close

ప్రధానాంశాలు

పండగ చేసుకున్నారు!

సెంచరీలతో చెలరేగిన వార్నర్‌, ఫించ్‌
తొలి వన్డేలో ఆసీస్‌ చేతిలో భారత్‌ చిత్తు

శ్రీలంక, వెస్టిండీస్‌ లాంటి బలహీన జట్లతో పోటీపడితే ఏముంటుంది.. ఆస్ట్రేలియాతో తలపడితే వస్తుంది అసలు మజా..! సగటు క్రికెట్‌ అభిమాని ఆశ ఇది..!
మజా కాదు.. భారత అభిమానికి వేదన మిగిలింది. ఆస్ట్రేలియా మరిచిపోలేని ఓటమిని మిగిల్చింది. మంగళవారం వాంఖడెలో జరిగిన తొలి వన్డేలో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి.. అసలు పోటీనే లేకుండా చేసింది. మొన్నటివరకు వరుస పెట్టి గెలిచిన భారత జట్టేనా ఇది.. అన్నట్టుగా సాగింది కంగారూ జట్టు ఆధిపత్యం.
రెండు అత్యుత్తమ బౌలింగ్‌ దళాలు కలిగిన జట్ల మధ్య పోటీ..? బ్యాటింగ్‌ పిచ్‌పై బౌలర్ల మధ్య పోరాటం చూసి తీరాల్సిందే..! విశ్లేషకుల అంచనాలు ఇవి!
ఒక్కటంటే ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయింది కోహ్లీసేన. మ్యాచ్‌లో బౌలింగ్‌ ప్రదర్శన ఏపాటిదో చెప్పేందుకు ఇది చాలు. టీమ్‌ఇండియా ఆలౌటైన పిచ్‌పై భారత పేసర్లు గానీ.. స్పిన్నర్లు గానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న రీతిలో చెలరేగిపోయిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌లు దంచికొట్టి.. జట్టుకు ఘనవిజయాన్ని అందించారు.
ఒక్కటి మాత్రం వాస్తవం. వాంఖడెలో భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. పది వికెట్ల తేడాతో చిత్తయ్యింది. అసలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే స్కోరు బోర్డుపై కనిపించినంత బలహీన జట్టేం కాదు టీమ్‌ఇండియా. శుక్రవారం రాజ్‌కోట్‌లో జరిగే వన్డేలో  ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూద్దాం..!

ముంబయి

రంభం కుదర్లేదు.. మధ్యమం ఆకట్టుకోలేదు.. ఆఖర్లో ఊపు లేదు.. బ్యాటింగ్‌ మాత్రమే కాదు.. బౌలింగ్‌లోనూ పసలేదు..! ఆస్ట్రేలియాతో ఆసక్తికరంగా సాగుతుందనుకున్న వన్డే కాస్తా టీమ్‌ఇండియా వైఫల్యంతో ఏకపక్షంగా మారిపోయింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (128 నాటౌట్‌; 112 బంతుల్లో 17×4, 3×6), ఆరోన్‌ ఫించ్‌ (110 నాటౌట్‌; 114 బంతుల్లో 13×4, 2×6) కళ్లు చెదిరే సెంచరీలు సాధించడంతో తొలి వన్డేలో ఆసీస్‌ 10 వికెç్ల తేడాతో ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యాన్ని 37.4 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్‌ ధావన్‌ (74; 91 బంతుల్లో 9×4, 1×6), రాహుల్‌ (47; 61 బంతుల్లో 4×4) మినహా అంతా విఫలమయ్యారు. స్టార్క్‌ (3/56), కమిన్స్‌ (2/44), రిచర్డ్‌సన్‌ (2/43) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

పోటీపడి కొట్టారు: 256 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఇంత సులభంగా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. బలమైన భారత బౌలింగ్‌ లైనప్‌ ఆసీస్‌ను కొంతైనా నియంత్రిస్తుందని అనుకున్నారు.. కానీ ఛేదన ఆరంభమైన కాసేపటికే ఈ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. పోటీపడి మరీ ఆడిన వార్నర్‌, ఫించ్‌ భారత్‌ ఓటమికి ఆరంభంలోనే పునాది వేశారు. నియంత్రణ లేకుండా బౌలింగ్‌ చేసినందుకు భారత బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు. తొలి మూడు ఓవర్లలో 14 పరుగులే చేసిన ఆసీస్‌ ఓపెనర్లు.. ఆ తర్వాత నుంచి ఎడాపెడా బాదుడు షురూ చేశారు. ఫించ్‌ ఫోర్లతో వేట మొదలుపెట్టగా.. శార్దూల్‌ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదాన్ని సమీక్ష ద్వారా తప్పించుకున్న వార్నర్‌ అతని బౌలింగ్‌నే రెండు ఫోర్లు, సిక్స్‌ బాదాడు. బుమ్రాను లక్ష్యంగా చేసుకుంటూ వార్నర్‌, ఫించ్‌ దాడికి దిగడంతో పరుగులు వెల్లువెత్తాయి. 13 ఓవర్లకే ఆసీస్‌ స్కోరు 100 పరుగులు దాటగా.. 40 బంతుల్లో వార్నర్‌.. 52 బంతుల్లో ఫించ్‌ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. కోహ్లి ఎన్ని బౌలింగ్‌ మార్పులు చేసినా ఈ జోడీని మాత్రం విడగొట్టలేకపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో బౌండరీతో 88 బంతుల్లో వార్నర్‌ సెంచరీ సాధించగా, జడేజా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి ఫించ్‌ కూడా మూడంకెల స్కోరు అందుకున్నాడు. విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో వార్నర్‌.. వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఆసీస్‌ను గెలిపించాడు.

వాళ్లిద్దరూ నిలిచినా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరం
భంలోనే దెబ్బతగిలింది. రోహిత్‌శర్మ (10) స్టార్క్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయి మిడాఫ్‌లో వార్నర్‌కు చిక్కాడు.  ఆ తర్వాత ఓవర్లోనే శిఖర్‌ కూడా ఔటయ్యేవాడే. కమిన్స్‌ వేసిన బంతిని ధావన్‌ థర్డ్‌మన్‌ దిశగా గాల్లోకి కొట్టగా.. ఆ బంతి జంపా చేతుల్లో పడినట్లే పడి నేలపాలైంది. అక్కడ నుంచి ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన ధావన్‌.. రాహుల్‌తో కలిసి స్కోరు పెంచాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన శిఖర్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లోనూ వరుస బంతుల్లో రెండు బౌండరీలు సాధించాడు. రాహుల్‌ కూడా ఆఫ్‌సైడ్‌ చక్కటి కట్‌ షాట్లతో బౌండరీలు కొట్టి రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు.

30 పరుగులు..4 వికెట్లు: రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 113 బంతుల్లో 100 పరుగులు జత చేసిన ధావన్‌.. 66 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధావన్‌-రాహుల్‌ జోరు చూసి భారత్‌ స్కోరు సులభంగా 300 దాటుతుందని అనిపించింది. కానీ టీమ్‌ఇండియా 30 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి 134/1 నుంచి 164/5తో కష్టాల్లో పడిపోయింది. అర్ధసెంచరీకి చేరువైన రాహుల్‌.. అర్ధసెంచరీ తర్వాత ఒక జీవనదానం పొందిన శిఖర్‌ ఓవర్‌ తేడాతో ఔట్‌ కాగా.. కోహ్లి (16; 14 బంతుల్లో 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (4) ఎక్కువసేపు నిలువలేదు. విరాట్‌.. జంపాకు అతని బౌలింగ్‌లోనే క్యాచ్‌ ఇవ్వగా.. స్టార్క్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ కేరీకి అయ్యర్‌ దొరికిపోయాడు. ఈ స్థితిలో రిషబ్‌ పంత్‌ (28), జడేజా (25) ఆరో వికెట్‌కు 49 పరుగులు జత చేయడంతో భారత్‌ 213/6తో కోలుకుంది. కానీ వరుస ఓవర్లలో జడేజా, పంత్‌ ఔట్‌ కావడంతో భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. ఆఖర్లో శార్దూల్‌ (13), కుల్‌దీప్‌ (17), షమి (10) తలా చేయి వేయడంతో భారత్‌ స్కోరు 250 పరుగులు దాటింది.


పంత్‌కు  కంకషన్‌

భారత వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ కంకషన్‌ (తల అదరడం)కు గురయ్యాడు. భారత ఇన్నింగ్స్‌ 44వ ఓవర్లో కమిన్స్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ డెలివరీని పంత్‌ పుల్‌ చేయడానికి ప్రయత్నించగా.. మొదట బ్యాట్‌కు తగిలిన బంతి.. ఆ తర్వాత హెల్మెట్‌ను తాకి.. పాయింట్‌లో ఉన్న టర్నర్‌ చేతిలో పడింది. బంతి బ్యాట్‌కు తగల్లేదనుకున్న అంపైర్‌.. మొదట ఔట్‌ ఇవ్వలేదు. అయితే రిప్లే చూశాక పంత్‌ను ఔటైనట్లు ప్రకటించాడు. బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో పంత్‌ మళ్లీ మైదానంలో దిగలేదు. అతనికి బదులు కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ చేశాడు. పంత్‌కు బదులు మనీష్‌ పాండే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌ చేశాడు.


అక్కడే ఓడారు...!

అరె ఒక్క వికెటైనా తీయలేరా..? ఏమైంది మన బౌలింగ్‌కు. మరీ ఇంత ఘోర ప్రదర్శనా..? మంగళవారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ప్రదర్శన చూశాక సగటు అభిమానిని వేదిస్తున్న ప్రశ్నలు ఇవి. ఒక్క వికెటైనా పడగొట్టలేకపోవడం కచ్చితంగా వైఫల్యమే.. కొత్త బంతిని అనుభవజ్ఞులైన బుమ్రా, షమి ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆరంభంలో వారు లెంగ్త్‌ అందుకునే సరికి ఓపెనర్లు స్థిరపడిపోయారు. ఆ తర్వాత కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.  నిజానికి టీమ్‌ఇండియా బౌలింగ్‌కు దిగక ముందే ఓడిపోయింది. చిన్న స్టేడియం వాంఖడెలో.. పరుగులకు సహకరించే పిచ్‌పై భారత జట్టంతా కలిసి చేసిన పరుగులు 255 మాత్రమే. రోహిత్‌ త్వరగానే వెనుదిరిగినా.. ధావన్‌, రాహుల్‌లు ఫామ్‌ కొనసాగించి భాగస్వామ్యాన్ని నిర్మించారు. వారు ఇద్దరు క్రీజులో ఉన్నప్పుడు స్కోరు 300 దాటుతుందనిపించింది. అయితే వారిద్దరు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడం కోహ్లి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవడంతో భారత జట్టు కోలుకోలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు భారత్‌ను దెబ్బ తీశాయి. ముగ్గురు ఓపెనర్లు (రాహుల్‌, రోహిత్‌, ధావన్‌)లను జట్టులో ఆడించడం కోసం చేసిన ప్రయోగం ఫలించలేదు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం కెప్టెన్‌ కోహ్లి తాను ఎప్పుడూ వచ్చే మూడో స్థానాన్ని వదులుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ మూడో స్థానంలో రాగా.. కోహ్లి రావడానికి చాలా సమయం పట్టింది. 28వ ఓవర్లో అతడు బరిలో దిగాడు. ధాటిగా ఆడే క్రమంలోనే అతడు త్వరగా ఔటయ్యాడు. అతనితోపాటు శ్రేయస్‌ వెనుదిరగడంతో భారత్‌ భారీ స్కోరు అవకాశాలకు గండిపడింది. కోహ్లి ముందే వచ్చివుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదే. చురుగ్గా పరుగులు దొంగలించడంతో పాటు.. బౌలర్ల లయను దెబ్బతీయడంలో కోహ్లి దిట్ట. కానీ ఈ మ్యాచ్‌లో అతడొచ్చేసరికి బౌలర్లు కుదురుకుని బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించడం ఆరంభించారు. దీంతో భారత్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వార్నర్‌ (బి) స్టార్క్‌ 10; ధావన్‌ (సి) ఆగర్‌ (బి) కమిన్స్‌ 74; రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) ఆగర్‌ 47; కోహ్లి (సి) అండ్‌ (బి) జంపా 16; శ్రేయస్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 4; పంత్‌ (సి) టర్నర్‌ (బి) కమిన్స్‌ 28; జడేజా (సి) కేరి (బి) రిచర్డ్‌సన్‌  25; శార్దూల్‌ (బి) స్టార్క్‌ 13; షమి (సి) కేరి (బి) రిచర్డ్‌సన్‌ 10; కుల్‌దీప్‌ రనౌట్‌ 17; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 255.

వికెట్ల పతనం: 1-13, 2-134, 3-140, 4-156, 5-164, 6-213, 7-217, 8-229, 9-255; బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-56-3; కమిన్స్‌ 10-1-44-2; రిచర్డ్‌సన్‌ 9.1-0-43-2; ఆడమ్‌ జంపా 10-0-53-1; ఆగర్‌ 10-1-56-1
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ నాటౌట్‌ 128; ఫించ్‌ నాటౌట్‌ 110; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (37.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 258; బౌలింగ్‌: షమి 7.4-0-58-0; బుమ్రా 7-0-50-0; శార్దూల్‌ ఠాకూర్‌ 5-0-43-0; కుల్‌దీప్‌ 10-0-55-0; జడేజా 8-0-41-0


నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంపై గతంలో చాలాసార్లు చర్చించాం. రాహుల్‌ రాణిస్తుండడంతో అతణ్ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపాం. కానీ ఈ మార్పు సత్ఫలితాన్ని ఇచ్చిందని అనిపించడం లేదు. ఈ విషయంపై పునరాలోచన చేయాల్సి ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసి పరీక్షిస్తున్నాం. ఒక మ్యాచ్‌ ఓటమితో భయపడాల్సిన అవసరం లేదు. ప్రయోగాలు చేసినప్పుడు ఒక్కోసారి వైఫల్యం తప్పదు. ఆసీస్‌తో తొలి వన్డేలో అన్ని రంగాల్లోనూ విఫలమయ్యాం. బలమైన ఆసీస్‌పై బాగా ఆడకపోతే మూల్యం చెల్లించక తప్పదు. బౌలర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

- కోహ్లి


2

ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఆసీస్‌ సాధించిన రెండో అతిపెద్ద విజయం ఇది. 2017లో బంగ్లాదేశ్‌పై 279 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా అందుకుంది. ఛేదనలో ఇద్దరు ఆసీస్‌ ఓపెనర్లు సెంచరీ చేయడం కూడా ఇది రెండోసారి మాత్రమే. 


5

టీమ్‌ఇండియా వన్డేల్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు. స్వదేశంలో ఇది రెండోసారి మాత్రమే.


258

అభేద్యమైన తొలి వికెట్‌కు వార్నర్‌-ఫించ్‌ జోడించిన పరుగులు. భారత్‌పై ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.