ఓపెనర్‌ అలిసా హేలీ (51; 35 బంతుల్లో 6×4, 1×6) విధ్వంసకరంగా ఆడుతోంది. ఏ ప్రకారం చూసుకున్నా గెలుపు ఆసీస్‌దే అనుకున్నారు అంతా. గింగిరాలు తిరిగే బంతులతో పూనమ్‌ యాదవ్‌, దీప్తిశర్మ ఇంద్రజాలం చేయడంతో టీమ్‌ఇండియా విజయం సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌తోనే ప్రపంచకప్‌ సెమీస్‌కు మార్గం సుగమం చేసుకుంది. అద్భుతమో, అనూహ్యమో జరిగితే తప్ప హర్మన్‌సేన సెమీస్‌ చేరడం పక్కా!


కఠినమైన గ్రూప్‌-ఏ

టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడుతున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, థాయ్‌ల్యాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో గెలిచిన జట్లు సెమీస్‌ చేరుకుంటాయి. జట్లవారిగా ఫామ్‌, పరుగులు, వికెట్లు, విజయాలు, బలాబలాలను విశ్లేషిస్తే ఇందులో అత్యంత కఠినమైంది గ్రూప్‌-ఏ. అందులోనే టీమ్‌ఇండియా ఉంది.


బంగ్లా, లంక అంతంత  మాత్రం

ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌కు తిరుగులేదు. ఆరుసార్లు పోటీపడి 4 సార్లు విజేతగా ఆవిర్భవించింది. ఆ జట్టును ఓడించడం అంత సులువు కాదు. మెగా టోర్నీల్లో 32 మ్యాచుల్లో 24 గెలిచింది. ఇక న్యూజిలాండ్‌ 2009, 2010లో రన్నరప్‌. ఆస్ట్రేలియాకు సరిజోడు. సుజీబేట్స్‌, సోఫీ డెవిన్‌ వంటి క్రికెటర్లు ఆడితే మామూలుగా ఉండదు. ప్రపంచకప్‌లో 20/28 దాని విజయాల రికార్డు. ఇక టీమ్‌ఇండియా 2009, 2010, 2018లో సెమీస్‌ చేరింది. కొన్ని పొరపాట్ల వల్ల ఫైనల్‌ చేరుకోలేదు గానీ ఇప్పుడు అద్భుతమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. మెగాటోర్నీలో 26 మ్యాచులాడితే 13 గెలిచింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక అంతంత మాత్రమే. అంటే ఒకే గ్రూపులో ప్రపంచ ఛాంపియన్లు కాగలిగే మూడు జట్లు ఉన్నాయి. మరో గ్రూప్‌లో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మాత్రమే బలమైన జట్లు. చెరోసారి ఇవి ప్రపంచకప్‌ను ముద్దాడాయి.


ఆసీస్‌ను కివీస్‌ ఓడించి.. కివీస్‌ను భారత్‌ ఓడిస్తే 

ఈ టోర్నీ తొలి మ్యాచులో భారత్‌, ఆస్ట్రేలియా తలపడుతుండటంతో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌ చేరుకోవడం సునాయాసమే అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సెమీస్‌ చేరే జట్టు 2 కన్నా ఎక్కువ ఓటములు చవిచూడొద్దు. ఆ ప్రకారం టీమ్‌ఇండియాకు ఇప్పుడు మెరుగైన అవకాశం ఉంది. గ్రూప్‌లో ఒక్కో జట్టు నాలుగు మ్యాచుల్లో తలపడాలి. అన్నీ గెలిస్తే 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇప్పుడా అవకాశం భారత్‌, న్యూజిలాండ్‌కు మాత్రమే ఉంది. మెరుగైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ ఉన్న టీమ్‌ఇండియా ఆ జట్టును ఓడించగలదు. ఇక బంగ్లాదేశ్, శ్రీలంక సంగతి సరేసరి. ఈ రెండు జట్లు గ్రూప్‌ దశ వరకే పరిమితం అనే ప్రచారమూ ఉంది. ఈ ప్రకారం హర్మన్‌సేన సెమీస్‌ చేరడం అత్యంత సులువు.


పోటీ ముగ్గురి  మధ్యే.. కివీస్‌ కీలకం

పై విధంగా జరగకుంటే సమీకరణం ఇలా ఉంటుంది. బలమైన న్యూజిలాండ్‌పై గెలవడం భారత్‌, ఆసీస్‌కు కీలకం అవుతాయి. న్యూజిలాండ్‌పై భారత్‌ ఓడి బంగ్లా, లంకపై గెలిస్తే 6 పాయింట్లు వస్తాయి. ఇక న్యూజిలాండ్‌ సహా మిగతా వాటిపై గెలిస్తే 8 పాయింట్లు వస్తాయి. హర్మన్‌సేనకు ఈ రెండు అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌ అన్నీ గెలిచి 8 పాయింట్లు సాధిస్తే భారత్‌ 3 విజయాలతో రెండో స్థానంలో ఉంటుంది. ఆసీస్‌ 2 అపజయాలతో ఉంటుంది కాబట్టి అవకాశం లేదు. న్యూజిలాండ్‌ గనక భారత్‌, ఆసీస్‌ చేతిలో ఓడితే దాని కథ  ముగిసినట్టే. లేదా ఆసీస్‌ను ఓడించి మిగతావి గెలిస్తే రెండో స్థానంలో నిలుస్తుంది. ఆసీస్‌.. న్యూజిలాండ్‌ సహా అన్నీ గెలిస్తే సెమీస్‌ చేరుకోవచ్చు. అప్పుడు భారత్‌ కచ్చితంగా న్యూజిలాండ్‌పై గెలిచి తీరాలి. అయితే సెమీస్‌కు మరో సమీకరణం కూడా ఉండే అవకాశం లేకపోలేదు. భారత్‌పై కివీస్‌ గెలిచి, ఆసీస్‌ చేతిలో ఓటమి పాలై.. ఈ మూడు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్‌ను ఓడిస్తే వాటి పాయింట్లు సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగ్గా రన్‌రేటు ఉన్న జట్లు సెమీస్‌కు చేరుతాయి. ఏది ఏమైనప్పటికీ ఒత్తిడంతా ఆసీస్‌పై ఉంది. ఏ ఒక్క మ్యాచులో ఓడినా అవకాశాలు గల్లంతే. భారత్‌కు ఒత్తిడి లేదు. లంక, బంగ్లా చిన్న జట్లే.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.