close

తాజా వార్తలు

Published : 28/10/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కసిగా కొట్టేశారు

హైదరాబాద్‌ వీర విధ్వంసం
దుమ్మురేపిన సాహా, వార్నర్‌
దిల్లీ క్యాపిటల్స్‌ చిత్తు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దుమ్ము రేపింది. ప్లేఆఫ్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గర్జించింది. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ హైదరాబాద్‌.. దిల్లీపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట పరుగుల వర్షంతో ప్రత్యర్థిని ముంచెత్తి ఆపై బౌలింగ్‌లోనూ అదరగొట్టి స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ దిల్లీ బౌలింగ్‌ను ఉతికిపారేస్తే.. మాయావి రషీద్‌ఖాన్‌ ఆ జట్టును చుట్టేశాడు. 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది అయిదో విజయం కాగా.. ప్లేఆఫ్‌కు గెలుపు దూరంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా మూడో పరాజయం.

దుబాయ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అదిరే విజయం...! కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఆ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మంగళవారం మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. సాహా (87; 45 బంతుల్లో 12×4, 2×6), వార్నర్‌ (66; 34 బంతుల్లో 8×4, 2×4) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడారు. ఛేదనలో రషీద్‌ఖాన్‌ (3/7) దెబ్బకు దిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (36; 35 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. సాహాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

దిల్లీ విలవిల..: భారీ ఛేదనలో ఆరంభం నుంచి దిల్లీ నుంచి పోటీనే కనిపించలేదు. హైదరాబాద్‌ పరుగుల వర్షం కురిపించిన పిచ్‌పై క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరిందో లేదో ధావన్‌ (0) వెనుదిరిగాడు. స్టాయినిస్‌ (5) కూడా నిలబడకపోవడంతో దిల్లీ 14 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతంతా దిల్లీ ఛేదన కన్నా హైదరాబాద్‌ వికెట్ల వేటే కనిపించింది. స్పిన్నర్‌ రషీద్‌ దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన దిల్లీ.. పూర్తిగా వెనకబడిపోయింది.  రహానె (26; 19 బంతుల్లో 3×4, 1×6)తో పాటు హెట్‌మయర్‌ (16)ను ఒకే ఓవర్లో ఔట్‌ చేసిన రషీద్‌.. దిల్లీని మరింత గట్టిదెబ్బ కొట్టాడు. 7 ఓవర్లకు స్కోరు 55/4. ఆ తర్వాత క్యాపిటల్స్‌ పోరాటం అంతా ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. పంత్‌ చివరిదాకా నిలిచినా భారీ షాట్లు కొట్టలేకపోయాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ విపరీతంగా పెరుగుతూ పోయింది. పంత్‌ 17వ ఓవర్లో ఎనిమిదో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. గాయపడిన సాహా స్థానంలో హైదరాబాద్‌కు సబ్‌స్టిట్యూట్‌ శ్రీవత్స్‌ గోస్వామి వికెట్‌కీపింగ్‌ చేశాడు. శంకర్‌ కూడా గాయంతోనే 12వ ఓవర్లో తప్పుకోవడంతో ఆ ఓవర్‌ చివరి బంతిని వార్నర్‌ వేశాడు.
దంచుడే దంచుడు:  చివరి అయిదు  ఓవర్లను మినహాయిస్తే సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మెరుపులే మెరుపులు. కెప్టెన్‌ వార్నర్‌తో కలిసి వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చెలరేగిపోయాడు. ముందు వార్నర్‌ అగ్గిలా అంటుకుంటే అతనికి వృద్ధిమాన్‌ వాయువులా తోడయ్యాడు. తనశైలిలో లాఫ్టెడ్‌ షాట్లతో అలరించిన బర్త్‌డే బాయ్‌ వార్నర్‌.. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను సిక్స్‌ సహా నాలుగు ఫోర్లు బాదడంతో పవర్‌ ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 77/0తో నిలిచింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన ఈ లెఫ్ట్‌హ్యాండర్‌ ఈ సీజన్లో పవర్‌ప్లే లోపల ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వార్నర్‌ ఔటయ్యాక బాదే బాధ్యతను తీసుకున్న సాహా.. దిల్లీ బౌలర్లను లెక్కే చేయకుండా ఆడాడు. ముఖ్యంగా రబాడ బౌలింగ్‌లో కొట్టిన పుల్‌ షాట్‌ సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌. ఈ క్రమంలో 27 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్కు చేరుకున్న అతను.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. సెంచరీ చేసేలా కనిపించిన వృద్ధిమాన్‌.. నార్జ్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 14.3 ఓవర్లలో 170 పరుగులు. ఈ దశలో సన్‌రైజర్స్‌ 250 పరుగులు చేస్తుందేమో అనిపించింది. కానీ దిల్లీ బౌలర్లు పుంజుకున్నారు. హైదరాబాద్‌ జోరుకు బ్రేకులు వేశారు. మనీష్‌ పాండే (44 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 1×6) కొన్ని మెరుపు షాట్లు ఆడినా.. ఆడాల్సినంత వేగంగా ఆడలేదు. చివరి అయిదు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 44 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 66; సాహా (సి) శ్రేయస్‌ (బి) నార్జ్‌ 87; పాండే నాటౌట్‌ 44; విలియమ్సన్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 219; వికెట్ల పతనం:  1-107, 2-170;  బౌలింగ్‌: నార్జ్‌ 4-0-37-1; రబాడ 4-0-54-0; అశ్విన్‌ 3-0-35-1; అక్షర్‌ పటేల్‌ 4-0-36-0; తుషార్‌ 3-0-35-0; స్టాయినిస్‌ 2-0-15-0
దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రహానె ఎల్బీ (బి) రషీద్‌ 26; ధావన్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌శర్మ 0; స్టాయినిస్‌ (సి) వార్నర్‌ (బి) నదీమ్‌ 5; హెట్‌మయర్‌ (బి) రషీద్‌ 16; పంత్‌ (సి) గోస్వామి (బి) సందీప్‌ 36; శ్రేయస్‌ (సి) విలియమ్సన్‌ (బి) శంకర్‌ 7; అక్షర్‌ పటేల్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ 1; రబాడ (బి) నటరాజన్‌ 3; అశ్విన్‌ (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 7; దేశ్‌పాండే నాటౌట్‌ 20; నార్జ్‌ (సి) గార్గ్‌ (బి) నటరాజన్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (19 ఓవర్లలో ఆలౌట్‌) 131; వికెట్ల పతనం: 1-1, 2-14,   3-54, 4-55, 5-78, 6-83, 7-103, 8-103, 9-125; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-27-2; నదీమ్‌ 1-0-8-1; హోల్డర్‌ 4-0-46-1; రషీద్‌ 4-0-7-3; నటరాజన్‌ 4-0-26-2; శంకర్‌ 1.5-0-11-1; వార్నర్‌ 0.1-0-2-0


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.