
తాజా వార్తలు
భళా శ్రీశాంత్..
అదరగొట్టిన కేరళ పేసర్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ పేసర్, కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ అదరగొట్టాడు. సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారె ట్రోఫీ గ్రూప్-సీ ఎలైట్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దాంతో ఎనిమిదేళ్ల తర్వాత లిస్ట్-ఏ క్రికెట్లో అతడీ ఘనత సాధించాడు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ గతేడాది సెప్టెంబర్‌తో ఆ గడువును పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జనవరి నుంచి కేరళ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.
ఇక ఈ ట్రోఫీలో శనివారం ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్‌లో.. శ్రీశాంత్ (2/41) ప్రదర్శన చేయగా.. ఉత్తర్ ప్రదేశ్‌పై విజృంభించాడు. అతడి ధాటికి (5/65) యూపీ 49.4 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. ప్రియమ్‌గార్గ్(57), అక్ష్‌దీప్‌నాథ్(68), గోస్వామి(54) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం కేరళ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప(81), సచిన్ బేబి(76) చెలరేగడంతో 48.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.
మరోవైపు శ్రీశాంత్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ వేలం కోసం దరఖాస్తు చేయగా.. దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో నిరాశ చెందిన అతడు వచ్చే ఏడాది మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పాడు. తాను అంత తేలిగ్గా క్రికెట్‌ను వదలనని, మరింత పట్టుదలగా ముందుకు సాగుతానని ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యూపీతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.