సౌర ఫలకాల నీడన సాగు

ప్రధానాంశాలు

సౌర ఫలకాల నీడన సాగు

జయశంకర్‌ వర్సిటీలో బెంగళూరు అంకుర సంస్థ శ్రీకారం
తొలిగా 4 రకాల పంటల సాగుకు ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌ : ‘సోలికల్చర్‌’...వ్యవసాయ రంగంలో కొత్తగా పుట్టుకొచ్చిన సాగు విధానమిది. సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఏర్పాటుచేసే సౌరఫలకాల కింద వాటి నీడలో పంటలు సాగుచేసే విధానాన్నే సోలికల్చర్‌ అని పిలుస్తున్నారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్‌, అమెరికా, ఇటలీ తదితర 9 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ విధానంలో పంటల సాగు మొదలైంది. మనదేశంలో తొలిసారి హైదరాబాద్‌ శివారు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో 5 ఎకరాల్లో 4 రకాల పంటలను ఈ విధానంలో సాగుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ అంకుర సంస్థ పూర్తి ఖర్చుతో ఈ విధానంలో పంటలను సాగుచేసి దిగుబడులు సాధించి చూపుతామని ముందుకు రావడంతో ఈ పరిశోధనలకు వర్సిటీ పచ్చజెండా ఊపింది.

సాధారణ సౌరఫలకాల కింద నీడ ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో వాటి నుంచి కిందకు కాంతి ప్రసారమయ్యే కొత్త రకం సౌరఫలకాలను తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ఎండవేడి కిందకు ప్రసారమయ్యే ఫలకాలను తయారు చేస్తోంది. వాటి సాయంతో ‘ఆగ్రో ఫొటో ఓల్టాయిటిక్‌’ అనే పేరిట వాటి కింద ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. ఇదే విధానాన్ని భూమి ఇస్తే జయశంకర్‌ వర్సిటీలో చేసి చూపిస్తామని ముందుకొచ్చింది. వర్సిటీ నిధులేమీ పెట్టాల్సిన అవసరమే లేదని, తామే మొత్తం ఖర్చుపెట్టి ఫలితాలను చూపిస్తామని తెలిపింది. సౌరఫలకాల నీడన కూడా మొక్కలు పెరిగి, పూత కాత వస్తాయని పలు దేశాల్లో నిరూపితమైనందున ఇక్కడ తొలుత 4 రకాల పంటల సాగుకు అనుమతి ఇచ్చినట్లు జయశంకర్‌ వర్సిటీ ఉపకులపతి (వీసీ) వి.ప్రవీణ్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు. భవిష్యత్తులో సౌరఫలకాల ఏర్పాటుకు లక్షలాది ఎకరాలు వినియోగిస్తారు. ఆ భూములను సద్వినియోగం చేసేందుకు సోలికల్చర్‌ అతి పెద్ద అవకాశమని ఆయన చెప్పారు.

రెండు విధాలా ఆదాయం

ఒక రైతు 5 ఎకరాల్లో మెగావాట్‌ సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యమున్న ఫలకాలను ఏర్పాటు చేసుకునేందుకు ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజుకిస్తే ఏటా కౌలురూపంలో ఆదాయం వస్తుంది. అలాగే సౌరఫలకాల కింద యథావిధిగా పంటలు పండించుకోవడం ద్వారానూ రాబడి పొందొచ్చు. ఇలా భవిష్యత్తులో భూములను రెండు రకాలుగా వాడుకుంటేనే దేశ ఇంధన, ఆహార అవసరాలు తీరుతాయని ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని