Sports: పొవార్‌కే ఆ పదవి
close

ప్రధానాంశాలు

Updated : 14/05/2021 06:48 IST

Sports: పొవార్‌కే ఆ పదవి

భారత మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌గా మళ్లీ ఎంపిక

రమేశ్‌ పొవార్‌ మళ్లీ వచ్చేశాడు. మహిళల వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌తో గొడవ నేపథ్యంలో అప్పట్లో కోచ్‌గా వైదొలగిన అతడు.. మరోసారి మహిళల జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. డబ్ల్యూవీ రామన్‌ స్థానంలో పగ్గాలు చేపట్టనున్నాడు. ఈసారైనా వివాదాలకు తావు లేకుండా జట్టును నడిపిస్తాడా అన్నది చూడాలి.

దిల్లీ

టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ రమేష్‌ పొవార్‌ తిరిగి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. డబ్ల్యూవీ రామన్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న అతను.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించనుండడం విశేషం. కొత్తగా కోచ్‌ పదవి కోసం రామన్‌తో సహా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులకు ముఖాముఖీ నిర్వహించిన మదన్‌ లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) 42 ఏళ్ల పొవార్‌ పేరును ప్రతిపాదించింది. ఆ తర్వాత కోచ్‌గా రమేష్‌ పొవార్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మాజీ ప్రధాన సెలక్టర్‌ హేమలతతో సహా నలుగురు మహిళలు, టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ అజయ్‌ రత్రా కూడా కోచ్‌ పదవి రేసులో నిలిచినా వాళ్లకు నిరాశ తప్పలేదు. ‘‘భారత మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన సీఏసీకి, బీసీసీఐకి చాలా ధన్యవాదాలు’’ అని పొవార్‌ ట్వీట్‌ చేశాడు. అయితే రెండేళ్ల క్రితం వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌తో విభేదాల కారణంగా అప్పుడు కోచ్‌గా ఉన్న పొవార్‌పై వేటు వేసి రామన్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. తాజాగా తిరిగి పొవార్‌నే ఇప్పుడు ఎంపిక చేసిన నేపథ్యంలో.. అతనికి, మిథాలీకి మధ్య మంచి వాతావరణం ఉంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘మిథాలీతో వివాదం గురించి ముఖాముఖిలో పొవార్‌ను అడిగాం. అందులో తన తప్పేమీ లేదని అతను చెప్పాడు. క్రికెటర్లందరితో కలిసి పని  చేయడానికి సిద్ధంగానే ఉన్నానన్నాడు’’  అని మదన్‌ లాల్‌ పేర్కొన్నాడు.

అప్పుడేం జరిగింది..

2018 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌లో మిథాలీని తుది జట్టులోకి తీసుకోలేదు. జట్టు మేనేజ్‌మెంట్‌ తీసుకున్న ఆ నిర్ణయం అప్పుడు పెను దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడంతో ఆ వివాదం పెద్దదిగా మారింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు కోచ్‌గా ఉన్న రమేశ్‌ పొవార్‌పై మిథాలీ ఆరోపణలు చేసింది. ‘‘పొవార్‌ జట్టును నాశనం చేస్తున్నాడు. నాలాంటి క్రికెటర్లను  అవమానిస్తున్నాడు. జట్టు ఎంపికలో పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నాడు. నెట్‌ సెషన్స్‌లో ప్రాక్టీస్‌ సందర్భంగా అసలు నన్ను పట్టించుకోవట్లేదు’’ అని బీసీసీఐకి రాసిన లేఖలో మిథాలీ పేర్కొంది. అయితే ఆమె ఆరోపణలపై స్పందించిన పొవార్‌.. ‘‘మిథాలీ కేవలం సొంత మైలురాళ్ల కోసమే ఆడుతోంది. ఆమె మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తుండడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. కోచ్‌లను భయపెట్టడం మాని ఆమె జట్టు గురించి ఆలోచించాలి’’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అన్ని విషయాలను లెక్కలోకి తీసుకుని పొవార్‌పై వేటు వేసి కోచ్‌గా రామన్‌ను ఎంపిక చేసింది.

ఇప్పుడు ఎలా?: భారత మహిళల జట్టు కోచ్‌ పదవి నుంచి తీసేసిన తర్వాత పొవార్‌ తన సామర్థ్యాన్ని చాటాడు. ఈ ఏడాది విజయ్‌ హజారే ట్రోఫీలో కోచ్‌గా ముంబయికి టైటిల్‌ అందించాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో బౌలింగ్‌ కోచ్‌గానూ పనిచేశాడు. మరోవైపు రామన్‌ కోచింగ్‌లోని అమ్మాయిల జట్టు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఘోరంగా విఫలమైంది. మార్చిలో సొంతగడ్డపై ఆ జట్టుతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే రామన్‌పై వేటు పడింది. అయితే ఇప్పుడు తిరిగి కోచ్‌గా ఎంపికైన పొవార్‌ జట్టుతో ఎలాంటి సంబంధం కొనసాగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు కూడా వన్డే కెప్టెన్‌గా మిథాలీనే ఉంది. ఆమెతో కలిసి జట్టుకు విజయాలు అందించేందుకు అతను శ్రమించాల్సి ఉంది. ఈ ఇద్దరి మధ్య గత వివాదం నేపథ్యంలో మళ్లీ పొరపచ్చాలు తలెత్తుతాయా? లేదా జట్టు కోసం కలిసి పనిచేస్తారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వచ్చే ఏడాదిలో న్యూజిలాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఆ మెగా టోర్నీలో విజయం దిశగా జట్టును సమర్థంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కెప్టెన్‌గా మిథాలీపై, కోచ్‌గా పొవార్‌పై ఉంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన