close

బ్రహ్మ మురారి సురార్చిత లింగం...

‘ సర్వం ఈశ్వరమయం జగత్‌’ అంటారు. శివారాధన చేయకపోయినా... ‘ఓం నమఃశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా పుణ్యమే అని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆ ఆలయంలో ఎక్కడ చూసినా ఈశ్వర చైతన్యం కనిపిస్తుంది. ప్రతిచోటా లింగాలతో నిండిపోయిన ఆ క్షేత్రంలోకి అడుగుపెడితే... శివసన్నిధానంలో ఉన్న భావన కలుగుతుంది. లక్షల శివలింగాలతో అడుగడుగునా భక్తిపారవశ్యాన్ని నింపే ఆ ఆలయమే మహాలింగ సామ్రాజ్యంగా కొలువైన కోటిలింగేశ్వరాలయం.

హాశివరాత్రి రోజున... శివలింగానికి చేసే అభిషేకాలతో, పూజలతో ప్రతి శివాలయం కళకళలాడుతుంది. కానీ కోటిలింగేశ్వరాలయంలో ఒక శివలింగానికి అభిషేకం చేయడానికి కూర్చుంటే, పక్కనే మరొకటి ఉంటుంది. ఆ పక్కన ఇంకొకటి... చూస్తే, చుట్టూ లెక్కపెట్టలేనన్ని శివలింగాలు కనిపిస్తాయి. రకరకాల సైజుల్లో లక్షల సంఖ్యలో శివలింగాలు ఉంటాయక్కడ. ఈ ఆలయం కర్ణాటకలోని బంగారు గనులకు ప్రసిద్ధి అయిన కోలార్‌ నగరంలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుత వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించిన ఈ శివక్షేత్రం... భక్తులకు శివసన్నిధానంలో ఉన్న భావనను కలిగిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లేకొద్దీ ఒక అడుగు మొదలుకొని, నాలుగైదు అడుగుల ఎత్తు వరకూ శివలింగాలు ఉంటే... వాటన్నింటి మధ్యా విశ్వరూపంలో దర్శనమిస్తూ భారీ శివలింగం, దానికి అభిముఖంగా నందీశ్వరుడి విగ్రహం... అంబరాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా కొలువై కనిపిస్తాయి. ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే పెద్దది. 108 అడుగుల ఎత్తులో శివలింగం, 35 అడుగుల ఎత్తులో నందివిగ్రహం ఉంటాయి. ఏకకాలంలో మహాశివలింగంతోపాటు ఇన్ని లక్షల లింగాలను దర్శించుకోవడం భక్తులకు మర్చిపోలేని అనుభూతినీ, భక్తిపారవశ్యాన్ని కలిగిస్తుంది. కావడానికి ఇది శివాలయమైనా ఇక్కడ పదకొండు ఉపాలయాలూ నెలకొని, పూర్ణయాత్రా ఫలితాన్ని అందిస్తున్నాయి. వీణాపాణీ సమేతంగా బ్రహ్మ, లక్ష్మీనారాయణుడిగా విష్ణువు, కోటిలింగేశ్వరుడిగా శివుడూ కొలువుదీరితే... అన్నపూర్ణేశ్వరి, కారుమారి అమ్మ, వెంకటేశ్వరస్వామి, సీతారామలక్ష్మణ ఆలయం, పంచముఖ గణపతి, ఆంజనేయుడు, కన్యకా పరమేశ్వరి, సంతోషిమాత... ఇలా సమస్త దేవతలూ ఇక్కడ కొలువై భక్తులకు దర్శనం ఇస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు గుళ్లల్లో పూజలు చేయించుకోవడమే కాదు, అక్కడున్న శివలింగాల్నీ పూజించొచ్చు. ఇది ఆలయమైనా... కర్ణాటక ప్రభుత్వం దీనికి పర్యటక ప్రాంతంగానూ గుర్తింపునిచ్చింది. అందుకే మహాశివరాత్రి, కార్తికమాసంలోనే కాదు, ఏడాది పొడవునా లక్షలాది భక్తులు ఈ శివసన్నిధానాన్ని దర్శించుకుంటారు. శివరాత్రి రోజున ఈ గుడిలోని మహాశివలింగానికి జరిగే ప్రత్యేక అభిషేకాలు కన్నులపండువగా ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ఏర్పాటు వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

శివుడు కలలో కనిపించి...
ఎంతచూసినా తనివి తీరని శివధామంగా వర్ధిల్లే ఈ క్షేత్రాన్ని స్వామి సాంబశివమూర్తి అనే భక్తుడు నిర్మించాడు. కొన్నేళ్లక్రితం ఆయన ఓ ఫ్యాక్టరీలో చిరుద్యోగిగా పనిచేసేవాడు. ఆయనకు శివుడు రోజూ కలలో కనిపించేవాడట. శివభక్తుడైన ఆయన చివరకు ఓ శివాలయాన్ని కట్టించాలని నిర్ణయించుకుని ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. అప్పటివరకూ దాచుకున్న డబ్బును ఈ ఆలయం కోసం ఉపయోగించాడు. 1978లో మొదలుపెడితే రెండేళ్లకు ఈ గుడి పూర్తయ్యింది. దాంతో 1980 అక్టోబరులో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని ప్రారంభించాడు. అప్పుడే ఇక్కడ కోటి శివలింగాల్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడట. రోజులుగడిచేకొద్దీ ఆయన అనుకున్నట్లుగా శివలింగాల సంఖ్యా పెరిగి ఇప్పుడు దాదాపు తొంభైలక్షలకు చేరుకుంది. ఈ ఆలయాన్ని ప్రారంభించిన పదిహేనేళ్లకు 108 అడుగుల ఎత్తులో శివలింగాన్నీ, నంది విగ్రహాన్నీ ప్రతిష్ఠించారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఇన్ని లక్షల లింగాల్లో కొన్నింటిని భక్తులే ఏర్పాటు చేయడం విశేషం. అంటే... ఆసక్తి ఉన్నవారెవరైనా... కొంత డబ్బు చెల్లించి, వారి పేరుమీద ఓ శివలింగాన్ని నచ్చిన సైజులో ఏర్పాటు చేయించుకోవచ్చు. ఈ శివలింగాల తయారీకి కృష్ణశిల అనే రాయిని వాడతారు. ఈ గుడికి మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి.

ఈ గుడిలో భోజనశాల ఉంది. రోజూ ఈ గుడికి ఎంతమంది వస్తే అంతమందికి రెండుపూటలా అక్కడ నిర్ణీత సమయంలో ఉచితంగా భోజనం పెడతారు. ఇందుకు అవసరమైన కూరగాయల్ని ఈ గుడి యాజమాన్యమే పండిస్తుంది. అలాగే ఈ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆరోగ్యకేంద్రంలో ఉచితంగా వైద్య పరీక్షలూ చేయించుకోవచ్చు. అవసరమైనవారికి మందులూ అందిస్తారు ఇక్కడి నిర్వాహకులు. పదిహేను ఎకరాల్లో ఉన్న ఈ ఆలయాన్నీ దానికి చుట్టుపక్కల ఏర్పాటుచేసిన ధ్యానమందిరం, గోశాల... మొదలైన వాటన్నింటినీ తిరిగి చూడ్డానికి ఒక రోజైనా పడుతుందనడంలో ఆశ్చర్యంలేదు. ఉదయం అయిదు నుంచి రాత్రి తొమ్మిదిగంటవరకూ భక్తులు నిరంతరాయంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవచ్చంటే...
ఎంతో అరుదైన శివసన్నిధానంగా పేరొందిన ఈ కోటిలింగేశ్వరాలయం కోలార్‌, కమ్మసంద్రంలోని గట్టిరగడహళ్ళిలో ఉంది. బెంగళూరు వరకూ విమానంలో చేరుకుని అక్కడినుంచి కోలార్‌ మీదుగా ఆలయానికి వెళ్లొచ్చు. రైలు మార్గంలో అయితే... బంగారపేటలో దిగి అక్కడినుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి వెళ్ళొచ్చు. లేదంటే బెంగళూరు నుంచి నేరుగా వెళ్లే ప్యాసింజర్‌ రైలు కూడా ఉంది. రోడ్డుమార్గంలో అయితే... కోలార్‌, కమ్మసంద్రం మీదుగా ఈ గుడికి చేరుకోవచ్చు.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.