వర్షార్పణం
close

తాజా వార్తలు

Published : 19/06/2021 02:58 IST

వర్షార్పణం

ఆరంభం కాని డబ్ల్యూటీసీ ఫైనల్‌
తొలి రోజు ఆట రద్దు 
టాస్‌ కూడా వేయనివ్వని వరుణుడు

సౌథాంప్టన్‌: టాస్‌ మనదా.. వాళ్లదా? విరాట్‌ కోహ్లి టాస్‌ నెగ్గితే ఏం ఎంచుకుంటాడో? కేన్‌ విలియమ్సన్‌ ఎలా ఆలోచిస్తాడో? మనవాళ్లు బ్యాటింగా బౌలింగా? కివీస్‌ పేస్‌ను మన వాళ్లు కాచుకుంటారా? మన బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీస్తారా? శుభారంభం ఎవరిదో? పైచేయి బౌలర్లదా బ్యాట్స్‌మెన్‌దా? ఆట ఆఖరుకు ఆధిపత్యం ఏ జట్టుదో? ఇలా ఎన్నెన్నో ప్రశ్నల మధ్య భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ తొలి రోజు ఆట కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. సౌథాంప్టన్‌లో మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం నుంచే వర్షం మొదలవగా.. శుక్రవారం కూడా అది కొనసాగడంతో తొలి రోజు ఆటను రద్దు చేయక తప్పలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక ఏజీస్‌ బౌల్‌ తడిసి ముద్దవడంతో కనీసం టాస్‌ అయినా వేయకుండానే ఆటను అంపైర్లు రద్దు చేశారు. మధ్య మధ్యలో వరుణుడు కాస్త తెరపినిచ్చినా మైదానంలో పలు చోట్ల పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. వర్షం మళ్లీ మళ్లీ వస్తుండటంతో వాటిని తొలగించి ఆట మొదలుపెట్టేందుకు అవకాశం లేకపోయింది. అంపైర్లు మైకేల్‌ గాఫ్‌, రిచర్డ్‌ ఇలింగ్‌వర్త్‌ పలుమార్లు పరిశీలించాక స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం వర్షం పడదని, ఎండ కాస్తుందని వాతావరణ శాఖాధికారులు చెబుతుండటం ఊరటనిచ్చే విషయం. పరిస్థితులు బాగుంటే ఉదయం 10.30 గంటలకు ఆట మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండటంతో తొలి రోజు ఆట రద్దయినప్పటికీ.. మున్ముందు పరిస్థితులు బాగుంటే పూర్తి స్థాయిలో మ్యాచ్‌ నిర్వహించడానికి అవకాశముంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని