పాలమూరు-రంగారెడ్డి పనుల తనిఖీ

ప్రధానాంశాలు

పాలమూరు-రంగారెడ్డి పనుల తనిఖీ

ఈనాడు డిజిటల్‌, నాగర్‌కర్నూల్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఫిర్యాదులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు బుధవారం నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో పర్యటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా చేపడుతున్నారని.. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు రెండు ఫిర్యాదులు అందాయి. స్పందించిన ట్రైబ్యునల్‌.. జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని జలవనరులు, నదీ అభివృద్ధి, గంగానది పునరుజ్జీవం, కృష్ణాబోర్డు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో నిపుణులైన ఆరుగురితోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ను సభ్యులుగా నియమిస్తూ కమిటీని ఏర్పాటుచేసింది. అది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించి వివరాలు సేకరించనుంది. ఈ క్రమంలో మొదటి రోజు నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని నార్లాపూర్‌, ఏదుల, వట్టెం ప్రాంతాల్లోని జలాశయాలను, సొరంగం పనులను, పంప్‌హౌస్‌లను తనిఖీ చేసింది. పరిశీలన బృందంలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాస్త్రవేత్తలు ఆర్కియా లెనిన్‌, పూర్ణిమ, మేఘనాథన్‌, సీˆడబ్ల్యూసీˆ సంచాలకులు రమేష్‌కుమార్‌, కృష్ణా బోర్డు సభ్యులు మౌంతంగ్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, సీతారామారావు, నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజినీరు హమీద్‌ఖాన్‌, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని