close
హృద్యంగా...రమ్యంగా...

అంతరంగాన్ని పరవశింపజేసే ప్రేమ అంతరాలను చూడదు. సఫలం కాకపోయినా చిరకాలం జ్ఞాపకమై పరిమళిస్తుంది. అలాంటి ప్రేమానుభూతులను జీవితానుభవాల రూపంలో రమ్యంగా చిత్రించిన పుస్తకం ఇది. 103 కథలున్న ఈ సంకలనం కథన నైపుణ్యానికీ సంభాషణల చాతుర్యానికీ మచ్చుతునకగా నిలుస్తుంది. అగ్రహారం పరిసరాల్లోని ప్రకృతినీ బతుకులనూ ఆత్మీయమైన శైలిలో అక్షరీకరించారు. అంధుడైన కుర్రాడు జట్కాబండిలో ఓ అమ్మాయితో ప్రయాణించి సినిమాకు వెళ్లిన సంఘటనను అనూహ్యమైన కొసమెరుపుతో చిత్రిస్తుందో కథ. ‘పెదవులూనిన చోట’లో కమిలి, ‘సుక్కల్లో పెదసుక్క’లో చంద్రి, ‘కొండెక్కిన దీపం’లో గౌరి... ఇలా ఎన్నో పాత్రలు పాఠకులను వెంటాడతాయి. క్లుప్తత, ఆర్ద్రత, గాఢత... మౌలిక లక్షణాలుగా అమరిన ఈ పుస్తకం విశిష్టమైన శిల్పంతో కథాభిమానులను ఆకట్టుకుంటుంది.

- సిహెచ్‌.వేణు
అగ్రహారం కథలు
రచన: జగన్నాథ శర్మ
పేజీలు: 240; వెల: రూ. 207/-
ప్రతులకు: ఫోన్‌-9849181712


అమెరికా నేపథ్యంలో

అమెరికాలో నివసించే తెలుగువారి ఆలోచనలు, ఆందోళనలు, సంఘర్షణలు, సంతోషాలతో నిండిన కథల కదంబమే ‘చైతన్యం’. మూడు దశాబ్దాలక్రితం అమెరికాకు వెళ్లినవారు ఎదుర్కొన్న సమస్యలు వేరు, ఇప్పటితరం పడుతున్న పాట్లు వేరు. కథల్లో ఆ వ్యత్యాసాన్ని రచయిత్రి చక్కగా ఆవిష్కరించారు. అమెరికా సంస్కృతినీ, జీవనవిధానాన్నీ అతిగా ఆరాధించేవారికి చివరికి మిగిలేదేమిటో ‘చైతన్యం’ కథలో చెప్పారు. ఆ సంస్కృతిని అలవరచుకునే ప్రయత్నంలో భార్యకి దూరమైన గోపాలానికి తర్వాత కనువిప్పు కలిగినా ఫలితం ఉండదు. చివరికి ‘మంచి స్నేహితుల్లా ఉందా’మన్న భార్య మాటే అతడికి అమృతతుల్యంగా అనిపిస్తుంది.

- నీలి వేణుగోపాల్‌
చైతన్యం (కథలు)
రచన: సోమ సుధేష్ణ
పేజీలు: 232; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 8096310140


గెలుపు కథ

శారీరక వైకల్యం, సమాజంలోని కొందరి చిన్నచూపుతోపాటు పేదరికాన్నీ అధిగమించిన ధీరోదాత్త నవలా నాయకుడి అంతరంగ మథనానికి అక్షర రూపమే ఈ ‘పడిలేచే కెరటం’. అందరిలా నడవాలనీ అంతకుమించి పరిగెత్తాలనీ ఉన్నా- ఆ పనిచేయలేని దీనావస్థ నుంచి అతడి ఆత్మశక్తి పెరిగి విస్తరిస్తుంది. అమ్మ ఇచ్చిన ధీమాతో చదువుకుని నెగ్గి తీరాలన్న కసితో దుర్భర దారిద్య్రాన్నీ ఎదిరిస్తాడు. స్నేహం, ప్రేమ, ఉపాధి వంటి దశలన్నీ దాటాక నిండైన కుటుంబజీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఇంకా తీరని కోరికంటూ ఉందా అని ఒకరడిగితే ‘ఉంది, పరిగెత్తాలని’ అంటూ దూరంగా క్రికెట్‌ ఆడుతున్న పిల్లలవైపు చూస్తూ మనసులోని మాట చెబుతాడు. పడినా లేవడం అలవాటైన కెరటమే విజయానికి సిసలైన చిరునామా అని చెబుతుందీ నవల.

- శరత్‌
పడిలేచే కెరటం (నవల),
రచన: సలీం
పేజీలు: 368; వెల: రూ.200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


భావప్రధానం

ఉత్తరాది నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ కథకుడూ కవీ హీరాలాల్‌ రాయ్‌. ఇక్కడి ప్రజాజీవితంతో మమేకమైన ఆయన ప్రగతి వాదంతో పాటు ప్రణయాన్నీ అద్భుతంగా వ్యక్తీకరించారు తన రచనల్లో. హిందీలో రాసిన ఈ కవితల్ని అంతే అద్భుతంగా అనువదించారు ఆయన సమకాలికులు. ‘అమృతపథం’ ఓ ప్రణయసంభాషణలాగా సాగుతుంది. చేతిలో అగ్నిఖడ్గం ధరించి/ చీకటి కడుపును చీలుస్తూ/సుడిగాలితో నేస్తం కట్టి/ కీకారణ్యాలు దాటి/ నీకోసం వస్తున్నా- అంటూ శరీరాలు దూరంగా ఉన్నా విడివడని ప్రేమబంధాన్ని చాటుతారు. ‘ప్రణయసౌధం’ తాజ్‌మహల్‌కు ప్రతీకగా చిత్రించిన కవిత. కవితలన్నీ భావప్రధానంగా గేయరూపంలో సాగుతాయి.

- పద్మ
హీరాలాల్‌ రాయ్‌ కవిత్వం
అనువాదం: ఊటుకూరు రంగారావు, దాశరథి
పేజీలు: 126; వెల: రూ. 55/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.