పరిహారం చెల్లించినా.. ఖైదీలుగానే
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరిహారం చెల్లించినా.. ఖైదీలుగానే

 దుబాయి జైలులో మగ్గుతున్న సిరిసిల్ల వాసులు
  క్షమాభిక్ష పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ
 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంపై ఆశలు  

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి దుబాయికి వలస వెళ్లిన అయిదుగురు కూలీలు అక్కడ ఓ హత్య కేసులో 25 ఏళ్ల జీవితఖైదు అనుభవిస్తున్నారు. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుని 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 8 ఏళ్ల క్రితం హతుని కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించి.. వారి నుంచి క్షమాభిక్ష పత్రం తీసుకున్నారు. కూలీల తరఫున వాదించే న్యాయవాది లేక.. ఇతర ప్రక్రియలు పూర్తికాక వారు జైలులోనే మగ్గుతున్నారు. వారి క్షమాభిక్ష పిటిషన్‌పై ఈ నెల 14న దుబాయి కోర్టులో మరోసారి విచారణ జరగనుంది. హతుని కుటుంబానికి పరిహారం అందించేందుకు సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌.. మరోసారి ఈ విషయంపై దృష్టిపెట్టి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో వారిని విముక్తులను చేయాలని వారి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్‌, గొల్లెం నాంపల్లి, జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతులు దుబాయిలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అక్కడి వాచ్‌మెన్‌ (నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్‌రాయ్‌) హత్య కేసులో 2005లో వీరికి 25 ఏళ్ల జీవిత ఖైదు పడింది. దుబాయి చట్టాల ప్రకారం హతుని కుటుంబానికి పరిహారం చెల్లించి, వారి నుంచి క్షమాభిక్షకు వాంగ్మూలం తీసుకుంటే కోర్టులు విడుదల చేస్తాయి. ఈ క్రమంలో ఆ కూలీల కుటుంబ సభ్యుల దీనావస్థను చూసి మంత్రి కె.తారకరామారావు స్పందించారు. 2013లో స్వయంగా రూ.15 లక్షలు సమకూర్చి.. నేపాల్‌లోని హతుని భార్య దిల్‌కుమార్‌రాయ్‌కి అందించండతో వారు క్షమాభిక్ష పత్రాన్ని ఇచ్చారు. ఆ పత్రాలను దుబాయి జైలుకు పంపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఖైదీల తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది లేకపోవడం, హతుని భార్య స్వయంగా హాజరై క్షమాభిక్ష వాంగ్మూలం ఇవ్వాలనే నిబంధన నేపథ్యంలో ఆ పిటిషన్‌ పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఖైదీల విడుదలకు ఆర్థికసాయం అందించిన మంత్రి కేటీఆర్‌ మరోమారు చొరవ చూపాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దుబాయి న్యాయస్థానంలో వాదనలు వినిపించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా ఏర్పాట్లు చేయించాలని కోరుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు