Dhoni: అతడు చెన్నైకి ‘మహారాజు’ 

తాజా వార్తలు

Updated : 05/07/2021 19:39 IST

Dhoni: అతడు చెన్నైకి ‘మహారాజు’ 

సీఎస్కేను వదలడు: బ్రాడ్‌హాగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆ ఫ్రాంఛైజీని వదలడని, అతను ఆ జట్టుకు ‘మహారాజు’ అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ అన్నాడు. ఐపీఎల్‌ 2022కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ పద్ధతులపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఓ భారత క్రికెట్‌ అభిమాని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ను ట్యాగ్‌ చేస్తూ ధోనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. ‘‘బ్రాడ్‌ సర్‌.. ఒకవేళ ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో చెన్నై జట్టు ధోనీని అట్టిపెట్టుకోకపోతే ఏ జట్టు అతని అనుభవం, సేవలను పొందాలని చూస్తుంది’’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేశాడు.

దీనికి స్పందించిన బ్రాడ్‌హాగ్‌.. ‘‘ఐపీఎల్‌లో ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వదలడు. ఆ ఫ్రాంఛైజీకి అతను మహారాజు. ఒకవేళ ధోనీని ఆటగాడిగా కొనసాగించకపోతే కోచింగ్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు’’ అని సమాధానమిచ్చాడు. ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ పద్ధతులపై సోమవారం ఓ జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం రావడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఆ పత్రికలో ఏ జట్టు అయినా గరిష్ఠంగా నలుగురిని కొనసాగించవచ్చని.. అందులో ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు, లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులు ఉండొచ్చని రాసుకొచ్చింది. దాంతో చెన్నై ధోనీని ఆటగాడిగా కొనసాగిస్తుందా లేదా అనే దానిపై అభిమానులు సందేహపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు హాగ్‌ తన అభిప్రాయం వెల్లడించాడు.

మరోవైపు ధోనీ గత రెండు సీజన్లలో అంత చురుగ్గా కనిపించడంలేదు. కెప్టెన్‌గా ఆకట్టుకుంటున్నా.. బ్యాట్స్‌మన్‌గా మునుపటిలా ఆడలేకపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ తనకన్నా కింది స్థాయి వారిని ముందుగా పంపిస్తున్నాడు. మరోవైపు అతని వయసు కూడా వచ్చే ఏడాదికి 40కి చేరువవుతుంది. దాంతో ఆటగాడిగా కొనసాగేందుకు కష్టమనే భావన కూడా అభిమానుల్లో నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో హాగ్‌ చెప్పినట్లు సీఎస్కేకు కోచింగ్‌ లేదా మెంటార్‌ బాధ్యతలు స్వీకరించే వీలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ ఏంచేస్తాడో వేచిచూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని