close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఖరీఫ్‌ నాటికైనా కొలిక్కి వస్తుందా?

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గుర్తింపులో జాప్యం
మళ్లీ అదనపు సమాచారం కోరిన జలసంఘం
కేంద్రం ఎలా ముందుకెళ్తుందనే దానిపై అధికారుల చర్చ

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని గుర్తించే అంశంలో జాప్యం కొనసాగుతోంది. వచ్చే ఖరీఫ్‌ ఆరంభం నాటికైనా కేంద్రం నోటిఫై చేస్తుందా? అనే ప్రశ్నకు ‘అనుమానమే’! అనే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సిందేనని పట్టుబడుతుండగా, తెలంగాణ మాత్రం వ్యతిరేకిస్తూ వస్తోంది. రెండు రాష్ట్రాల వాదనలు ఇలా ఉండగా..‘ఇది తమ పరిధిలోని అంశం కాబట్టి నోటిఫై చేసి తీరుతామంటూ’ ఐదునెలల క్రితం కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు వ్యవహారం కొలిక్కిరాలేదు. కేంద్రజల్‌శక్తి మంత్రి పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో నాలుగు లోక్‌ సభల పరిధి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూ అక్కడే మకాం వేశారు. దీంతో ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. దీనికితోడు కేంద్రజల్‌శక్తి, జలసంఘం, కృష్ణా, గోదావరి బోర్డుల కార్యాలయాల్లో పనిచేసే పలువురు అధికారులు విధులకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ అంశంలో జాప్యం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జల్‌శక్తిశాఖ వర్గాలే చెబుతున్నాయి.
మారిన కేంద్రం వైఖరితో..
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు 2014లో ఏర్పాడ్డాయి. అప్పటినుంచి బోర్డుల పరిధిలోకి ఏయే ప్రాజెక్టులు తేవాలి? ఎలాంటి అధికారాలు ఉండాలనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ముసాయిదా కూడా తయారైంది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా వీటి నుంచి నీటిని తీసుకొనే కాలువల వరకే కృష్ణాబోర్డును పరిమితం చేయాలని మొదట ప్రతిపాదించినా తర్వాత మార్చారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులున్న ప్రాజెక్టులను మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. అందుకుభిన్నంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ నుంచి నీటిని తీసుకొనే అన్ని జలాశయాలు సహా బచావత్‌ కేటాయింపులున్న, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులున్న ప్రాజెక్టులను కూడా బోర్డుల పరిధిలోకి తేవాలని తాజాగా కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది.
అదనపు సమాచారం కోరిన జల సంఘం
ఈ అంశంపైనే శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డు అధికారులు, కేంద్ర జలసంఘం అధికారుల మధ్య మరోసారి చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంలో అదనపు సమాచారం కోరడంతోపాటు కొన్ని మార్పులను కూడా కేంద్రం జలసంఘం సూచించినట్టు తెలిసింది. కేంద్ర జలసంఘం అడిగిన తాజా వివరాలు, మార్పులకు సంబంధించిన సమాచారం ఒకట్రెండు రోజుల్లో బోర్డుల నుంచి వెళ్లే అవకాశం ఉంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పువచ్చే వరకు బోర్డు పరిధిని నోటిఫై చేయవద్దని తెలంగాణ గట్టిగా కోరుతున్న నేపథ్యంలో కేంద్రం ఎలా ముందుకెళ్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ముందుకెళ్లే పక్షంలో ఏం చేయాలనే అంశంపైనా ఈ సమావేశం అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌.. సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో చర్చించినట్లు తెలిసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు