IPL: ఈ మూడుఛేదనలూ వాటికవే సాటి

తాజా వార్తలు

Published : 02/05/2021 15:42 IST

IPL: ఈ మూడుఛేదనలూ వాటికవే సాటి

టాప్‌-3లో రెండు రాజస్థాన్‌వే.. ముంబయి తొలి మురిపెం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటే నాణ్యమైన క్రికెట్‌కు మరో పేరు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ను మించిన పోటీ.. ఉత్కంఠ.. ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లు పోటీ పడుతుంటారు. బౌలర్లు... బ్యాటర్లు సై అంటే సై అంటారు. అందుకే ఐపీఎల్‌లో 200+ పరుగుల లక్ష్యాలను ఛేదించడం అంత తేలికేం కాదు. తాజాగా ముంబయి ఇండియన్స్‌ 219 పరుగుల్ని ఛేదించడంతో విజయవంతమైన ఛేదనలపై ఆసక్తి నెలకొంది. ఇంతకూ టాప్‌-3 ఛేదనలేంటి? అందులో మెరుపులు ఎవరివో చూద్దామా!!


షార్జాలో.. షాన్‌దార్‌!

లీగ్‌లో అతిపెద్ద ఛేదన రికార్డును రెండుసార్లు సృష్టించింది రాజస్థాన్‌. 13వ సీజన్‌లో షార్జా వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని దర్జాగా ఛేదించింది ఆ జట్టు. అసలు సింగిల్స్‌, డబుల్స్‌ అన్న మాటే లేదు. దొరికిన ప్రతి బంతినీ స్టేడియం పైకప్పు పైకి తరలించారు ఆటగాళ్లు. ఈ పోరులో మొదట మయాంక్‌ (106; 50 బంతుల్లో 10×4, 7×6), రాహుల్‌ (69; 54 బంతుల్లో 7×4, 1×6) దంచికొట్టారు. ఇక ఆ జట్టుకు తిరుగులేదనే అనిపించింది. అయితే లక్ష్య ఛేదనలో సంజు శాంసన్‌ (85; 42 బంతుల్లో 4×4, 7×6), స్మిత్‌ (50; 27 బంతుల్లో 7×4, 2×6), రాహుల్‌ తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) పరుగుల వరద పారించడంతో మరో 3 బంతులు మిగిలుండగానే గులాబి దండు విజయ దుందుభి మోగించింది. సంజు కొట్టిన సిక్సర్లు షార్జా స్టాండ్స్‌లో పడుతుంటే అతడి కండబలమేంటో తెలిసొచ్చింది.


‘పొలి’ కేక పెట్టించాడు

ఐపీఎల్‌లో రెండో అత్యధిక విజయవంతమైన ఛేదన ముంబయి ఇండియన్స్‌ నమోదు చేసింది. తాజా (2021) సీజన్లో దిల్లీ వేదికగా జరిగిన పోరులో చెన్నై నిర్దేశించిన 219 పరుగుల్ని ఆఖరి బంతికి ఛేదించింది. తొలుత డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో 5×4, 5×6), అంబటి రాయుడు (72*; 27 బంతుల్లో 4×4, 7×6) విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా రాయుడు 20 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. మైదానం చుట్టూ సిక్సర్లు బాదేశాడు.

ఇక ఛేదనకు దిగిన ముంబయికీ డికాక్‌ (38; 28 బంతుల్లో 4×4, 1×6), రోహిత్‌ శర్మ (35; 24 బంతుల్లో 4×4, 1×6) శుభారంభం అందించారు. వీరిద్దరూ ఔటయ్యాక కృనాల్‌ పాండ్య (32; 23 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి కీరన్‌ పొలార్డ్‌ (87*; 34 బంతుల్లో 6×4, 8×6) నాలుగో వికెట్‌కు 89 (44 బంతుల్లో) పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. మైదానం నలుమూలలా వివిధ కోణాల్లో సిక్సర్ల పిడుగులు కురిపించాడు. దాంతో ముంబయి ఆఖరి 10 ఓవర్లలో 138 పరుగులు చేసింది. చివరి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా పొలార్డ్‌ 2 బౌండరీలు, ఓ సిక్సర్‌ బాదేసి విజయకేతనం ఎగరేశాడు. ఈ పోరులో మొత్తం 30 సిక్సర్లు, 30 బౌండరీలు రావడం గమనార్హం. ముంబయి అతిపెద్ద ఛేదనా ఇదే కావడం ప్రత్యేకం.


మొదటా.. రాజసమే

మూడో రికార్డు ఛేదనా రాజస్థాన్‌దే. 2008లో డెక్కన్‌ జట్టుపై 215 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల నష్టపోయి ఛేదించేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ఈ పోరుకు వేదిక. తొలుత ఆండ్రూ సైమండ్స్‌ (117; 53 బంతుల్లో 11×4, 7×6) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసకర బౌండరీలు బాదాడు. 220.75 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. అతడికి తోడుగా రోహిత్‌ శర్మ (36; 30 బంతుల్లో 3×4, 1×6) నిలిచాడు. అరంగేట్రం సీజన్‌ కావడంతో రాజస్థాన్‌ గెలుపు సులువేమీ కాదనే అంతా అనుకున్నారు. కానీ షేన్‌వార్న్‌ సేన అందరి అంచనాలనూ తలకిందులు చేసింది. గ్రేమ్‌ స్మిత్‌ (71; 45 బంతుల్లో 9×4, 2×6), యూసుఫ్‌ పఠాన్‌ (61; 28 బంతుల్లో 4×4, 6×6), మహ్మద్‌ కైఫ్‌ (34; 16 బంతుల్లో 2×4, 3×6), వార్న్‌‌ (22*; 9 బంతుల్లో 2×4, 2×6) సమష్టిగా దంచికొట్టారు. దాంతో మరో బంతి మిగిలుండగానే గెలుపు రాజస్థాన్‌ తలుపు తట్టింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని